కర్నూలు రూరల్/ఆదోని, న్యూస్‌లైన్: జిల్లాలో ఆయకట్టు రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుంది. లక్షలాది రూపాయల పెట్టుబడితో సాగు చేసిన పంటలు నెలన్నర రోజులు గడిస్తే కానీ చేతికొచ్చే పరిస్థితి లేదు. ఈ దశలో కేసీ వాటా నీరు అనంతపురం జిల్లాకు మళ్లించేందుకు రంగం సిద్ధమైంది. ఆ జిల్లా మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గిన సీఎం కిరణ్ కూమార్‌రెడ్డి దిగువ వాటా నుంచి మొదటి విడతగా ఒక టీఎంసీ నీటి మళ్లింపునకు మంగళవారం అనుమతిచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. మరో రెండు రోజుల్లో ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది.
ఆ తర్వాత మరో రెండు టీఎంసీలను తరలించవచ్చనే ప్రచారం జరుగుతోంది. తుంగభద్ర జలాశయంలో ప్రస్తుతం ఎల్లెల్సీ వాటా 5.9 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇందులో రబీ పంటల సాగుకు మూడు, వేసవిలో తాగునీటి అవసరాలకు రెండు టీఎంసీలు కేటాయించారు. రబీ పంటలకు మార్చి నెలాఖరు వరకు సాగునీరు అందించాలని గత నెలలో నిర్వహించిన ఐఏబీ సమావేశంలో ప్రజాప్రతినిధులు, అధికారులు తీర్మానించారు. అయితే అనంతపురం జిల్లాకు చెందిన ముఖ్య నేత తన రాజకీయ స్వార్థంతో ఎల్లెల్సీ నీటి మళ్లింపునకు పథకం రచించారు. కర్నూలు జిల్లా రైతులు రబీలో ఎలాంటి పంటలు వేసుకోలేదని, ఖరీఫ్‌లో సాగయిన పంటల(స్టాండింగ్ క్రాప్స్)కు ఫిబ్రవరి మూడో వారం వరకు నీరు సరఫరా చేస్తే పంటలు పూర్తిగా చేతికందుతాయని ముఖ్యమంత్రిని నమ్మించారు.
తద్వారా మిగులు నీటిని అనంతపురం జిల్లా ప్రజల తాగు నీటి అవసరాలకు మళ్లించాలని ఉన్నత స్థాయి నీటి పారుదల శాఖ అధికారులపై ఒత్తిడి చేయించినట్లు తెలిసింది. అనంతపురం జిల్లాలో విస్తరించిన తుంగభద్ర ఎగువ కాలువ(హెచ్‌ఎల్సీ)కు తుంగభద్ర జలాశయం నుంచి గత నెల చివరి వరకు నీటి సరఫరా జరిగింది. ఆ సమయంలో నీటి పారుదల శాఖ అధికారులు ఆ జిల్లాలోని తాగునీటి జలాశయాలను పూర్తిస్థాయిలో నింపేశారు. ప్రస్తుతం తాగునీటి అవసరాలకు ఎలాంటి సమస్య లేకపోయినా ఆ జిల్లాకు చెందిన నేత ఎల్లెల్సీ నీటిని మళ్లించేందుకు యత్నించడం వెనుక రాజకీయ స్వార్థం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్నికల సంవత్సరం కావడం వల్లే ఆయన జిల్లా ప్రజల అభిమానం చూరగొనేందుకు ఈ కుట్ర పన్నినట్లు తెలుస్తోంది. గత సంవత్సరం కూడా ఎల్లెల్సీ నీటి వాటాలో 3 టీఎంసీలు అనంతపురంకు మళ్లించారు.
ఆ సమయంలో కర్నూలు జిల్లాలో ఎల్లెల్సీ కింద రబీ సాగు రద్దు చేయాల్సి వచ్చింది. ఇంత జరుగుతున్నా జిల్లా ప్రజాప్రతినిధులు నోరు మెదపకపోవడం గమనార్హం. వీరి మౌనంతో జిల్లాలోని హొళగుంద, హాలహర్వి, కౌతాళం, కోసిగి, ఆదోని, ఎమ్మిగనూరు, మంత్రాలయం, కోడుమురు, గోనెగండ్ల మండలాల్లోని దాదాపు 50వేల ఎకరాల్లో సాగు చేసిన మిరప, వేరుశనగ, పత్తి, మొక్కజొన్న, తదితర పంటల భవిష్యత్ ప్రశ్నార్థకమవుతోంది. అదేవిధంగా జిల్లాలో 16 మండలాల పరిధిలోని 192 గ్రామాల ప్రజలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. నీటి మళ్లింపు విషయమై నీటి పారుదల శాఖ పర్యవేక్షణాధికారి ఆర్.నాగేశ్వరరావును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా అనుమతి విషయం తనకు తెలియదన్నారు.
ఆందోళన చేపడతాం
ఎల్లెల్సీ నీటిని తాగునీటి సాకుతో అనంతపురానికి మళ్లిస్తే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని ఎల్లెల్సీ హొళగుంద, హాల్వి, కోసిగి డిస్ట్రిబ్యూటర్ల కమిటీ మాజీ అధ్యక్షులు రామిరెడ్డి, విరుపాక్షి, శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆదోనిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ అనంతపురం నేతలు తమ రాజకీయ స్వార్థం కోసం జిల్లాకు చెందిన రైతులకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. అదేవిధంగా నోరు మెదపని జిల్లా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకుంటామన్నారు.
స్వార్థం పారింది.. స్వేదం ఓడింది
Published Thu, Jan 9 2014 2:10 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM
Advertisement
Advertisement