
నీటిలో మునిగి ఉన్న లారీలు(వృత్తంలో)
శ్రీకాకుళం, సరుబుజ్జిలి: పాతికలారీలు.. సుమారు రూ.13 కోట్ల విలువ.. వారం రోజుల నిరీక్షణ.. ఆఖరకు మిగిలింది మాత్రం నిరాశ. పురుషోత్తపురం ఇసుక ర్యాంపులోని వంశధార వరదల్లో చిక్కుకున్న 25 లారీలు బయటపడే మార్గాలు దుర్లభమైపోతున్నాయి. లారీలు వరదలో చిక్కుకుని సుమారు వారం రోజులు గడుస్తున్నాయి. నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టిన సమయంలో ఆదరాబాదరాగా పొక్లెయిన్లను తొలగించారు. ఈ పొక్లెయిన్ల యజమానులు కొందరు టీడీపీ నాయకులకు దగ్గరి వారు కావడంతో ముందుగా ఆ వాహనాలను బయటకు తీయించారు. కానీ లారీల విషయంలో మాత్రం అధికారులు పట్టనట్టే వ్యవహరిస్తున్నారని ఆ వాహనాల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నదికి మళ్లీ వరదలు
వారం రోజులు గడవక ముందే వంశధార నదిలోకి మళ్లీ వరద వచ్చింది. నదిలో నీరు తగ్గితే వాహనాలు బయటకు తీయవచ్చని ఆశపడిన లారీల యజమానులకు ఈ వరద పీడకలగా మారుతోంది. ఒక్కో లారీని రూ.30 లక్షల నుంచి రూ.40 లక్షల వరకు పెట్టుబడులు పెట్టి కొనుగోలు చేశామని, అంతా ఫైనాన్స్ మీదే తెచ్చామని లారీల యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు రూ.13 కోట్ల విలువైన వాహనాలు నదిలోనే ఉండిపోయినా అధికారులు పట్టించుకోవడం లేదని వారంటున్నారు.
ఒడిశా ప్రాంతంలో విస్తారంగా వానలు కురవడంతో వంశధారలో ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. దీంతో లారీలను బయటకు తీసే ప్రక్రి య మరింత ఆలస్యం కావచ్చు.
ఇప్పటికే వారం రోజులుగా లారీలు నీటిలోనే ఉండిపోవడం వల్ల భాగాలు పాడవుతాయని, వరదల వల్ల లారీలు కూడా మిగిలే పరిస్థితులు కనిపించడం లేదని యజమానులు వాపోతున్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు కుటుంబాలతో కలసి వచ్చి సరుబుజ్జిలి తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలు చేస్తామని ప్రకటించారు.
నీరు గారుతున్న దర్యాప్తు
సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఇంతవరకు ఎవరిపైనా చర్యలు లేకపోవడంతో కేసును నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీ సు వారి చేతిలో ఫైలు ఉందని చెబుతున్నప్పటికీ ఎలాంటి పురోగతి లేదు. విచారణ కోసం ఏ ఒక్క అధికారిని కూడా జిల్లా అధికారులు నియమించలేదు. దీనిపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.