మృత్యుంజయుడు!
విశాఖపట్నం: రైలు రూపంలో దూసుకుంటూ వచ్చిన మృత్యువుకే టోకరా ఇచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. విశాఖ నగరంలోని కంచరపాలెం చేరువలోగల రామ్మూర్తిపంతులు పేట లెవెల్ క్రాసింగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ‘హా’శ్చర్యకర సంఘటన జరిగింది. వివరాలు...ఎఫ్‌సీఐ గోడౌన్‌లో కలాసీగా పని చేస్తున్న ఇ.అప్పారావు (50) మధ్యాహ్నం డ్యూటీ పూర్తి చేసి, కప్పరాడలో ఇంటికి ఎప్పటి మాదిరిగానే సైకిల్ మీద బయల్దేరాడు. రామ్మూర్తిపంతులు పేట లెవెల్ క్రాసింగ్ దగ్గర పైడిమాంబ కాలనీ చేరువలో గేటులేని చోట పట్టాలు దాటుతున్నాడు. సాధారణంగా ఇక్కడ అంతా జాగ్రత్తగా చూసుకుని వెళ్తారు కానీ ఏ కళమీద ఉన్నాడో అప్పారావు పరధ్యానంగా ముందుకు వెళ్లాడు.
అదే సమయంలో వాషింగ్ లైన్‌కు వెళ్తున్న లోక్‌మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్‌టీటీ) ఎక్స్‌ప్రెస్ అప్పారావును ఒక్క ఉదుటున ఢీ కొట్టింది. ఈ సంఘటనను చూస్తున్న చుట్టుపక్కల వారు హాహాకారాలు చేశారు. అప్పారావు పనైపోయిందనే అనుకున్నారు. కానీ చిత్రం.. రైలు అప్పారావును 10 మీటర్లవరకు ఈడ్చుకు వెళ్లినా, అతడు పట్టాల మధ్యలో పడడంతో చక్రాలకు దొరక్కుండా తప్పించుకున్నాడు. రైలు డ్రైవర్ వెంటనే ఇంజిన్‌ను ఆపు చేయడంతో అప్పారావు నెమ్మదిగా పాక్కుంటూ రైలు కింది నుంచి వచ్చి కూర్చున్నాడు. రైలు కింది భాగాలు తగలడంతో తల మీద, కాలి మీద గట్టి గాయాలయ్యాయి. ఏం జరిగిందో అర్థం కాని అతడు దిగ్భ్రాంతి నుంచి కాస్త తేరుకుని వివరాలు చెప్పాడు. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేయడంతో అప్పారావును కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సాక్షిగా...పచ్చడైన సైకిల్ మిగిలింది!