హనీమూన్ కోసం 15 దేశాల్లో సైకిల్ సవారీ దేవరపల్లి చేరుకున్న ఫ్రాన్స్ దంపతులు
‘ప్రేమయాత్రలకు కొడెకైనాలు..కాశ్మీరాలు ఏలనో’.. అంటూ గుండమ్మకథలో ఏఎన్నార్, జమున ఆడిపాడిన యుగళగీతం తెలుగు శ్రోతల మదిలో ఎప్పటికీ మార్మోగుతుంటుంది. ఆ కథానాయికలు హనీమూన్ వద్దనుకున్నా ఫ్రాన్స్ దేశానికి చెందిన ఓ చిన్నది, ఓ చిన్నోడు అలా అనుకోలేదు. వారి ‘ప్రేమ దేశాలు’ దాటి ప్రయాణిస్తోంది. విశ్వవ్యాప్తమై పరిమళిస్తోంది. ఈ ప్రేమ జంట పెళ్లయ్యాక హనీమూన్‌ను వినూత్నంగా జరుపుకోవాలనుకున్నారు. ఫ్రాన్స్ నుంచి సైకిల్‌పై బయల్దేరిన వీళ్లిద్దరూ ఎన్నో దేశాల్లో తిరిగి ప్రస్తుతం భారతదేశంలో పర్యటిస్తున్నారు. మంగళవారం దేవరపల్లి చేరుకున్న మాధ్యూ, మేలిస్ అబాడై దంపతులు స్థానిక బసంతి హోటల్‌లో విలేకరులకు అందించిన ఆసక్తికరమైన విశేషాలు వారి మాటల్లో..
2014 జూలై 12న మాధ్యూ, మేలిస్ అబాడై వివాహం జరిగింది. జూలై 27న ఫ్రాన్స్ నుంచి సైకిల్‌పై బయల్దేరారు. పదిహేను దేశాల పర్యటనలో భాగంగా ఇప్పటి వరకు 10 దేశాల్లో పర్యటించి 11వ దేశమైన భారతదేశం చేరుకున్నారు. ఈ ఏడాది జూలై 25 నాటికి యాత్ర పూర్తి చేసుకొని స్వదేశానికి వెళ్తారు. రోజుకు వంద కిలో మీటర్లు ప్రయాణిస్తున్నారు. ఇందుకు రోజుకు సుమారు రూ.1,000 ఖర్చవుతోంది. యాత్ర ముగిసేటప్పటికి మొత్తం రూ.4 లక్షలు ఖర్చవుతుంది.
సైకిల్ ఖరీదు రూ.60 వేలు
జర్మనీలో తయారైన సైకిల్‌ను రూ.60 వేలకు కొనుగోలు చేసి 15 దేశాల్లో పర్యటిస్తున్నారు. ఆర్మేనియా నుంచి సైకిల్‌ను విమానంలో ముంబయికి తీసుకొచ్చారు. ముంబయి నుంచి సైకిల్‌పై కన్యాకుమారి, చెన్నై, శ్రీలంక వెళ్లారు. అక్కడినుంచి మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. ఇప్పటి వరకు థాయ్‌లాండ్, వియత్నాం, కంబోడియా, లావోస్, షార్జా, గల్ఫ్ దేశాల్లో పర్యటించారు. భారతదేశం సంస్కృతి సంప్రదాయాలు బాగున్నాయని దంపతులు తెలిపారు. ఫ్రాన్స్, యూరప్ దేశాల్లో వరి పంట ఉండదన్నారు. ఇక్కడి వ్యవసాయానికి, ఫ్రాన్స్ వ్యవసాయానికి తేడా ఉందన్నారు. జూన్ 27 నాటికి కోలకత్తా చేరుకొని యాత్రను ముగిస్తామని, అక్కడి నుంచి విమానంలో ఫ్రాన్స్ వెళ్తామని మాధ్యూ తెలిపారు. న్యాయవాదిగా పనిచేస్తున్న మేలిస్ అబాడైను ప్రేమించి పెళ్లి చేసుకున్నట్టు ఆయన తెలిపారు. దంపతులకు జిల్లా కిసాన్‌మోర్చా అధ్యక్షుడు కైరం అప్పారావు వీడ్కోలు పలికారు.
- దేవరపల్లి
లవ్ జర్నీ
Published Tue, Feb 24 2015 11:54 PM | Last Updated on Sat, Sep 2 2017 9:51 PM
Advertisement
Advertisement