విశాఖ లీగల్: వివాహం చేసుకుంటానని యువతిని మోసం చేసిన వ్యక్తికి రెండేళ్ల జైలు శిక్ష, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ నగరంలోని 11వ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి లాలం శ్రీధర్ మంగళవారం తీర్పు చెప్పారు. జరిమానా చెల్లించిన పక్షంలో అదనంగా మూడు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించాలని ఆ తీర్పులో పేర్కొన్నారు. ప్రత్యేక పబ్లిక్ ప్రాసెక్యూటర్ బి.వి.ఆర్.మూర్తి అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నిందితుడు చిలికి మహేష్( 21) నగరంలోని పూర్ణామార్కెట్ ప్రాంతంలో ఉంటున్నాడు.
బాధితురాలు ఆర్‌అండ్‌బీ దగ్గర నివసిస్తున్నారు. ఆమె సమీపంలోని మాధవధార వుడా కాలనీలో ఒక స్టేషనరీ షాపులో పనిచేసేది. ఈ నేపథ్యంలో నిందితుడు బాధితురాలు పనిచేసే పుస్తకాల షాప్‌నకు వెళ్లేవాడు. వారి మధ్య పరిచయం ప్రేమగా మారింది. వారి కులాలు వేరు కాగా పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటానని మహేష్ యువతికి మాట ఇచ్చాడు. 2016 ఫిబ్రవరి 18న పెళ్లి చేసుకుంటానని ముహూర్తం పెట్టించాడు. అలాగే సింహాచలంలోని ఒక కల్యాణ మండపం కూడా తీసుకున్నాడు.
పెళ్లి సమయానికి బాధితురాలని కల్యాణమండపం దగ్గర వదిలిపెట్టి నిందితుడు పలాయనం చిత్తగించాడు. యువతి తనకు జరిగిన అన్యాయాన్ని నగరంలోని ఎయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేసి నేరాభియోగ పత్రాన్ని దాఖలు చేశారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి పై విధంగా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment