ఖజానాకు తాళం | lock to Treasury office | Sakshi
Sakshi News home page

ఖజానాకు తాళం

Published Sat, May 24 2014 4:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

lock to Treasury  office

 సాక్షి, కాకినాడ : రాష్ర్ట విభజన నేపథ్యంలో ట్రెజరీ కార్యకలాపాలు ఏకంగా పది రోజులకు పైగా స్తంభించనున్నాయి. గతంలో ఎన్నడూ లేని రీతిలో మే నెలకు సంబంధించి జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ వారం రోజుల ముందుగానే పూర్తయింది. సాధారణంగా జూన్ ఒకటిన ఈ చెల్లింపులు జరుగుతాయి. పెన్షన్లయితే ఐదో తేదీ వరకు చెల్లిస్తారు. విభజన నేపథ్యంలో ఈ చెల్లింపుల ప్రక్రియ శనివారంతో ఫుల్‌స్టాప్ పెట్టేందుకు ట్రెజరీ శాఖాధికారులు తలమునకలయ్యారు. ఈ నెల 25 నుంచి అపాయింటెడ్ డే మరుసటి రోజు వరకు ప్రభుత్వానికి సంబంధించిన ఎలాంటి లావాదేవీలు జరపరు. ముఖ్యంగా ట్రెజరీపరంగా చెల్లింపులు, వసూళ్లు పూర్తిగా నిలిచిపోనున్నాయి.

ప్రభుత్వ నిర్ణయం మేరకే..
జిల్లావ్యాప్తంగా ఉద్యోగుల వేతనాలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులతో పాటు పింఛన్ల చెల్లింపుల ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రెజరీ శాఖ వారం రోజులుగా తీవ్ర ఒత్తిడికి గురైంది. 21వ తేదీతో బిల్లుల స్వీకరణకు 24వ తేదీ చెల్లింపులకు గడువుగా ప్రభుత్వం నిర్ణయించడంతో.. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు నానా హైరానా పడ్డారు. సబ్ ట్రెజరీ కార్యాలయాల పరిధిలో ఉండే బిల్లులను జిల్లా కేంద్రానికి రప్పించి, సర్వర్‌తో అనుసంధానం చేసి బిల్లుల  ల్లింపును పూర్తిచేశారు. ఇప్పటి వరకు జరిగిన వ్యయాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఖాతాలో లెక్కించారు. ఇక నుంచి జరిగే బిల్లులను రెండు రాష్ట్రాల ఖాతాలో జమ చేసేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

మళ్లీ మార్గదర్శకాల తర్వాతే..
జిల్లాలో 58 వేల మంది ఉద్యోగులుండగా, 40 వేల మంది వరకు ప్రభుత్వ పింఛనుదారులున్నారు. ఉద్యోగులకు సంబంధించి జీతభత్యాల కింద ప్రతీనెలా రూ.107 కోట్ల చెల్లింపులు జరుగుతాయి. పింఛనుదారులకు పెన్షన్ల రూపంలో రూ.66 కోట్ల వరకు చెల్లిస్తారు. మరో రూ.10 కోట్ల నుంచి రూ.20 కోట్ల వరకు వివిధ బిల్లుల కింద చెల్లింపులు జరుగుతాయి. బిల్లుల చెల్లింపులన్నీ నెల పొడవునా జరుగుతుంటాయి. జీతభత్యాలు, పింఛన్ల చెల్లింపులు మాత్రం ప్రతీ నెలా మొదటి వారంలోనే చేస్తారు. రాష్ర్ట విభజన నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ చెల్లింపులన్నీ పది రోజుల ముందుగానే చెల్లిస్తారు. అయితే ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేసే వారికి సంబంధించిన రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను కూడా గతంలో ఎన్నడూ లేని రీతిలో ఈ నెలాఖరులోగానే చెల్లింపులు జరిపేలా ఏర్పాట్లు చేశారు.

రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ మినహా ఇతర చెల్లింపులను ఈ నెల 25 నుంచి పూర్తిగా నిలిపి వేయనున్నారు. శనివారం సాయంత్రం నుంచి ట్రెజరీ శాఖకు సంబంధించిన సర్వర్‌ను పూర్తిగా లాక్ చేయనున్నారు. ప్రతీ రోజు ఈ శాఖ ద్వారా సరాసరి రూ.4 కోట్ల నుంచి రూ.5 కోట్ల మేర చెల్లింపులు జరుగుతుంటాయి. ఆ మేరకు రానున్న పది రోజులు నిలిచిపోనున్నాయి. అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులు కూడా నిలిచిపోనున్నాయి. దీనివల్ల ఆయా పనులకు విఘాతం కలగనుంది. గతంలో మంజూరై, ప్రస్తుతం పనులు జరుగుతున్న వాటికి సంబంధించి బిల్లుల చెల్లింపులను రాష్ర్ట విభజన అనంతరం పునఃప్రారంభిస్తారు.

వాస్తవానికి అపాయింటెడ్ డే తర్వాత కొత్త రాష్ర్ట కార్యకాలాపాలు ప్రారంభం కావాల్సి ఉన్నప్పటికీ, ఈ నెల 26 నుంచే అందుకు సంబంధించి అంతర్గతంగా ప్రాథమిక స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 24లోగా చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు నేటితో చెల్లింపులన్నీ నిలిపివేస్తున్నామని జిల్లా ట్రెజరీ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్ పీఎస్ సూర్యప్రకాశ్ ‘సాక్షి’కి తెలిపారు.

అపాయింటెడ్ డే తర్వాతే ట్రెజరీ శాఖకు కొత్త మార్గదర్శకాలు వచ్చే అవకాశం ఉందన్నారు. అప్పటి వరకు ఎలాంటి చెల్లింపులు జరపబోమని చెప్పారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో వారం రోజుల ముందుగానే జీతభత్యాలు, టీఏ, డీఏలు, మెడికల్ బిల్లులు, పింఛన్లు అందుకున్న ఉద్యోగులు, పింఛనుదారులు రాష్ర్ట విభజన అనంతరం సకాలంలో జీతభత్యాలు, పింఛన్లు అందుతాయో, లేదోననే ఆందోళనలో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement