ఎన్నాళ్లీ నిరీక్షణ!
శ్రీకాకుళం: స్థానిక సంస్థల చైర్మన్ పదవుల ఎన్నిక ప్రక్రియ ఎప్పుడు నిర్వహిస్తారో తెలియక ఆశావహులు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఆయా సంస్థల్లో ఆధిక్యం సాధించిన పార్టీల్లో చైర్మన్ పదవి ఆశిస్తున్న నేతలు సభ్యుల మద్దతు కూడగ ట్టుకొని నిరీక్షిస్తుండగా ఎన్నికల నిర్వహణలో జరుగుతున్న జాప్యం వారిపై ఆర్థిక భారం మోపడంతోపాటు కొత్త సమస్యలు సృష్టిస్తోంది. రెండేళ్లకుపైగా ఎన్నికలకు నోచుకోని స్థానిక సంస్థలకు తప్పనిసరిగా ఎన్నికలు జరపాలని ఉన్నత న్యాయస్థానాలు ఆదేశిస్తూ.. అందుకు గడువు కూడా నిర్దేశించాయి. ఆ మేరకు రాష్ట్రంతోపాటు జిల్లాలో మార్చి 30న మున్సిపల్, ఏప్రిల్ 6, 11 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో లెక్కింపు నిర్వహించి, ఫలితాలు కూడా ప్రకటించారు.
అయితే ఆ వెంటనే సార్వత్రిక ఎన్నికలు ఉండటం, ఎమ్మెల్యేలు, ఎంపీలుగా ఎన్నికయ్యేవారు ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులు కావాల్సి ఉన్నందున.. ఆ తతంగం అంతా పూర్తి అయ్యాకే చైర్మన్ ఎన్నిక ప్రక్రియ చేపడతామని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా స్థానిక సంస్థల చైర్మన్ ఎన్నికలపై దృష్టి సారించలేదు. మెజారిటీ సంస్థలను దక్కించుకునేందుకు వీలుగా అసెంబ్లీలో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం పూర్తి అయ్యే వరకు వేచి చూడాలని యోచిస్తున్నట్లు తెలిసింది. కో-ఆప్షన్ ఓటుతో కొన్ని స్థానాలను దక్కించుకోవచ్చునని అధికార పార్టీ ఆలోచనగా ఉంది. అధికార పార్టీ ఆలోచన ఎలా ఉన్నా చైర్మన్ పదవులపై కన్నేసిన ఆశావహులు మాత్రం సభ్యులను కాపాడుకునేందుకు నానాపాట్లు పడుతున్నారు. నెలల తరబడి క్యాంపుల నిర్వహణ ఖర్చులు భరించలేక బెంబేలెత్తిపోతున్నారు. ఎన్నికల ఖర్చు కంటే ఈ క్యాంపు ఖర్చే ఎక్కువైపోయిందని కొందరు ఆశావహులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇంత ఖర్చు చేస్తున్నా, ఖచ్చితంగా తమకే పదవి దక్కుతుందో లేదోనన్న అనుమానం కూడా వారిని వేధిస్తోంది. మరోవైపు జిల్లాలో ఇద్దరు సీనియర్ నాయకులు పార్టీపై అలక బూనడం వారికి ఆందోళన కలిగిస్తోంది. మంత్రి పదవులు ఆశించిన ఈ ఈ ఇద్దరు నేతలు అవి దక్కకపోవడంతో కినుక వహించారు. వీరిని కలిసి మాట్లాడేందుకు జిల్లా మంత్రి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదని సమాచారం. నాయకులు, కార్యకర్తలతో పాటు సహచర ఎమ్మెల్యేలకు సైతం కొన్ని రోజులుగా వారు అందుబాటులో లేరని తెలిసింది. జిల్లా టీడీపీలో మొదటి నుంచీ వర్గాలు ఉన్నాయి. దీనికి తోడు ఈ ఇద్దరు నేతలు అలక వహించడం మున్సిపల్, ఎంపీపీ, జెడ్పీ చైర్మన్ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికలపై ఎటువంటి ప్రభావం చూపుతుందోనని కార్యకర్తలు, నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నికలకు ముందు హామీ పొందిన వారికే ఈ పదవులు దక్కుతాయా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
హామీ ఇవ్వని అచ్చెన్న
చైర్మన్ పదవుల విషయంలో జిల్లా మంత్రి అచ్చెన్న హామీ పొందేందుకు ఆశావహులు చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. ఆయన నుంచి ఖచ్చితమైన హామీ లభించడం లేదు. ఎన్నికలు పూర్తయిన ప్రాంతాలతో పాటు ఎన్నికలు జరగని శ్రీకాకుళం మున్సిపాలిటీ నాయకులు అచ్చెన్నాయుడును కలిసి, ఆయన మద్దతు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎవరు వచ్చి కలిసినా కాదనక పోయినప్పటికీ పదవి విషయం వచ్చేసరికి మాత్రం మీ ఎమ్మెల్యేను అడగండి.. అని ఆయన చెబుతుండడంతో పలువురు ఖంగుతింటున్నారు. ఇవన్నీ ముందు ముందు ఎటువంటి పరిణామాలకు దారితీస్తుందోనని పలువురు ఆందోళన చెందుతున్నారు.