చెప్పారంతే..! | LPG cylinders prices are no changes... | Sakshi
Sakshi News home page

చెప్పారంతే..!

Published Wed, Feb 12 2014 1:43 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM

LPG cylinders prices are no changes...

సాక్షి, కడప: ‘నోరు ఒకటి చెబుతుంది... చెయ్యి మరొకటి చేస్తుంది. దేని దోవ దానిదే!’’ అన్నట్లుంది కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఎన్నికలకు ముందు ప్రజలకు ఊరటనిచ్చే నిర్ణయాలను ప్రకటించిన కేంద్రం.. వాటిపై చిత్తశుద్ధిని ప్రదర్శించడం లేదు. వంటగ్యాస్‌కు ‘ఆధార్’ అనుసంధానాన్ని నిలిపేస్తూ, ఏడాదికి సిలిండర్ల సంఖ్యను 12కు పెంచుతున్నట్లు 15రోజుల కిందట కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. అయితే  ఉత్తర్వులు మాత్రం వెలువరించలేదు. దీంతో వినియోగదారులు తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు. మాటలు ఒకలా చేతల్లో మరొకలా వ్యవహరిస్తున్న కేంద్రం తీరుపై మండిపడుతున్నారు.
 
 అంతా గందరగోళం:
 కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లో ఏదీ సక్రమంగా అమలు కావడం లేదు. రాయితీ సిలిండర్లు ఏడాదికి 9మాత్రమే ఇచ్చేవారు. అయితే 12 సిలిండర్లు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అంటే మార్చిలోపు 3 సిలిండర్లు అదనంగా వినియోగదారులకు అందాలి. అయితే గ్యాస్ ఏజెన్సీల డీలర్లు మాత్రం ఈ ఆర్థిక సంవత్సరం మార్చితో ముగుస్తుందని, అందువల్ల ఫిబ్రవరి, మార్చిలకు రెండు సిలిండర్లు మాత్రమే ఇస్తామని చెబుతున్నారు. ఏప్రిల్ నుంచి 12 సిలిండర్లు ఇస్తామంటున్నారు. అంటే ఈ ఏడాదికి 11 సిలిండర్లు మాత్రమే ఇచ్చినట్లువుతుంది.
 
 డీలర్లకు..వినియోగదారులకు వాగ్వాదం:
 జిల్లాలో గ్యాస్‌సిలిండర్ ధర 413 రూపాయలు. అయితే సర్వీసు చార్జీతో కలిపి పట్టణాల్లో 440, పల్లెల్లో 450 రూపాయలు గ్యాస్‌ఏజెన్సీలు వసూలు చేస్తున్నాయి. ఆధార్‌తో బ్యాంకు ఖాతాను అనుసంధానం చేసిన తర్వాత సిలిండర్ ధర 1343రూపాయలు (రశీదుపైన ఉండే ధర). అయితే సర్వీసు చార్జీతో కలిపి 1380 రూపాయలు తీసుకుంటున్నారు. రాయితీ డబ్బు బ్యాంకు ఖాతాలో పడుతుందా అంటే అదీ లేదు. రోజుల తరబడి డ బ్బులు జమకావడం లేదు. ఒక బ్యాంకులో ఖాతా ఉంటే మరొక బ్యాంకులో సొమ్ము జమ అవుతుందంటే ‘ఆధార్, బ్యాంక్ ఖాతాల వ్యవస్థ’ ఎంత అధ్వానంగా ఉందో ఇట్టే తెలుస్తుంది. ఈ కొత్త ప్రక్రియతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు.

దీంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేస్తున్నామని, సబ్సిడీ ధరను కేంద్రమే చెల్లించి రాయితీ సిలిండర్లు పాతపద్ధతి ద్వారా అందిస్తామని కేంద్ర మంత్రివర్గం ప్రకటించింది. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఈ పరిణామంపై టీవీల్లో భారీ ప్రకటనలు కూడా చేస్తోంది. అయితే ఉత్తర్వులు మాత్రం వెలువరించలేదు. ఈ క్రమంలో ప్రకటనలు చూపి మహిళలు రాయితీకి సిలిండర్లు ఇవ్వాలని డీలర్లతో వాదనకు దిగుతున్నారు. డీలర్లు మాత్రం తమకు ఆదేశాలు రాలేదని, 1380 రూపాయలు చెల్లిస్తేనే సిలిండర్ ఇస్తామని లేదంటే లేదని తేల్చి చెబుతున్నారు. బ్యాంక్ ఖాతాకు ఆధార్ అనుసంధానం కూడా తప్పనిసరి అని లేదంటే రాయితీ మొత్తం జమ కాదని కూడా చెబుతున్నారు. దీంతో నిత్యం డీలర్లకు, వినియోగదారులకు వాగ్వాదం చోటు చేసుకుంటోంది.
 
 బ్యాంకు....‘ఆధార్’ అనుసంధానం ఇలా:
 జిల్లాలో 5.76 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఇండేన్, హెచ్‌పీ, భారత్ ఏజెన్సీలలో  5, 24, 305 గ్యాస్ కనెక్షన్‌లు ఉన్నాయి. వీటిలో 63 శాతం కనెక్షన్‌లు బ్యాంకు ఖాతాలో ఆధార్ అనుసంధానం అయ్యాయి. ఈ 63 శాతం కనెక్షన్‌లలో 42శాతం మందికి మాత్రమే బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ అవుతున్నాయి. తక్కిన వాటికి ఖాతా నెంబర్ తప్పుపడిందనో, ఆధార్ నెంబరు తప్పుగా నమోదైందనో...ఏదో ఒక కారణంతో గ్యాస్ సబ్సిడీ జమ కావడం లేదు. దీంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం కేంద్రప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతోనైనా ఉపశమనం లభిస్తుందని భావిస్తే అదీ జరగకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
 
 వంటగ్యాస్ రాయితీ మొత్తాన్ని ఆధార్ అనుసంధానంతో బ్యాంకు ఖాతాల ద్వారా చెల్లించే పద్ధతిని తొలగించాం. అలాగే ఏడాదికి ఇస్తున్న రాయితీ
 సిలిండర్ల సంఖ్యను 9 నుంచి 12కు పెంచాం. ఇక నుంచి పాతపద్ధతిలోనే రాయితీతో
 వినియోగదారులు గ్యాస్ సిలిండర్లు పొందవచ్చు.
 - కేంద్రమంత్రివర్గం నిర్ణయం
 
 కేంద్రం తాజాగా తీసుకున్న
 నిర్ణయంపై మాకు ఎలాంటి
 ఉత్తర్వులు రాలేదు. కాబట్టి
 ఎప్పటిలానే రాయితీ మొత్తాన్ని ఆధార్ అనుసంధానంతో బ్యాంకు ఖాతా ద్వారానే పొందాలి. సిలిండర్‌కు సబ్సిడీ సొమ్ము కూడా చెల్లించాలి. ఆధార్ అనుసంధానం జరగని పక్షంలో రాయితీ సొమ్ము రాదు.
 - వంటగ్యాస్ సరఫరా చేసే డీలర్లు
 
 ఏం తగ్గిచ్చినట్టబ్బా!
 ముందు 450రూపాయలకి గ్యాస్ ఇచ్చాంటిరి. తర్వాత ఆధార్‌కార్డు అదీ...ఇదీ అని సెప్పి 1380 రూపాయలు తీసుకుంటాండారు. మళ్లా 450కే ఇచ్చారని అన్యారు. కానీ ఇప్పటికీ 1380 తీసుకుంటాండారు. ఇంగ ఏం తగ్గిచ్చినట్టబ్బా. తగ్గించనిదానికి సెప్పడం దేనికి.
 హజరతమ్మ,
 రాజుపాళెం
 
 లంకె పెట్టొద్దు
 గ్యాస్‌కు ఆధార్‌కార్డుతో లంకెపెట్టడం శానా తప్పు. 1380 రూపాయలు మేమిస్తే మాకు 650 రూపాయలే జమ అవుతాంది. ముందు 450 ఇచ్చాంటిమి. కొత్త పద్ధతితో చానా ఇబ్బందిగా ఉండాది. ఆధార్‌కార్డు తీసేస్తున్నామని సెప్పినారు. మాతో మాత్రం మొత్తం లెక్క తీసుకున్యారు.
 గౌసియా, రాజుపాళెం
 
 ఖాతాలో డబ్బు పడలేదు
 డిసెంబర్‌లో గ్యాస్ తీసుకున్నా. ఇప్పటి వరకూ నా ఖాతాలో డబ్బులు పడలేదు. బాలాజి గ్యాస్ ఏజన్సీ వద్దకు పోయి అడిగితే నా ఖాతాలో కాకుండా ఐసీఐసీఐ బ్యాంకులో పడింది. నేను ఏపీజీబి బ్యాంకు ఆకౌంట్ బుక్ ఆధార్ కార్డు లింక్‌తో ఇచ్చాను. ఈ విషయంపై అడిగితే వారు స్పందంచడం లేదు.  
 మదార్ బీ, ఎర్రగుంట్ల
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement