108 ఉద్యోగులకు అండగా ఉంటాం
Published Sun, Aug 11 2013 3:02 AM | Last Updated on Mon, Aug 13 2018 8:10 PM
ఖమ్మం మయూరి సెంటర్, న్యూస్‌లైన్: 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు వారికి సీపీఎం అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు చెప్పారు. కలెక్టరేట్ ఎదుట 108 ఉద్యోగుల సమ్మె శిబిరానికి ఆయన శనివారం వచ్చి సంఘీభావం తెలిపారు. శిబిరాన్నుద్దేశించి ఆయన మాట్లాడుతూ.. 108 ఉద్యోగులు గడిచిన 23 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ‘వారేమీ గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదు. ఉద్యోగ భద్రత, కనీస వేతనం, కార్మిక చట్టం అమలు చేయాలని మాత్రమే కోరుతున్నారు’ అని అన్నారు.
నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలకు అనుగుణంగా 108 ఉద్యోగులకు 15వేల రూపాయల వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ధరలనుబట్టి ఈ 15వేలు కూడా ఏ మూలకూ చాలవని అన్నారు. రోజుకు 12 నుంచి 16 గంటలపాటు పనిచేస్తున్న ఈ ఉద్యోగులను ఇంకా ఎక్కువ చేయాలని వేధిస్తున్నారని విమర్శించారు. అందరు ఉద్యోగుల్లాగానే వీరికి కూడా ఎనిమిది గంటల పని విధానం, కనీస వేతన చట్టం అమలు చేయాలని, వాహనాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేశారు. సమ్మెకు దిగిన ఉద్యోగులపట్ల యాజమాన్యం కక్ష సాధిస్తోందని,
ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 300మందిని తొలగించి, వారి స్థానంలో అనుభవం లేని వారిని నియమించిందని విమర్శించారు. ఒక్కొక్క 108 సర్వీస్‌కు ప్రభుత్వం 1.11లక్షల రూపాయలు ఇస్తోందని, దీనిని యాజమాన్యం సక్రమంగా ఖర్చు చేయడం లేదని చెప్పారు. దీనిపై కాగ్ కూడా అభ్యంతరం వ్యక్తం చేసిందన్నారు. సమస్యలు పరిష్కారమయ్యేంత వరకు ప్రజాసంఘాలు పూర్తి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో 108 ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అప్పిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముదాం శ్రీనివాసరావు, ఎస్‌కె.జమాల్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు నున్నా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement