
సాక్షి, అమరావతి: పింఛన్లు పొందేందుకు అర్హులుగా గుర్తించిన కొత్త జాబితాలను ప్రభుత్వం శనివారం నుంచి మళ్లీ సచివాలయ నోటీసు బోర్డుల్లో ఉంచింది. శని, ఆది, సోమవారాల్లో మూడు రోజుల పాటు విడతల వారీగా గ్రామ, వార్డుల వారీగా సోషల్ ఆడిట్ జరిపి.. ప్రజల నుంచి వచ్చే అభ్యంతరాలకు అనుగుణంగా తుది జాబితాలను ప్రకటిస్తుందని సెర్ప్ సీఈవో రాజాబాబు తెలిపారు.
అర్హత ఉన్నా వలంటీర్ల సర్వేలో కొందరికి పింఛన్లు తొలగించారంటూ పలుచోట్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో వాటిపై మరోసారి ఎంపీడీవోలతో రీ సర్వే చేయించాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన విషయం తెలిసిందే. అలా తొలగించిన వారితో పాటు ఇటీవల కాలంలో పింఛన్లు కోసం కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి అర్హతనూ అధికారులు పరిశీలించారు.
ఆయా జాబితాలను ఎక్కడికక్కడ శనివారం ఉదయం నుంచి గ్రామ, వార్డు సచివాలయ నోటీసు బోర్డులలో ఉంచారు. ఎంపికైన వారికి ఫిబ్రవరి నెలతో పాటు జనవరి నెల పింఛన్‌ను కలిపి.. 2 నెలల పింఛన్‌ను ఒకేసారి అందజేస్తారు. పింఛనుకు అర్హత ఉండీ ఇంకా ఎవరైనా మిగిలిపోతే సంప్రదించాల్సిన సమాచారాన్ని కూడా సచివాలయ నోటీసు బోర్డులో ఉంచారు.
Comments
Please login to add a commentAdd a comment