Telugu Varsity
-
హాజరైతేనే భోజనం
హైదరాబాద్: విద్యార్థులు క్రమం తప్పకుండా క్లాస్‌లు వినేందుకు పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో ఓ వినూత్న విధానాన్ని ప్రవేశపెట్టినట్లు వీసీ ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ తెలిపారు. గురువారం ఓయూలో జరిగిన ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం యూనివర్సిటీకి ఓయూలో, బాచుపల్లిలో హాస్టల్స్ ఉన్నాయని, వీటిలో భోజన వసతి కూడా ఉండేదని వీసీ తెలిపారు. అయితే ఇకపై ఈ హాస్టళ్లలో ఉదయం, రాత్రి వేళల్లో మాత్రమే భోజనాన్ని అందిస్తామని వెల్లడించారు. మధ్యాహ్న భోజనాన్ని ఇకపై నాంపల్లిలోని యూనివర్సిటీ సెంటర్లో మాత్రమే అందించనున్నట్లు తెలిపారు. దీంతో విద్యార్థులంతా క్రమం తప్పకుండా తరగతులకు హాజరవుతారని భావిస్తున్నట్లు చెప్పారు. -
తెలంగాణ సాహిత్య అకాడమీ నా కల
- అకాడమీ ఏర్పాటు చేసినందుకు సీఎంకు కృతజ్ఞతలు - అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన నందిని సిధారెడ్డి హైదరాబాద్: ‘‘తెలంగాణ ఏర్పాటు కావాలనేది నా మొదటి కల. తెలంగాణ సాహిత్య అకాడమీ స్థాపన నా రెండో కల. ఇప్పుడు ఈ 2 స్వప్నాలు నెరవేరడం సంతోషంగా ఉంది’’ అని రాష్ట్ర సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడిగా నియమితులైన డాక్టర్ నందిని సిధారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రవీంద్రభారతిలో అకాడమీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యతలు స్వీకరిం చారు. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కేవీ రమణా చారి, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం సమక్షంలో అధ్యక్ష ఆసనంలో కూర్చున్నారు. ఈ సందర్భంగా రవీంద్రభారతి ప్రధాన వేదికపై అభినందన సత్కార సభ జరిగింది. కేవీ రమణాచారి అధ్యక్షోపన్యాసం చేస్తూ.. నందిని సిధారెడ్డి గొప్ప బావుకుడని, తెలంగాణ సాహిత్య అకాడమీకి అధ్యక్షుడిగా నియమితులవుతూనే.. తన వెంట ప్రపంచ తెలుగు మహా సభలను తీసుకొస్తున్నారని అన్నారు. కవులే నా సంపద: సిధారెడ్డి సిధారెడ్డి తన స్పందనను తెలియజేస్తూ.. సీఎంతో ఉన్న సాన్నిహిత్యంతో కేబినెట్ హోదా తీసుకునే శక్తి ఉన్నా.. తెలుగు సాహిత్యంపై మమకారంతో ఆ పని చేయలేదని, ఆలస్యంగానైనా అకాడమీ అధ్యక్షుడిగా నియమితులైనందుకు గర్వంగా ఉందని చెప్పారు. కవులే తన సంపదని అన్నారు. 34 ఏళ్ల తర్వాత కొత్త రాష్ట్రంలో కొత్త అకాడమీని ఏర్పాటు చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాహిత్యప్రచారం, పరిశోధన, ప్రచురణలు, వర్తమాన కవులకు ప్రోత్సాహం వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు. కొత్త తరానికి శిక్షణ ఇచ్చే ప్రయత్నం చేస్తామన్నారు. పుస్తకాలను అచ్చు వేయలేని వారిని ప్రోత్సహిస్తామని ప్రకటించారు. ప్రజల ఆకాంక్షలు తీర్చడానికి కృషి ప్రజల ఆకాంక్షలను తీర్చడానికి సాహిత్య అకాడమీ కృషి చేస్తుందని, సాహిత్య అకాడమీ తెలుగు వర్సిటీతో కలసి పనిచేస్తుందని తెలుగు వర్సిటీ వీసీ ఆచార్య యస్వీ సత్యనారాయణ అన్నారు. వివక్షకు గురైన కళలు, సాహిత్యం, చరిత్రకు పూర్వ వైభవం వస్తుం దని, తెలంగాణలో సాహిత్య అకాడమీ దేశంలోనే ఆదర్శవంతంగా నిలుస్తుందని బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు ఆకాంక్షించారు. అన్ని అర్హతలున్న వ్యక్తికి సాహిత్య అకాడమీ పదవి దక్కిందని, తెలం గాణ సాహిత్యం మళ్లీ ఓ వెలుగు వెలుగుతుందని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి, టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి, ప్రముఖ రచయి త ఎన్ గోపి, ప్రముఖ కవి కె.శివారెడ్డి, గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ ఆయాచితం శ్రీధర్, అధికార భాషా సంఘం అధ్యక్షుడు దేవులపల్లి ప్రభాకర్, ఆంధ్రజ్యోతి సంపాదకుడు కె.శ్రీనివాస్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, ఎమ్మెల్యేలు రసమయి, రామలింగా రెడ్డి, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరి కృష్ణ, బీసీ కమిషన్ సభ్యులు గౌరీశంకర్, వకుళాభర ణం కృష్ణమోహన్, కవయిత్రి ఓల్గా, సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్, టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి హాజరయ్యారు. -
'తెలుగు వర్సిటీకి చేటు చేస్తే ప్రజలు సహించరు'
ఆల్కాట్‌తోట(రాజమండ్రి): తెలుగు విశ్వవిద్యాలయానికి అపకారం చేస్తే ప్రజలు సహించరని రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పేర్కొన్నారు. ఆ సంస్థను కాపాడి తెలుగుతల్లి గౌరవాన్ని నిలపాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం సాయంత్రం స్థానిక ఆనం రోటరీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగువిశ్వవిద్యాలయాన్ని అస్థిర పరిచి ఉద్యోగులను, విద్యార్థులను రోడ్డున పడేశారన్నారు. ఆంధ్రరాష్ట్రంలో పనిచేస్తూ డిప్యుటేషన్‌పై హైదరాబాద్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఇద్దరు ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వం అర్ధాంతరంగా రిలీవ్ చేసిందన్నారు. రాష్ట్ర విభజన 10వ షెడ్యూలులో ఉన్న ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి, చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి సంస్థకు లేని అడ్డంకులు తెలుగువిశ్వవిద్యాలయూనికి ఏ విధంగా అడ్డు వచ్చాయని ప్రశ్నించారు. విశ్వవిద్యాలయం పరిరక్షణ ఆవశ్యకతను ప్రభుత్వానికి తెలియజేసేందుకే రాజమండ్రిలో సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద గురువారం ఉదయం 9.00గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు చైతన్యదీక్ష చేపడుతున్నామని చెప్పారు. ఈ దీక్షలో ఉద్యోగులు, పూర్వ విద్యార్థులు పాల్గొంటారన్నారు. -
తెలుపనా తెలుగు మాట..
ఆస్ట్రేలియాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. మంచి సంపాదన.. అంతకు మించి అందమైన ఫ్యామిలీ. ఇన్ని వసతులు ఉన్న వ్యక్తి డాలర్లను రూపాయలుగా మార్చే పనిలో బిజీగా ఉంటారు. కానీ.. ఆయన మాత్రం ఖండాతరాన తెలుపనా తెలుగు మాట అని తన వాణి వినిపిస్తున్నారు. తెలుగు భాషాసంస్కృతుల వ్యాప్తి కోసం కృషి చేస్తున్న ప్రవాసాంధ్రుడు కొంచాడ మల్లికేశ్వరరావు. తన ప్రయత్నాల్లో భాగంగా భాషా సాంస్కృతిక శాఖ , తెలుగు వర్సిటీ అధికారులతో సమావేశం అయ్యేందుకు ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయనను సిటీప్లస్ పలకరించింది. ఆస్ట్రేలియాలో ఆయన చేస్తున్న తెలుగు సేద్యం గురించి వివరించారు. 1982లో హైదరాబాద్‌కు వచ్చాను. మా సొంతూరు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం. హౌసింగ్ బోర్డులో జూనియర్ ఇంజినీర్‌గా 13 ఏళ్లు పని చేశాను. తర్వాత హడ్కోలో ఉద్యోగం చేశాను. ఆపై కంప్యూటర్ కోర్సులు నేర్చుకుని న్యూజిలాండ్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరాను. తర్వాత ఆస్ట్రేలియా వెళ్లి స్థిరపడ్డాను. తెలుగుమల్లి ఆస్ట్రేలియాలో వేలాది మంది తెలుగువారున్నారు. వీరి కోసం స్రవంతి అనే న్యూస్ లెటర్ నడిపాను. మూడు వారాలకోసారి వచ్చేది. ఇలా ఐదేళ్లు నడిపాను. తర్వాత నా భార్య, కొడుకు సహకారంతో ప్రవాస భారతి మ్యాగజైన్ తీసుకువచ్చాను. కాస్ట్ పెరిగిపోవడంతో.. తెలుగుమల్లి వెబ్సైట్ పారరంభించాను. వార్తలు, ఈవెంట్స్, వంటలు, సినిమా విశేషాలు అందులో పొందుపరుస్తున్నాం. సాహిత్య సమాచారం, కవితలు, కథలు, చారిత్రక విషయాలు వెబ్సైట్లో ఉంచుతున్నాం. నోటీస్ బోర్డ్ పేరుతో పెళ్లి సంబంధాల సమాచారం కూడా ఉంటుంది. తెలుగుమల్లి పేరుతో ఫేస్బుక్ పేజీ కూడా ఉంది. కమ్యూనిటీ భాషగా.. ఆస్ట్రేలియాలో ఏ దేశస్తులైనా వారి భాష కోసం పని చేసేందుకు ముందుకు వస్తే.. అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలోని మల్లీకల్చరల్ మినిస్ట్రీ ప్రోత్సాహం అందిస్తుంది. మూడు వేల నుంచి నాలుగు వేల డాలర్లు గ్రాంట్ కూడా ఇస్తుంది. తెలుగు భాష గురించి తాను చేస్తున్న కృషికి విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వం ‘విక్టోరియన్ మల్టీ కల్చరల్ ఫంక్షన్’ సర్వీస్ ఎక్స్‌లెన్సీ అవార్డు అందజేసింది. తెలుగును కమ్యూనిటీ లాంగ్వేజ్‌గా గుర్తించాలని ప్రభుత్వానికి విన్నవించాం. దీనికి సూచనప్రాయంగా అంగీకరించింది కూడా. ఉగాది నాటికి నిర్ణయం వెలువడవచ్చు. ఉగాది కోసం.. అస్ట్రేలియాలోని అన్ని రాష్ట్రాల్లో ఉగాదికి పెద్దగా సంబరాలు నిర్వహిస్తారు. జానపద కళాకారులను ఇక్కడి నుంచి తీసుకెళ్లి యక్షగానాలు, బుర్రకథ వంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నాం. కళాకారులను పంపేందుకు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖతో ఒప్పందం కుదుర్చుకుంటున్నాం. అలాగే ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు వర్సిటీ అధికారులను కలుస్తున్నాం. ఆస్ట్రేలియాలో తెలుగు వ్యాప్తికి ఓ 15 మంది కోర్ కమిటీగా ఏర్పడి సొంత ఖర్చులతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. తెలుగు భాషాను ఈ తరానికి పరిచయం చేయాలనే సంకల్పంతో మెల్బోర్న్లో ప్రతి శనివారం తెలుగు యువత కోసం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. భాషావికాసానికి దీర్ఘకాలిక ప్రణాళిక అమలుకు కసరత్తు చేస్తున్నాం. దీనికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాలని కోరుతున్నాను. తెలుగు సులువుగా నేర్చుకునే పుస్తకాలను తెలుగు వర్సిటీ అందజేస్తే బాగుంటుంది. - కోన సుధాకర్‌రెడ్డి -
రావూరికి ఘన నివాళి
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ సాహితీవేత్త, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజకు తెలుగు సాహితీ జగత్తు ఘనంగా నివాళులర్పించింది. ఆఖరి దాకా అక్షర సేద్యం చేసిన ఆ మహనీయుడికి కన్నీటితో తుది వీడ్కోలు పలికింది. భరద్వాజ మృతితో విజయనగర్ కాలనీలోని ఆయన నివాసం వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. శనివారం ఉదయం నుంచే పలువురు ప్రముఖులు తరలివచ్చి రావూరి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. వీఐపీల రాకతో స్థానికులు ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. నిత్యం మనతో పాటు ఉండే వ్యక్తికి ఇంత ఆదరణ ఉందా? సాదాసీదాగా ఉండే పెద్దాయనపై ఇంత అభిమానం ఉందా? అని చర్చించుకోవడం కనిపించింది. నిత్యం హడావుడిగా ఉండే వారంతా తమ పనులన్నీ పక్కనబెట్టి ఉదయం నుంచి అంతిమ సంస్కారాలు పూర్తయ్యే వరకూ అక్కడే ఉన్నారు. రావూరి ఆకస్మిక మృతి పట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, తెలుగు వర్సిటీ పూర్వ ఉపకులపతి ఆచార్య ఎన్.గోపి, సాహితీవేత్త డా.ద్వా.నా.శాస్త్రి, డా.పోతుకూచి సాంబశివరావు, గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, సాధన నరసింహచార్య, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బసవపున్నయ్య, ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, కార్యదర్శి మామిడి సోమయ్య తదితరులు సంతాపం ప్రకటించారు. కాంతమ్మను చేరిన భరద్వాజ విజయనగర కాలనీలోని తన నివాసం నుంచి ఆరోగ్యం సహకరించిన ప్రతిరోజూ నడచి వెళ్లి దివంగత ‘కాంతమ్మ’తో సంభాషించి వచ్చేవారు రావూరి భరద్వాజ. ఆరోజు విశేషాలన్నీ ఆమె సమాధి వద్ద చెప్పుకునేవారు. శనివారం మధ్యాహ్నం ఆయన ప్రభుత్వ లాంఛనాలతో చివరిసారిగా వెళ్లారు. 1986లో నేలతల్లి ఒడికి చేరిన కాంతమ్మ పక్కనే ఆయన భౌతికకాయాన్ని సంప్రదాయ విధానంలో ఖననం చేశారు. ఏ బడా ఆద్మీ రోజ్ ఆతే థే, అప్నే బీబీసే బాత్ కర్తే థే’ (ఈ పెద్దాయన రోజూ వచ్చేవారు. భార్యతో మాట్లాడేవారు) అని శ్మశానవాటికలోని ఒక మహిళ కన్నీరు పెట్టింది. పేదవాడైన తనను వివాహమాడి, తన నగానట్రాను కుటుంబావసరాలకోసం చిరునవ్వుతో ఇచ్చిన కాంతమ్మ అంటే రావూరికి ఆరాధన. ‘శ్రీమతి రావూరి కాంతమ్మ భరద్వాజ ట్రస్ట్’ ద్వారా ఐదు విశ్వవిద్యాలయాలలో పేద విద్యార్థులకు స్కాలర్షిప్ అందే ఏర్పాటు చేసిన వితరణశీలి భరద్వాజ!