ఇద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించిన స్థానికులు
Published Wed, Oct 9 2013 3:51 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
కొత్తపేట, న్యూస్‌లైన్ : ఓ ఇంట్లో దాక్కుని ఉన్న, దుండగులుగా భావిస్తున్న ఇద్దరు వ్యక్తులను మండలంలోని వాడపాలెం గ్రామంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని బీహార్‌కు చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించినట్టు సమాచారం. ఇళ్లల్లో దోపిడీకి వాడే మారణాయుధాలు, కారం, పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో వారు ఇళ్లల్లో దోపిడీకి మాటు వేశారా లేక ఎవరినైనా హతమార్చేందుకు ప్రణాళికతో వచ్చారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నివాసాలు, జన సంచారం ఎక్కువగా ఉండే వాడపాలెం దుర్గమ్మ గుడి సమీపంలో సత్యవరపు శివయ్య పెంకుటింట్లో ఓ గదిని అదే గ్రామానికి చెందిన బండారు ధనరాజు అద్దెకు తీసుకున్నాడు.
అందులో పొగాకు చట్టలు వేసుకుంటున్నారు. పది రోజులకు ఓసారి కావాల్సిన పొగాకు తీసుకుని, ఆ గదికి తాళం వేస్తాడు. మంగళవారం ఉదయం ధనరాజు కుమారుడు చిట్టబ్బాయి ఆ గది తలుపు తీసి లోనికి ప్రవేశించగా, అందులో ఇద్దరు వ్యక్తులు తారసపడ్డారు. వారిని చూసి కంగారు పడిన చిట్టబ్బాయి తలుపు వేసి స్థానికులను పిలిచాడు. అందరూ అక్కడకు చేరుకుని, వారిద్దరినీ పట్టుకున్నారు. వారిని ఆరా తీయగా.. పెదవి విప్పకపోవడంతో సమీపంలోని స్తంభానికి కట్టి స్థానికులు చితకబాదారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రావులపాలెం సీఐ సీహెచ్‌వీ రామారావు ఆధ్వర్యంలో వారిని విచారణ చేస్తున్నారు.
వారి వద్ద రెండు కత్తులు, కొడవలి, రంపం బ్లేడ్లు, స్క్రూడ్రైవర్, గుణపంలా ఉన్న ఇనుప రాడ్, తాడు, కారం పొట్లాలు, బిస్కెట్ ప్యాకెట్లు, బ్యాగ్‌ను కనుగొన్నారు. ఇద్దరిలో ఒక్కరికి 45 ఏళ్లు, మరొకరికి 30 ఏళ్లుంటాయని స్థానికులు తెలిపారు. వారిని పోలీసులు వివిధ కోణాల్లో ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. తొలుత వారు హిందీలో మాట్లాడగా, పోలీస్ స్టేషన్‌లో ఒకరు తెలుగులో మాట్లాడినట్టు సమాచారం. వారు మారుమూల గ్రామీణ ప్రాంతంలో మాటువేయడానికి కారణం ఏమిటి, వారి వెనుక ఇంకెంతమంది ఉన్నారు. వీరిని ఎవరు తీసుకొచ్చారు అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. దీనిపై సీఐ రామారావును విలేకరులు ప్రశ్నించగా, ఇప్పుడే ఏమీ చెప్పలేమని, అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నామని తెలిపారు.
Advertisement
Advertisement