‘స్థానిక’ రిజర్వేషన్లు ఓకే | 'Local' reservation OK | Sakshi
Sakshi News home page

‘స్థానిక’ రిజర్వేషన్లు ఓకే

Published Sun, Mar 9 2014 3:53 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

'Local' reservation OK

నిన్నటి ఉత్కంఠకు శనివారం తెరపడింది. ‘స్థానిక’ సమరానికి సై అంటూ అధికార యంత్రాంగం రిజర్వేషన్లను ఖరారు చేశారు. కలెక్టర్ గిరిజాశంకర్ అధికారికంగా ప్రకటించారు. జిల్లాలోని ఎంపీటీసీ, జడ్పీటీసీలకు గాను 50శాతం స్థానాలను ఆడపడుచులు దక్కించుకొన్నారు. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎన్నికలతో రాజకీయ పక్షాలు బెంబేలెత్తుతున్నాయి. అధికారులూ...విపరీతమైన ఒత్తిడికి గురవుతున్నారు.
 
 సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : మండల, జిల్లా పరిషత్‌ల నాలుగో విడత సాధారణ ఎన్నికల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. జిల్లా పరిషత్, మండల ప్రజా పరిషత్, మండల ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా రిజర్వేషన్ల జాబితా రూపొందించారు.వాటి వివరాలతో కూడిన గెజిట్‌ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గిరిజా శంకర్ శనివారం విడుదల చేశారు. తొలిసారిగా అన్ని స్థాయిల్లోనూ మహిళలకు 50శాతం స్థానాలు కేటాయించారు. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా 50శాతం పదవులు వారికి దక్కాయి. ఇకపై మండల, జిల్లా పరిషత్‌లలో సగం స్థానాల్లో ప్రాతినిధ్యం వహిస్తారు.
 
 రొటేషన్ పద్దతిలో రిజర్వేషన్లు ఖరారు చేయడంతో కొత్త ముఖాలకు స్థానిక సంస్థల్లో అవకాశం దక్కనుంది. మండల పరిషత్ అధ్యక్ష పదవులను రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని లెక్కించారు. తదనుగుణంగా జిల్లా లో ఆయా కేటగిరీల వారీగా మండల పరిషత్ స్థానాలను రిజర్వు చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (ఎంపీటీసీ) పునర్వ్యవస్థీకరించారు. దీంతో గతంలో 870గా ఉన్న ఎంపీటీసీ స్థానాల సంఖ్య ప్రస్తుతం 982కు చేరింది. జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షుల సంఖ్య మాత్రం గతంలో మాదిరిగా 64 వంతున ఉంటాయి.
 రేపు షెడ్యూలు విడుదల?
 స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకపోవడంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అధికార యంత్రా ంగం ఉరుకులు పెడుతోంది. సోమవారం ఎన్నికల షెడ్యూలు వెలువడుతుందనే సమాచారంతో అధికార యంత్రాంగం కునుకు లేకుండా ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో తలమునకలైంది. అసెంబ్లీ నియోజకవర్గాల ఓటరు జాబితా ఆధారంగా ఎంపీటీసీల వారీగా శనివారం ఓటరు జాబితాను సిద్దం చేశారు. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా ఓటరు జాబితాను సోమవారం  ప్రచురిస్తారు. 12వ తేదీన పోలింగ్ కేంద్రాల జాబితాను ప్రకటిస్తారు. మార్చి 19 నుంచి నామినేషన్లు స్వీకరించి, ఏప్రిల్ ఆరో తేదీ ఆదివారం ఎన్నికలు నిర్వహించే అవకాశముంది.
 
 రాజకీయ పక్షాలు ఉక్కిరి బిక్కిరి
 కేవలం నెలా 20 రోజుల  వ్యవధిలో మున్సిపల్, జిల్లా, మండల పరిషత్, సాధారణ ఎన్నికలు జరగనుండటంతో రాజకీయ పక్షాలు, నాయకులు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు తమ రాజకీయ భవిష్యత్‌పై ప్రభావం చూపుతాయని ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఆర్థిక భారం ఓ వైపు, అభ్యర్థుల ఎంపిక కసరత్తు మరోవైపు పార్టీలకు సవాలు విసురుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ చిహ్నం కీలకం కావడంతో ఔత్సాహికులు బీ ఫారాల కోసం సొంత పార్టీపై ఒత్తిడి తేనున్నారు.  ఇప్పటికే మున్సిపల్ ఎన్నికల అభ్యర్థుల ఎంపికలో తలమునకలైన పార్టీలు, నేతలకు జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు సవాలుగా మారాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement