25 నుంచి ఎల్పీజీ డీలర్ల సమ్మె | lpg dealers to go on strike from 25th | Sakshi
Sakshi News home page

25 నుంచి ఎల్పీజీ డీలర్ల సమ్మె

Published Sun, Feb 23 2014 12:42 AM | Last Updated on Sat, Sep 2 2017 3:59 AM

lpg dealers to go on strike from 25th

సాక్షి, హైదరాబాద్/విజయవాడ, న్యూస్‌లైన్: కేంద్ర పెట్రోలియం సహజవాయువు శాఖ అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా 25వ తేదీ నుంచి నిరవధిక సమ్మె చేయాలని లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ (ఎల్పీజీ) డీలర్లు నిర్ణయించారు. గత రెండు రోజులుగా నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలుపుతున్న ఎల్పీజీ డీలర్లు ఈనెల 25వ తేదీ నుంచి గ్యాస్ డెలివరీతోపాటు అన్నిరకాల సేవలను  పూర్తిగా నిలిపివేసి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ న్యాయమైన డిమాండ్లు తీర్చేవరకూ నిరవధిక సమ్మె చేపట్టాలని అఖిల భారత ఎల్పీజీ డీలర్ల సమాఖ్య(ఏఐఎల్‌డీఎఫ్), భారత ఎల్పీజీ డిస్టిబ్యూటర్ల సమాఖ్య(ఎఫ్‌ఎల్‌డీఐ) ప్రతినిధులు నిర్ణయించారు. రెండు సంఘాల సంయుక్త పిలుపు మేరకు 25వ తేదీ నుంచి రాష్ట్రంలోని ఎల్పీజీ డీలర్లంతా ఆందోళనలో పాల్గొని సమ్మెను విజయవంతం చేస్తామని రాష్ట్ర ఎల్పీజీ డీలర్ల సంఘం నేత వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. ఇదిలా ఉండగా సంఘం రాష్ట్ర జాయింట్ సెక్రటరీ డి.మనోజ్‌కుమార్ శనివారం విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ.. గ్యాస్ డీలర్లు పడుతున్న ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చమురు కంపెనీల నుంచి గ్యాస్ ఏజెన్సీలకు సక్రమంగా స్టాక్ రావట్లేదన్నారు. రాత్రికిరాత్రే నిర్ణయాలు తీసుకుంటున్నారని, వాటిని అమలు చేయడంలో నానా అగచాట్లు పడుతున్నామని చెప్పారు. ఆధార్ లింకు విషయంలో తమకెటువంటి సంబంధం లేకపోయినా గ్యాస్ ఏజెన్సీలనే బాధ్యులను చేస్తున్నారని ఆరోపించారు. నిబంధనలు పాటించని ఏజెన్సీలపై చర్యలకోసం ఎండీజీ(మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్) పేరుతో కొత్త మార్గదర్శకాలు అమలు చేయడం శోచనీయమన్నారు. ఆ మేరకు చీటికిమాటికీ గ్యాస్ డీలర్లకు లక్షలాది రూపాయల జరిమానాలు విధిస్తున్నారన్నారు. 48 గంటలలోపు గ్యాస్ సరఫరా కాకపోయినా తమనే బాధ్యుల్ని చేయడం అన్యాయమన్నారు. దీంతో గత్యంతరం లేకే గ్యాస్ డీలర్లు నిరవధిక సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించినట్లు వివరించారు.
 
 డీలర్ల ప్రధాన డిమాండ్లివీ..

 2014 మార్కెటింగ్ డిసిప్లినరీ గైడ్‌లైన్స్(ఎండీజీ)ను రద్దు చేయాలి.

 నగదు బదిలీ అమలు చేయాలా? నిలిపేయాలా? అనేది ప్రభుత్వం ఇష్టం. అయితే వంటగ్యాస్ సబ్సిడీ బ్యాంకు అకౌంట్లలో జమకానందున వినియోగదారుల నుంచి డీలర్లు పడే ఇబ్బందులను తొలగించేందుకు నగదు బదిలీపై కేంద్రం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయాలి.
 సిలిండర్ సీలు తీయడానికి వీల్లేని విధంగా సీల్డ్ ఫ్రూఫ్ సిలిండర్లు అందజేయాలి. బాట్లింగ్ పాయింట్‌లోనే తూనికల్లో తేడా ఉంటే, దాంతో ఎలాంటి సంబంధం లేకున్నా డీలర్లను కేసుల్లో ఇరికించే విధానానికి ఈ పద్ధతితో చెక్‌పెట్టాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement