గుండెకు ‘బీఎల్‌ఎస్’ భరోసా
గుండెకు ‘బీఎల్‌ఎస్’ భరోసా
Published Sun, Sep 25 2016 9:41 PM | Last Updated on Mon, Sep 4 2017 2:58 PM
– బేసిక్ లైఫ్ సపోర్ట్ శిక్షణతో మరణాలు తగ్గే అవకాశం
– గుండెపోటు వస్తే గంటలోపు ఆసుపత్రికి చేర్చాలి
– భవిష్యత్ టెలీమెడిసిన్‌దే
– ఏపీసీఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి, కార్డియాజిలస్టు డాక్టర్ రమేష్ బాబు
కర్నూలు(హాస్పిటల్): బేసిక్ లైఫ్ సపోర్ట్(బీఎల్‌ఎస్)పై ప్రతి ఇంట్లో ఒక్కరికైనా అవగాహన ఉంటే 90 శాతం గుండెపోటు మరణాలు తగ్గించినట్లే అని విజయవాడ రమేష్ హాస్పిటల్స్ అధినేత, ఏపీ కార్డియాలజిస్ట్సు సొసైటీ ఇండియా(ఏపీసీఎస్‌ఐ) రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ పి. రమేష్‌బాబు పేర్కొన్నారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల కార్డియాలజీ విభాగం ఆధ్వర్యంలో వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని ‘కార్డియో సీఎంఈ–2016’ అనే నిరంతర వైద్యవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెరుగుతున్న గుండెజబ్బులతో ప్రజల జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని, ఫలితంగా జీడీపీ రేటు కూడా క్షీణిస్తోందన్నారు. గుండెజబ్బులపై అవగాహన పెంచేతే 50 శాతం మరణాలు తగ్గి జీడీపీ రేటు ఒక శాతం పెరుగుతుందని తెలిపారు. దేశంలోని 4 కోట్ల మంది ప్రజలు ఏటా వ్యాధుల బారిన పడి దారిద్య్రరేఖకు దిగువకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుండెపోటు వచ్చిన వారిని గంటలోపు సమీప ఆసుపత్రికి తీసుకెళ్లి ప్రాథమిక వైద్యం అందించగలిగితే 90 శాతం మరణాలు తగ్గించవచ్చని ఆయన పేర్కొన్నారు.
29న బీఎల్‌ఎస్ ప్రారంభం..
ఏపీ కార్డియాలజిస్ట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని 155 మంది కార్డియాలజిస్టులు ఈ నెల 11వ తేదీన విజయవాడలో సమావేశమయ్యారని..ఈ ఏడాది బీఎల్‌ఎస్ ప్రోగ్రామ్‌ను రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టేందుకు తీర్మానించారని డాక్టర్ రమేష్ బాబు తెలిపారు. వరల్డ్ హార్ట్ డేను పురస్కరించుకుని ఈ నెల 29వ తేదీన విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా బీఎల్‌ఎస్, లిటిల్ హార్ట్స్ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
గుండె జబ్బులను ముందే గుర్తించొచ్చు..
రోగి స్థితిగతులను తెలియజేస్తే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని వైద్యులతో మెరుగైన చికిత్స అందించవచ్చని..ఇందుకు టెలీమెడిసిన్ దోహదం చేస్తుందన్నారు. ఇలా చేస్తే చాలా వరకు కేసులు ఐసీయూకు రానవసరం లేదన్నారు. వ్యక్తికి యాంజియోగ్రామ్ చేయకుండానే ‘ఇంటలిజెంట్ సీటీ స్కానింగ్’ యంత్రం ద్వారా వచ్చే 15 ఏళ్లలో మనిషికి వచ్చే గుండెజబ్బులను సైతం ముందే కనుగొనే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. కార్యక్రమంలో అడ్వాన్సెస్ ఇన్ కార్డియాక్ ఇమేజింగ్‌పై డాక్టర్ షేక్ మౌలాలి(విజయవాడ), రీసెంట్ ట్రెండ్స్ ఇన్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ హార్ట్ ఫెయిలూర్‌పై ఏపీసీఎస్‌ఐ ఎలెక్టెడ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్. శరత్‌చంద్ర(హైదరాబాద్), హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎ స్టేట్ ఆఫ్ ఆర్ట్ సర్జరీపై డాక్టర్ ఆర్‌వీ కుమార్(హైదరాబాద్ నిమ్స్), డిఫరెంట్ స్ట్రాటజీస్ ఇన్ ది మేనేజ్‌మెంట్ ఆఫ్ అక్యూట్ కరొనరీ సిండ్రోమ్‌పై డాక్టర్ పి. రమేష్‌బాబు(విజయవాడ) ప్రసంగించారు.
బియ్యం, చక్కెర మానేస్తేనే మేలు
గుండెజబ్బులు, షుగర్ రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ చక్కెర, తెల్లని పాలిష్‌పట్టిన బియ్యాన్ని తినడం మానేస్తేనే మేలని కర్నూలు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్ సూచించారు. ఆహారపు అలవాట్లు మార్చుకుంటేనే వ్యాధులకు దూరంగా ఉండవచ్చన్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జె.వీరాస్వామి మాట్లాడుతూ కార్డియాలజీ విభాగం అందిస్తున్న సేవలను కొనియాడారు. రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ భవానీప్రసాద్ మాట్లాడుతూ సమాజంలో 30 శాతం మరణాలు గుండెజబ్బుల వల్లే చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన లేకపోవడంతో గుండెజబ్బులు పెరుగుతున్నాయని కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ప్రభాకరరెడ్డి చెప్పారు. వ్యాధి వచ్చిన తర్వాత డబ్బు ఖర్చు పెట్టడం కంటే రాకుండా నివారణ చర్యలు తీసుకోవడమే ఉత్తమమని ఆయన అభిప్రాయపడ్డారు.
Advertisement