మరణంలోనూ వీడని బంధం
వారు కష్టసుఖాలను కలిసి పంచుకున్నారు. ప్రేమానురాగాల్ని పెంచుకున్నారు. ఒకరికొకరు తోడునీడగా జీవిస్తున్నారు. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్యజీవితం విషాదాంతమైంది. పతియే దైవమని భావిస్తూ వ చ్చిన ఆ ఇల్లాలు భర్త ఆకస్మిక మరణాన్ని తట్టుకోలేకపోయింది. తన జీవితభాగస్వామి లేని జీవితాన్ని ఊహించలేకపోయింది. గుండెపోటుతో భర్త కన్నుమూశాడనే వార్తను విన్న ఆ అర్ధాంగి భర్త మృత దేహంపై పడి రోదిస్తూ అర్ధంతరంగా తనువు చాలించింది. కొద్ది గంటల వ్యవధిలోనే భార్యాభర్తలు చనిపోవడంతో గ్రామంలో విషాదం అలుముకుంది.
రాయచోటి, న్యూస్‌లైన్: రాయచోటి మండలం మాధవరం కస్పాకు చెందిన బ్రహ్మయ్య ఆచారి(65) వడ్రంగి పని చేసుకుని జీవనం సాగించేవాడు. అతనికి ముగ్గురు కుమారులు , ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు చనిపోవడంతో కోడలు, ఇరువురు పిల్లలను కూడా పోషిస్తున్నారు. ఆదివారం ఉదయం పక్క వీధి నుంచి తాగునీటి బిందెను తీసుకొస్తుండగా అకస్మాత్తుగా గుండెపోటుతో కుప్పకూలాడు.
వెంటనే అతన్ని రాయచోటి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త మృతదేహంపై పడి ఏడుస్తూ భార్య లక్ష్మీదేవి(55) సొమ్మసిల్లి పడిపోయింది. ఎంత పిలిచినా పలకకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిశీలించగా మృతిచెందినట్లు నిర్ధారించుకున్నారు. భర్త ప్రాణాలు వదిలిన గంటలోపే భార్య మృతిచెండటంతో మాధవరంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ కుటుంబాన్ని పోషించుకుంటూ కోడలు, పిల్లలను కూడా వీరే పోషించేవారు. ప్రస్తుతం పెద్ద దిక్కుగా ఉన్న భార్యభర్తలు ఇరువురు ఒకే రోజు మృతి చెందటంతో ఆ కుటుంబం ఆసరా కోల్పోయింది.