పెళ్లికి నిరాకరించిన ప్రేమికుడు
అతడి ఇంటి ఎదుట
బైఠాయించిన ప్రియురాలు
చివరకు పెద్దల సమక్షంలో పెళ్లి
బెజ్జంకి, న్యూస్‌లైన్ :
ప్రేమించిన వాడు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి అతడి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. చివరకు అతడు దిగివచ్చి పెళ్లి చేసుకోవడంతో ప్రేమకథ సుఖాంతమైంది. మండలంలోని దాచారం గ్రామానికి చెందిన లక్ష్మి-నారాయణ దంపతులకు ముగ్గురు కూతుళ్లు. వీరు హైదరాబాద్‌లో ఉండేవారు. పెద్ద కూతురుకు పెళ్లయింది. మిగతా ఇద్దరిలో రెండో కూతురు సోని(సునీత), మూడో కూతురు లావణ్య అక్కడే ఇళ్లలో పనులు చేసుకుంటూ ఉండేవారు. నారాయణ చనిపోవడంతో లక్ష్మి స్వగ్రామానికి రాగా, సోని ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లింది. ఇదే గ్రామానికి చెందిన కనగండ్ల నర్సయ్య-ఎల్లవ్వ దంపతుల కుమారుడు రాంబాబు ఘట్‌కేసర్‌లో ఉంటూ బీటెక్ చదువుతున్నాడు. లావణ్యతో పరిచయం ఏర్పడి, ఆమెతో ఫోన్‌లో మాట్లాడేవాడు. ఈ క్రమంలో సోని దుబాయి నుంచి చెల్లెలు దగ్గరకు రాగా, అతడు ఆమెతో స్నేహం చేశాడు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో ఇద్దరూ మూడు నెలలు కలిసి తిరిగారు.
ఆ తర్వాత ఆమె పెళ్లి ప్రస్తావన తేగా, దాట వేస్తూ వస్తున్నాడు. దీంతో సోని ఆదివారం బెజ్జంకి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు రాంబాబుకు కౌన్సెలింగ్ ఇవ్వగా పెళ్లికి ఒప్పుకున్నాడు. అందరూ పెళ్లి ఏర్పాట్లు చేయగా, సమయానికి నిరాకరించాడు. దిక్కుతోచని స్థితిలో పడిపోయిన సోని తనకు న్యాయం చేయాలని కుటుంబసభ్యులతో కలిసి గురువారం దాచారంలోని అతడి ఇంటి ఎదుట బైఠాయించింది. ఇరువర్గాల పెద్ద మనుషులు చర్చలు జరపడంతో రాంబాబు పెళ్లికి ఒప్పుకున్నాడు. బెజ్జంకి నృసింహాలయంలో సాయంత్రం పెళ్లి జరిపించడంతో కథ సుఖాంతమైంది.
ప్రేమ కథ సుఖాంతం
Published Fri, Jan 10 2014 2:29 AM | Last Updated on Sat, Sep 2 2017 2:26 AM
Advertisement