కుప్పం/కుప్పం రూరల్ (చిత్తూరు జిల్లా) : టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించిన పాదయాత్రలో ఆదిలోనే అపశ్రుతి చోటుచేసుకుంది. లోకేశ్‌తో పాటు పాదయాత్రలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీరామారావు మనుమడు తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిపోయారు.
ఆయన ఎన్టీఆర్ కుమారుడు నందమూరి మోహనకృష్ణ కుమారుడు. శుక్రవారం ఉదయం 11.10 గంటలకు కుప్పం మండలం లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, లోకేశ్ పాదయాత్ర ప్రారంభించారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నందమూరి తారకరత్న, టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తదితరులు ఉన్నారు.
అక్కడి నుంచి అర కిలోమీటరు దూరంలో బాబునగర్ వద్ద ఉన్న మసీదుకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. 12 గంటల సమయంలో మసీదు నుంచి బయటకు వచ్చిన తర్వాత కార్యకర్తలు తోసుకొని మీద పడటంతో తారకరత్న అస్వస్థతకు గురయ్యారు.
నిలదొక్కుకోలేక సొమ్మసిల్లి కింద పడిపోవటంతో కార్యకర్తలు హుటాహుటిన పట్టణంలోని కేసీ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం వైద్యుల సూచన మేరకు అంబులెన్స్‌లో పీఈఎస్ మెడికల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు తారకరత్నను క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స ప్రారంభించారు.
నందమూరి బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో చర్చించారు. అనంతరం మాట్లాడుతూ, రక్తనాళాలు 90 శాతం మూసుకుపోవటంతో తారకరత్న స్పృహ కోల్పోయాడన్నారు. ప్రాణాపాయం లేదని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తారకరత్నను ఆస్పత్రికి తరలించగానే మరోవైపు లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. తారకరత్న వెంట వెళ్లకుండా లోకేశ్ పాదయాత్ర కొనసాగించడంపై పార్టీలోని పలువురు నేతలు విస్మయం వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుడు, బావ అయిన ఆయన పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసినా, లోకేశ్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని, ప్రజల్లోకి వేరే సంకేతాలు వెళతాయని వారు చర్చించుకున్నారు.
ఇదిలా ఉండగా, తారకరత్నకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రి సిబ్బంది ఫోన్లు స్వాధీనం చేసుకున్నారని, వారినెవరినీ బయటకు పంపడం లేదని.. బయటి నుంచి కూడా ఎవరినీ ఆస్పత్రి లోపలకు అనుమతించడం లేదని సిబ్బంది కుటుంబీకులు వాపోతున్నారు. అసలు ఆస్పత్రిలో ఏం జరుగుతోందో అర్థం కావడం లేదని టీడీపీ శ్రేణులే గుసగుసలు పోతుండటం గమనార్హం.
నాటకీయ పరిణామాల మధ్య బెంగళూరుకు..
ఆస్పత్రిలో తారకరత్నకు వైద్యం అందించిన వైద్యులు.. బెంగళూరుకు సిఫార్సు చేశారు. ఈ విషయాన్ని టీడీపీ శ్రేణులు జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, గ్రీన్ చానల్ ఏర్పాటు చేయాలని కోరారు. ఆస్పత్రి మెడికల్ రిపోర్ట్ సమర్పిస్తే తప్పకుండా సహకరిస్తామని ఎస్పీ వారికి తెలిపారు. అంతలో తొలి రోజు పాద యాత్ర ముగించుకున్న లోకేశ్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మామ బాలకృష్ణతో మాట్లాడారు. ఆ తర్వాత తారకరత్నను బెంగళూరుకు తరలించడం లేదని, బెంగళూరు నారాయణ హృదయాలయ ఆస్పత్రి నుంచి వచ్చిన వైద్యులు ఇక్కడే చికిత్స అందిస్తారని పార్టీ శ్రేణులకు వారు సమాచారం ఇచ్చారు.
లోకేశ్ వెళ్లగానే నిర్ణయం మారిపోవడంతో టీడీపీ కార్యకర్తలు ఆశ్చర్యపో యారు. బెంగళూరుకు తీసుకెళ్లుంటే మరింత మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేదని, ఇలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదని చర్చించుకున్నారు. ఇదిలా ఉండగా రాత్రి 9.30 గంటలకు తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక(9) పీఈఎస్ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వీరితో పాటు తారకరత్న బావమరిదితో బాలకృష్ణ, లోకేశ్, మరికొందరు మాట్లాడాకే.. తారకరత్నకు ఇక్కడే వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు.
తారకరత్న కుటుంబ సభ్యుల అంగీకారంతోనే ఇక్కడే వైద్యం కొనసాగిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. అయితే నాటకీయపరిణామాల మధ్య అర్థరాత్రి సమ యంలో తారకరత్నను మెరుగైన చికిత్స కోసం ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment