
అక్రమాల పాతరకు యత్నం
ఆత్మకూరు:
ఆత్మకూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పెద్ద స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోంది. చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అందాల్సిన పౌష్టికాహారం యథేచ్ఛగా నల్లబజారుకు తరలుతోంది. రెండు నెలలకు సరిపడా ఆహారం, సరుకులు ఈ ప్రాజెక్ట్ గొడౌన్‌కు సరఫరా కాగా అందులో నెల సరుకులనే అంగన్‌వాడీ కేంద్రాలకు పంపిణీ చేసి మిగిలిన సరుకులను ఓ ప్రైవేటు వ్యాపారికి నిలువునా అమ్మేశారు. ఆత్మకూరు ప్రాజెక్ట్ సరుకులను అన్‌లోడ్ చేసే సమయంలో గోడౌన్ వద్ద ప్రాజెక్ట్ అధికారులకు బదులు ఈ ప్రైవేటు వ్యక్తి పట్టుబడటంతో వ్యవహారం వెలుగుచూసింది. సరుకుల్లో తేడాను గుర్తించారు. దీనిపై స్పందించిన జిల్లా ప్రాజెక్ట్ అధికారిణి విచారణ ప్రారంభించడంతో అవినీతి భాగోతం బయటపడుతోంది. ఈ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఇప్పుడు ప్రాజెక్ట్ అధికారులు అడ్డదారులు వెతుకుతున్నారు.
తనిఖీలు ఎక్కెడెక్కడంటే..?
ప్రాజెక్ట్ పరిధిలోని ఆత్మకూరు, అనంతసాగరం, ఏఎస్‌పేట మండలాల్లో తనిఖీలు జరిపారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధం లేని ఏడు మంది సీడీపీఓలను పంపి అంగన్‌వాడీ కేంద్రాలను సామూహికంగా తనిఖీ చేయించారు. సరుకులకు సంబంధించిన రికార్డు పరిశీలిస్తే సరఫరాలో చోటు చేసుకున్న సరుకుల కోత బట్టబయలైంది.
కారకులెవరు ?
అంగన్‌వాడీ కేంద్రాలకు చేరాల్సిన సరుకులు నల్లబజారుపాలు కావడానికి కారణం ప్రాజెక్ట్‌లోని సూపర్‌వైజర్‌గా విచారణలో వెల్లడైనట్టు తెలిసింది. అంతా తానై షాడో సీడీపీఓగా వ్యవహరించడమేనని అటు తనిఖీ అధికారులు, ఇటు కొందరు సూపర్‌వైజర్లు బాహాటంగానే వాఖ్యానిస్తున్నారు.
ఇప్పుడేం జరుగుతోందంటే....?
విచారణలో వెల్లడైన అక్రమాలను కప్పిపుచ్చేందుకు సీడీపీఓ, షాడో సీడీపీఓతో పాటు కొందరు సూపర్‌వైజర్లు వారికి అనుకూలమైన కార్యకర్తలను పావులుగా వినియోగిస్తున్నారని సమాచారం. వీరిని రకరకాలుగా బెదిరింపులకు గురిచేస్తూ తమకు అనుకూలంగా చెప్పాలని ప్రలోభపెడుతున్నట్టు విమర్శలు వస్తున్నాయి.
అంగన్‌వాడీ కార్యకర్తలపై ఒత్తిడి తెచ్చి రెండు నెలల సరుకు కేంద్రాలకు పంపిణీ చేసినట్టు చెప్పాలని కొందరు సూపర్‌వైజర్ల ద్వారా హుకుం జారీ చేయిస్తున్నారు. ఈ కుంభకోణం నుంచి బయటవేయమని అధికారపార్టీ నేతలను ఆశ్రయించారు.