బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం
విశాఖపట్టణం: నైరుతి బంగాళఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావం దక్షిణకోస్తాపై ఎక్కువగా ఉంటుందని తుపాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తాలో చాలా చోట్ల, ఉత్తర కోస్తాలో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. నైరుతి బంగాళఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరింత బలపడి తమిళనాడు వద్ద తీరం దాటే అవకాశముందని తెలిపింది.
మరోవైపు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. ఇప్పటికే రుతుపవనాల కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కాగా, ఒకవైపు వర్షాలు, మరోవైపు అధికమవుతున్న ఉష్ణోగ్రతలతో రాష్ట్రంలో ప్రస్తుతం విచిత్ర పరిస్థితి నెలకొంది. కోస్తాంధ్రలో కొన్ని చోట్ల వర్షాలు పడుతుంటే, మరికొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.