‘లాక్’తో ‘కిక్’కు షాక్ | liquor shop closed in Amalapuram | Sakshi
Sakshi News home page

‘లాక్’తో ‘కిక్’కు షాక్

Published Tue, Mar 10 2015 2:46 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

liquor shop closed in Amalapuram

    ఆదాయపుపన్ను బకాయి పడ్డ ఏపీబీసీఎల్
     మద్యం డిపోలకు తాళం వేసిన ఐటీ శాఖ
     ‘చుక్క’కు కొరత, ధర పెంపుతో నిషాబాబుల ఇక్కట్లు

 
 అమలాపురం : ‘తుంటి మీద కొడితే మూతి పళ్లు రాలినట్టు’ ఆంధ్రప్రదేశ్ బేవరేజస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఏపీ బీసీఎల్) ఆదాయపు పన్ను చెల్లించకపోవడం మద్యపాన ప్రియులకు ‘చుక్క’ కరువయ్యే స్థితిని తెచ్చి పెట్టింది.  జిల్లాలో మూడు మద్యం గొడౌన్లకు సంబంధించి ఆ కార్పొరేషన్ దాదాపు రూ.450 కోట్ల మేర ఆదాయపు పన్నుల శాఖ బకాయి పడిందని సమాచారం. కోట్లాదిరూపాయల ఆదాయం పొందుతున్న ఏపీబీసీఎల్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో సంస్థ అయినా సకాలంలో పన్ను చెల్లించకపోవడంతో ఇన్‌కం ట్యాక్స్ శాఖ నోటీసుల మీద నోటీసులు జారీ చేసింది. అయినా స్పందన లేకపోవడంతో ఏపీబీసీఎల్ డిపోలకు తాళాలు వేయాలని నిర్ణయించింది. ఫలితంగా సామర్లకోట, రాజమండ్రి, అమలాపురం డిపోలకు తాళాలు పడడంతో మద్యం దుకాణాలకు సరఫరా నిలిచిపోయింది. డిపోలకు తాళాలు వేసి ఆరు రోజులు కావస్తుండడంతో  
 షాపుల్లో డిమాండ్ మేరకు మద్యం లేకుండా పోయింది.
 
 జిల్లాలోని సుమారు 542 మద్యం షాపులకు ఈ డిపోల ద్వారానే మద్యం అందుతుంది. జిల్లావ్యాప్తంగా సగటున రోజుకు రూ.మూడు, నాలుగు కోట్ల విలువచేసే మద్యం సరఫరా అవుతుంటుంది. సరఫరా నిలిచిపోవడం, ఉన్న మద్యం నిల్వలు అయిపోవడంతో దుకాణదారులు తలలు పట్టుకుంటున్నారు. కోరుకున్న చుక్క పడక మద్యం ప్రియులు అల్లాడిపోతున్నారు. ప్రధానంగా చీప్ లిక్కరుతోపాటు మీడియం క్వాలిటీ మద్యం దొరకడం గగనమైంది. చీప్‌లిక్కర్‌తో పాటు బ్రాండ్ మద్యం షాపుల్లో అత్యధికంగా అమ్ముడుపోతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లోని స్లమ్ ఏరియాల్లో చీప్ లిక్కర్ అమ్మకాలు జోరుగా సాగుతుంటాయి. మొత్తం అమ్మకాల్లో ఇవి 70 శాతం పైనేనని అంచనా. వీటి సరఫరా లేకపోవడంతో మద్యం దుకాణాల వద్ద అమ్మకాలు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి.
 
 ఎంఆర్పీని మించి గుంజుతున్న షాపులు
 డిపోలకు తాళాలు పడతాయని ముందుగా గుర్తించిన  పట్టణ ప్రాంతాల  మద్యం దుకాణదారులు కొంత వరకు సరుకు నిల్వ చేశారు. గ్రామాల్లో ఆ పరిస్థితి లేదు. 20 నుంచి 30 రోజులకు సరిడా మద్యాన్ని ముందుగానే తెచ్చుకుని నిల్వ చేసుకుంటారు. ఇటువంటి వారు డిపోలకు తాళాలు పడే ముందు అవసరమైన నిల్వలను ఉంచుకోలేకపోయారు. దీనితో ఇప్పుడు మద్యానికి కొరత ఏర్పడింది. ఇదే మంచి సమయంగా భావించి నిల్వ చేసిన మద్యం దుకాణదారులు చీప్ లిక్కర్, మీడియం బ్రాండ్ మద్యాన్ని ఎంఆర్పీకంటే ఎక్కువకు అమ్ముతూ మద్యం ప్రియుల జేబులు గుల్ల చేస్తున్నారు.
 
 వచ్చి పడుతున్న ‘యూనాం సరుకు’
 జిల్లాలో చీప్ లిక్కర్, మీడియం బ్రాండ్ మద్యం అందుబాటులో లేకపోవడంతో ఇదే అదనుగా పుదుచ్చేరి పరిధిలోని యానాం నుంచి మద్యం అక్రమ రవాణాకు కొందరు తెరదీశారు.మన ప్రాంతంలో ఎంఆర్పీకి మద్యం అమ్మకాలు ఆరంభించిన తరువాత ధరల్లో పెద్దగా వ్యత్యాసం లేనందున యూనాం నుంచి అక్రమ రవాణా చాలా వరకు తగ్గింది. ఇప్పుడు మద్యం అందుబాటులో లేకపోడంతో యానాం నుంచి జిల్లాలోని పలు ప్రాంతాలకు అక్రమంగా రవాణా అవుతోంది. సరుకు లేక అమ్మకాలు దాదాపుగా నిలిచపోవడంతో గ్రామీణ ప్రాంతాల  బెల్ట్ షాపుదారులు అక్రమ రవాణాకు తెరదీశారు. తాళాలు పడ్డ డిపోలు మరో రెండు రోజుల పాటు తెరుచుకునే అవకాశం లేకపోవడంతో మద్యప్రియులకు అప్పటి వరకూ గడ్డుకాలమే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement