
రాజాం మండల పరిషత్ కార్యాలయం
సాక్షి, రాజాం (శ్రీకాకుళం): సార్వత్రిక ఎన్నికల పోరు ముగిసింది. కొత్తగా కొలువుదీరిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిసారించింది. ఇప్పటికే సర్పంచ్‌ల పదవీకాలం ముగిసి 11 నెలలు కావస్తుండగా గత టీడీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించకుండా కాలయాపన చేసింది. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి ఈ నెల 18వ తేదీ వరకూ కొత్త పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఓటర్ల జాబితా తయారీ, అభ్యంతరాల స్వీకరణ జరిగింది. ఈ తంతు ముగియకముందే జూలై 4తో మండల పరిషత్ పాలక మండళ్లు రద్దు కానున్నాయి. తాజాగా వీటికి సంబంధించి జిల్లాల వారీగా ఓటర్ల జాబితా సేకరణ, పోలింగ్ కేంద్రాల పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, జూలై 3 నాటికి అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.
జూలై 4తో ముగియనున్న గడువు
ఎంపీటీసీలు, జెడ్పీటీసీల ఎన్నికలు 2104 మే నెలలో జరిగాయి. ఫలితాలు మాత్రం జూన్‌లో విడుదల చేయడంతోపాటు కొత్త పాలకమండళ్లు జూలై 3న కొలువుదీరాయి. ఫలితంగా ఈ ఏడాది జూలై 4తో ఈ మండళ్లు రద్దు కానున్నాయి. వీటి స్థానంలో కొత్తగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను ఎన్నుకోవాల్సి ఉంది. ఇదివరకూ పోలింగ్ కేంద్రాలు గుర్తించడంతోపాటు ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపై నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు కూడా చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజాం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీలకు..
రాజాం నియోజకవర్గంలో 66 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. రాజాం, రేగిడి, వంగర, సంతకవిటి మండలాలకు సంబంధించి అత్యధిక ఎంపీటీసీ స్థానాలు రేగిడి మండలంలో 21 ఉండగా, అత్యల్పంగా వంగర మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. ఈ నాలుగు మండలాల్లో 2,19,313 ఓట్లు ఉన్నాయి. వీటిలో 1,12,271 మంది పురుష ఓటర్లు, 1,08,011 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.
పోటీకి టీడీపీ సీనియర్ల అయిష్టత
ఈ దఫా స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ సీనియర్ నేతల్లో ఆందోళన అధికంగా ఉంది. గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలో ఉండటంతో పలు మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు లభించాయి. ఫలితంగా మండల పరిషత్ పాలక మండలి పీఠంపై టీడీపీ నేతలు కూర్చుని ఐదేళ్లపాటు చక్రం తిప్పారు. జన్మభూమి కమిటీల పెత్తనం, ఎన్నికల హామీలు నెరవేర్చకపోవడం, ఇసుక మాఫియా, నీరు చెట్టు నిధుల దోపిడీ టీడీపీకి అపకీర్తి తెచ్చిపెట్టాయి. అంతేకాకుండా సంతకవిటిలో ఇండిట్రేడ్ పేరుతో ఆ పార్టీ నేతల మోసాలు వెలుగుచూడటం, రేగిడి మండలంలో అక్రమ ఇసుక మైనింగ్ రాజాంలో టీడీపీకి కొరకరాని కొయ్యలుగా మారి వెంటాడుతున్నాయి. ఈ మోసాలు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు దారితీశాయి. సార్వత్రిక ఎన్నికల్లో వీటి ఫలితం స్పష్టంగా కనిపించింది. స్థానిక ఎన్నికల్లోనూ రేగిడి, సంతకవిటి మండలాల్లో వీటి ప్రభావం కనిపించనుంది. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతలు ఈ దఫా ఎన్నికలకు ముందుపడేందుకు నిరాసక్తితో ఉన్నట్లు తెలుస్తోంది.
వైఎస్సార్‌సీపీ వైపు ఫిరాయింపుదారులు
2014లో టీడీపీకి అధికారం రావడంతో రాజ్యాంగ విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. రాజాంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంపీపీ కావల్సి ఉండగా, ఇక్కడ టీడీపీ నేతలు తమ అధికార పెత్తనంతో చక్రం తిప్పారు. మారెడుబాక గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ సభ్యుడికి తాయిలాలు ఎరవేసి టీడీపీలోకి చేర్చుకున్నారు. మొత్తం 15 ఎంపీటీసీ స్థానాలకుగానూ అప్పట్లో వైఎస్సార్‌సీపీ 8 గెలుచుకోగా, ఒక ఎంపీటీసీ స్థానం టీడీపీలోకి చేరింది. మరో ఇండిపెండెంట్ ఎంపీటీసీ టీడీపీకి మద్దతి ఇచ్చారు. రాజాం మండల పరిషత్ అధికారులు కూడా అప్పట్లో అధికార పార్టీకే సహకరించారు. అనంతరం అంతకాపల్లి గ్రామానికి చెందిన మరో వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ టీడీపీలో చేరారు. ఇలా పార్టీ ఫిరాయించిన వారంతా ఇప్పుడు వైఎస్సార్‌సీపీ వైపు చూస్తున్నారు. రేగిడి మండలంలో ఇద్దరు ఎంపీటీసీలు, సంతకవిటిలో ఒక ఎంపీటీసీ ఇటు వచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. మరోవైపు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పెడుతున్న సంక్షేమ పథకాలు కూడా మంచిగా ఉండటంతో అందరి దృష్టి ఇటు పడింది.
పరిషత్ ఎన్నికలకు సన్నద్ధం
జూలై 4తో ప్రస్తుతం ఉన్న మండల పరిషత్ పాలకమండళ్లు రద్దు కానున్నాయి. వీటి స్థానంలో కొత్త పాలకమండలిల ఏర్పాట్లు జరగాల్సి ఉంది. ఈ మేరకు అన్ని ఎంపీటీసీలకు సంబంధించి కొత్త ఓటర్లు జాబితా, పోలింగ్ కేంద్రాలు వివరాలు సేకరిస్తున్నాం.
– కే రామకృష్ణరాజు, ఎంపీడీవో, రాజాం
Comments
Please login to add a commentAdd a comment