అభినవ తారవో...
ప్రేమ... ఈ పదం... ప్రియరాగాలాపనలు చేస్తూ పారిజాతాల సువాసనలు వెదజల్లుతూ గుండె నిండా గుడి
గంటలు మోగిస్తుంది. ఆకర్షణకు... ప్రేమకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఈ తేడా గమనించి వలపుల పంట పండించుకోవాలంటున్నాయి ప్రేమించి పెళ్లి చేసుకొని పండంటి జీవితాన్ని గడుపుతున్న ఈ జంటలు.
అభినవ తారవో... నా అభిమాన తారవో, అభినయ, రసమయ కాంతిరేఖవో అనే కాదు కలహంస నడకదాన, కమలాల కనులదాన అంటూ పొగడ్తలతో... ఇందువదన కుందర దన మందగమన మధుర వచన గగన జఘన సొగసులలనవు నీవేనని పద విన్యాసలతో... ఏ దివిలో విరిసిన పారిజాతమో, ఏ కవిలో మెరిసిన ప్రేమ గీతానికే పరి మితం చేయకుండా కాళిదాసు కలమందు చిందు అపురూప దివ్యకవిత, త్యాగరాజు కృతులందు వెలయు గీతారసారం నీవేనంటూ కవిత్వాలను అల్లుతూ అబ్బాయిలు వెంటపడుతుంటారు. ఇక్కడే అమ్మాయిలు కాస్తా ఆలోచించాలి... అందులో నిజమెంతుందో నిగ్గు తేల్చుకోవాలి. నిన్నకు, రేపుకు సంధిగా నిలిచే సుందరీ అంటూ పాదాభివందనాలు చేయనవసరం లేదు. మనసున మనసై, బతుకున బతుకై, తోడుగా ఉంటే చాలు అదే భాగ్యం. అప్పుడే మనసు పరిమళిస్తుంది... తనువు పరవశిస్తుంది... నవ వసంత గానంలా జీవనయానం సాగిపోతుంది. ఇలాగ వచ్చి... అలాగ తెచ్చి... ఎన్నో వరాల మాలలు గుచ్చి నా మెడ నిండా వేశావు ... నన్నో మనిషిగ చేశావు, ఎలాగ తీరాలి నీ రుణమెలాగ తీరాలి అంటూ కట్టుకున్నవాడు వివాహమైన తరువాత కూడా మననం చేసుకుంటే కొల్లేటి కొలనులో కులికేటి అలల్లా కాపురం ఆనందంగా సాగిపోతుంది.