
డ్రగ్‌స్టోర్‌కు తాళం
ఓ ఫార్మాసిస్టు నిర్వాకం
- సస్పెన్షన్ ఎత్తివేయలేదని నిరసన
- క్షయ నివారణ కేంద్రంలో
- ఇది రెండో ఘటన ఐదు రోజులుగా
- మౌనందాల్చిన అధికారులు
కర్నూలు(హాస్పిటల్), న్యూస్‌లైన్: తన సస్పెన్షన్‌పై ట్రిబ్యునల్ కోర్టు స్టే ఇచ్చినా అధికారులు పట్టించుకోవడం లేదంటూ ఓ ఫార్మాసిస్టు జిల్లా క్షయ నివారణ కేంద్రం డ్రగ్‌స్టోర్‌కు తాళం వేశారు. పైగా ఒక పేపర్‌పై తన పేరు రాసి, తాళానికి సీల్ చేయడం గమనార్హం. విషయం తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. 2010లో క్రిష్ణగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్న బి.శారద ఎస్సీ, ఎస్టీ కేసు విషయమై అప్పట్లో వారం రోజుల పాటు జైలుకు వెళ్లారు. ఈ విషయమై ఆమె కోర్టుకు వెళ్లడంతో 2012లో కేసును కొట్టేశారు. ఘటన జరిగిన నాలుగేళ్లకు అధికారులు ఆమెకు శిక్ష విధించారు.
జైలుకు వెళ్లిన విషయం ఆమె దాచి పెట్టారంటూ గత నెల 23న జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ వై.నరసింహులు ఆమెను సస్పెండ్ చేశారు. సస్పెన్షన్‌ను సవాల్ చేస్తూ ఆమె ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అదే నెల 28న సస్పెన్సన్‌పై కోర్టు స్టే ఇచ్చింది. ఆ మేరకు తన సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ఆమె జిల్లా క్షయ నివారణఅధికారిని కోరారు. సస్పెండ్ చేసింది తాను కాదని చెప్పడంతో.. ఆ తర్వాత ఆమె డీఎంహెచ్‌ఓను కలిశారు. అక్కడ కూడా ఇదే సమాధానం రావడంతో డెరైక్టర్ ఆఫ్ హెల్త్‌ను ఆశ్రయించారు.
ఆయన కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేసినట్లు చెప్పడంతో ఆమె విసిగిపోయారు. ఈ నెల 15న జిల్లా క్షయ నివారణ కేంద్రానికి చేరుకుని డ్రగ్‌స్టోర్‌కు తాళం వేసి, దానికి తన పేరుతో ఉన్న పేపర్‌ను అతికించి వెళ్లిపోయారు. జిల్లా క్షయ నివారణ కేంద్రంలోని డ్రగ్‌స్టోర్‌కు గతంలోనూ ఓ ఫార్మాసిస్టు ఆరు నెలల పాటు తాళం వేయడం గమనార్హం. ఫార్మాసిస్టుల సమస్యలను సామరస్య పూర్వకంగా పరిష్కరించడంలో అధికారులు విఫలమవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తరచూ డ్రగ్‌స్టోర్‌కు తాళం పడుతుండటంతో మందుల కొరత ఏర్పడుతోంది.
అధికారులు విధిలేని పరిస్థితుల్లో వచ్చిన స్టాక్‌ను నేరుగా టీబీ యూనిట్‌లకు పంపుతున్నారు. డ్రగ్‌స్టోర్‌కు తాళం వేసిన విషయమై ఫార్మాసిస్టు శారదను వివరణ కోరగా తన సస్పెన్షన్‌పై కోర్టు స్టే ఇచ్చినా అధికారులు పట్టించుకోకపోవడం వల్లే తాళం వేశానన్నారు. గతంలో ఆరు నెలల పాటు ఓ ఉద్యోగి ఇలాగే తాళం వేసినా ఎవ్వరూ ప్రశ్నించలేదన్నారు. సమస్యను డీఎంహెచ్‌వో దృష్టికి తీసుకెళ్లిన తర్వాతే తాను తాళం వేసినట్లు తెలిపారు.