
ఎన్టీఆర్ అంటే అంత నిర్లక్ష్యమా!
వైఎస్సార్ జిల్లా(రాజంపేట): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి కమిటి కన్వీనర్ నారా లోకేష్ వైఎస్‌ఆర్ జిల్లా పర్యటన ఆ పార్టీ నేతలు, కార్యకర్తలను తీవ్ర నిరాశకు గురిచేసింది. లోకేష్ తీరుకు వారు చాలా నిరుత్సాహపడ్డారు. బ్రహ్మంగారి మఠం మండలం కేశవపురంలో ఇటీవల మృతి చెందిన పార్టీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించడానికి బుధవారం ఉదయం ఆయన తిరుపతి నుంచి బయలుదేరారు. మార్గం మధ్యలో రాజంపేటలో కాసేపు ఆగారు. బైపాస్ సర్కిల్‌లో పార్టీ వ్యవస్థాపకుడు ఎన్‌టీఆర్ విగ్రహానికి పూల మాల వేయించడానికి పార్టీ నేతలు, కార్యకర్తలు ఏర్పాట్లు చేశారు. పూలదండను ఎన్‌టీఆర్ విగ్రహం భుజంపై సిద్ధంగా ఉంచారు.
లోకేష్ అక్కడకు రాగానే ఎన్‌టీఆర్ విగ్రహానికి పూల మాల వేయాలని కార్యకర్తలు, నేతలు కోరారు. ఇందుకు ఆయన స్పందించ లేదు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆయన వద్దకు వెళ్లి మాట్లాడారు. అయినా లోకేష్ పట్టించుకోకుండా విగ్రహాన్ని చూస్తూ ముందుకు వెళ్లిపోయారు. దాంతో కార్యకర్తలు తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. పార్టీ వ్యవస్థాపకుడు, తన తాత విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించకుండా లోకేష్ నిర్లక్ష్యంగా వెళ్లిపోయినందుకు కార్యకర్తలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.