level crossing
-
రైలు ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వేస్టేషన్ పరిధి చరణ్‌దాస్‌పురం లెవెల్ క్రాసింగ్‌కు సమీపంలో శుక్రవారం ఓ రైలు ఢీకొని ఆర్మీ జవాన్ పాలిన మోహనరావు(43) మృతి చెందారు. ఆయన ఆర్మీలో జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందటే సెలవుపై గ్రామానికి వచ్చారు. జీఆర్పీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని నందిగాం మండలం ప్రతాప విశ్వనాథపురం (షరాబు కొత్తూరు) గ్రామానికి చెందిన పాలిన ఎర్రయ్య, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు మోహనరావు ఆర్మీలో జేసీవో హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి ఆయన భార్య అరుణకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పూండి బస్టాండ్ రోడ్డులో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లారు. రైలు పట్టాలు దాటుతుండగా డౌన్‌లైన్‌లో నౌపడ నుంచి పలాస వైపు వస్తున్న ఓ సూపర్ ఫాస్ట్ రైలు ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. విషయాన్ని పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ ధ్రువీకరించారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు కార్తీక్, యశ్వంత్ ఉన్నారు. మోహనరావు రెండు దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. మృతుని స్వగ్రామం షరాబు కొత్తూరులో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వచ్చిన నాయక్ సుబేదార్ సంజయ్ ప్రకాష్, హవల్దార్ భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
ఇక ‘గేట్ మిత్ర’లే గతి
గేట్లు రావట.. కాపలా లేని క్రాసింగ్స్‌పై చేతులెత్తేసిన రైల్వే శాఖ సాక్షి, హైదరాబాద్: గేట్ మిత్ర... ప్రస్తుతం రైల్వే తరచూ చెప్తున్న మాట. ఇది గొప్ప విజయంగా అభివర్ణించుకుంటోంది. కానీ ఇప్పుడు ఈ రూపంలో రైల్వే శాఖ చేస్తున్న నిర్లక్ష్యం భారీ మూల్యం చెల్లించుకునేందుకు పొంచి ఉంది. కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్స్ వద్ద తాత్కాలిక పద్ధతిలో నియమించిన సిబ్బంది పేరే గేట్ మిత్ర. గేటు ఏర్పాటు చేసి రెగ్యులర్ సిబ్బందిని కేటాయించేవరకు తాత్కాలిక పద్ధతిలోనే వీరిని కొనసాగిస్తామని పేర్కొన్న రైల్వే శాఖ... తాజాగా తాత్కాలిక సిబ్బందినే కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా గేటు లేని ఏ లెవల్ క్రాసింగ్ వద్ద ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదకరంగా పొంచి ఉన్న లెవల్ క్రాసింగ్స్ వద్ద వెంటనే గేట్లు ఏర్పాటు చేయాలన్న దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలను రైల్వే శాఖ అటకెక్కించింది. దానిపై ఒత్తిడి చేసి కొత్త గేట్లు, సరిపడా పోస్టులను మంజూరు చేయించాల్సిన స్థానిక రైల్వే అధికారులు దాన్ని మాటవరసకు కూడా పట్టించుకోవటం లేదు. కేవలం 35 చోట్లే చర్యలు: గత సంవత్సరం జూలైలో మెదక్ జిల్లా మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే నుంచి 600 లెవల్ క్రాసింగ్స్కు సంబంధించిన ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అతి కష్టంమీద కేవలం 35 చోట్ల మాత్రమే చర్యలు తీసుకున్నారు. మిగతా చోట్ల గేట్ మిత్ర పేరుతో తాత్కాలిక పద్ధతిలో నియమించిన సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. గ్యాంగ్‌మెన్‌గా ఉన్నవారే ఎక్కువగా ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు. రైలు వచ్చే సమయంలో లెవల్ క్రాసింగ్ వద్దకు వచ్చే తాత్కాలిక సిబ్బంది ఆ సమయంలో వాహనదారులు పట్టాలు దాటకుండా కౌన్సెలింగ్ ఇవ్వటం వీరి విధి. ఏడాది దాటినా కొనసాగిస్తుండటంతో కొందరు రైలు వచ్చే సమయంలో జాడ లేకుండా పోతున్నారు. ఇది మళ్లీ భారీ ప్రమాదాలకు కారణమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
మృత్యుంజయుడు!
విశాఖపట్నం: రైలు రూపంలో దూసుకుంటూ వచ్చిన మృత్యువుకే టోకరా ఇచ్చి ప్రాణాలు దక్కించుకున్నాడు ఓ వ్యక్తి. విశాఖ నగరంలోని కంచరపాలెం చేరువలోగల రామ్మూర్తిపంతులు పేట లెవెల్ క్రాసింగ్ వద్ద బుధవారం మధ్యాహ్నం ఈ ‘హా’శ్చర్యకర సంఘటన జరిగింది. వివరాలు...ఎఫ్‌సీఐ గోడౌన్లో కలాసీగా పని చేస్తున్న ఇ.అప్పారావు (50) మధ్యాహ్నం డ్యూటీ పూర్తి చేసి, కప్పరాడలో ఇంటికి ఎప్పటి మాదిరిగానే సైకిల్ మీద బయల్దేరాడు. రామ్మూర్తిపంతులు పేట లెవెల్ క్రాసింగ్ దగ్గర పైడిమాంబ కాలనీ చేరువలో గేటులేని చోట పట్టాలు దాటుతున్నాడు. సాధారణంగా ఇక్కడ అంతా జాగ్రత్తగా చూసుకుని వెళ్తారు కానీ ఏ కళమీద ఉన్నాడో అప్పారావు పరధ్యానంగా ముందుకు వెళ్లాడు. అదే సమయంలో వాషింగ్ లైన్‌కు వెళ్తున్న లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టీటీ) ఎక్స్‌ప్రెస్ అప్పారావును ఒక్క ఉదుటున ఢీ కొట్టింది. ఈ సంఘటనను చూస్తున్న చుట్టుపక్కల వారు హాహాకారాలు చేశారు. అప్పారావు పనైపోయిందనే అనుకున్నారు. కానీ చిత్రం.. రైలు అప్పారావును 10 మీటర్లవరకు ఈడ్చుకు వెళ్లినా, అతడు పట్టాల మధ్యలో పడడంతో చక్రాలకు దొరక్కుండా తప్పించుకున్నాడు. రైలు డ్రైవర్ వెంటనే ఇంజిన్‌ను ఆపు చేయడంతో అప్పారావు నెమ్మదిగా పాక్కుంటూ రైలు కింది నుంచి వచ్చి కూర్చున్నాడు. రైలు కింది భాగాలు తగలడంతో తల మీద, కాలి మీద గట్టి గాయాలయ్యాయి. ఏం జరిగిందో అర్థం కాని అతడు దిగ్భ్రాంతి నుంచి కాస్త తేరుకుని వివరాలు చెప్పాడు. స్థానికులు వెంటనే 108కు ఫోన్ చేయడంతో అప్పారావును కేజీహెచ్‌కు తరలించారు. ఈ సంఘటనకు సాక్షిగా...పచ్చడైన సైకిల్ మిగిలింది! -
‘గేటు’ దాటితే కేసు!
రైల్వే క్రాసింగ్స్ వద్ద నేటి నుంచి ప్రత్యేక నిఘా నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా, జైలు శిక్ష! హైదరాబాద్: లెవెల్ క్రాసింగ్ వద్ద రైలు గేటు పడితే కింద నుంచి దూరి వెళ్లటం సర్వసాధారణం. కానీ, సోమవారం నుంచి అలా వెళ్తే జరిమానాతో పాటు జైలు ఊచలు కూడా లెక్కపెట్టాల్సిందే. మెదక్‌జిల్లా మాసాయిపేట లెవెల్‌క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీకొని 18 మంది చిన్నారులు చనిపోయిన నేపథ్యంలో లెవెల్ క్రాసింగుల వద్ద రైల్వేశాఖ కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ముఖ్యంగా అధికసంఖ్యలో వాహనాలు ప్రయాణించే లెవెల్ క్రాసింగులపై ప్రత్యేక దృష్టి సారించింది. క్రాసింగ్స్ వద్ద రైల్వే పోలీసులను నియమించి ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సోమవారం నుంచి కేసులు నమోదు చేయనుంది. రైల్వే చట్టం ప్రకారం కేసులు: రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147 ప్రకారం ఈ కేసులు నమోదు చేస్తారు. దీని ప్రకారం గేటు వేసిన తర్వాత దాన్ని ఖాతరు చేయకుండా వెళ్లే వారికి 6 నెలల జైలు శిక్ష, రూ.1,000 జరిమానా విధించే అవకాశం ఉంటుంది. రైలు ప్రయాణికుల ప్రాణాలకు ఇబ్బంది తెచ్చేలా వ్యవహరించినందుకు సెక్షన్ 154 ప్రకారం జైలు శిక్షను ఏడాది వరకు పెంచే వెసులుబాటు కూడా ఉంది. ఈ రెండు సెక్షన్లను సోమవారం నుంచి ముఖ్య క్రాసింగుల వద్ద గట్టిగా అమలు చేయాలని దక్షిణ మధ్య రైల్వే ఆదేశాలిచ్చింది. -
మృత్యు ద్వారాల వైపు ఎందుకీ తొందర?!
-
నెలాఖరుకల్లా కాపలాదారులు
లెవల్ క్రాసింగ్‌ల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు సమీక్షించిన ద.మ.రైల్వే జీఎం శ్రీవాస్తవ హైదరాబాద్: ఎట్టకేలకు రైల్వే అధికారుల్లో కదలిక వచ్చింది. మాసాయిపేట దుర్ఘటనతో కళ్లు తెరిచారు. యుద్ధప్రాతిపదికన ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం రైల్ నిలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్ని రైల్వే విభాగాల ఉన్నతాధికారులతో లెవల్ క్రాసింగ్ పనులను సమీక్షించారు. ఇప్పటికే పనులు చేపట్టిన చోట జూలై 31వ తేదీ కల్లా గేట్లు ఏర్పాటు చేసి కాపలా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన మాసాయిపేట్ వద్ద వారంలోపే గేటు ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సబ్‌వేలు నిర్మించగా మిగిలిన 640 లెవల్ క్రాసింగ్లలో అవసరమైన చోట ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో కూడిన గేట్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, సబ్‌వేల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటిని దశలవారీగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన లెవల్‌క్రాసింగ్‌ల వద్ద వారం రోజుల్లోగా పూర్తి చేసి కాపలాతో కూడిన గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా పనులు ప్రారంభంకాని లెవల్ క్రాసింగ్‌ల వద్ద టెండర్లను ఆహ్వానించాలని కోరారు. మరోసారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. లెవల్ క్రాసింగ్‌ల వద్ద వాహనచోదకులు, పాదచారుల అవగాహన కోసం అన్ని రకాల సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని జీఎం పేర్కొన్నారు. -
స్పీడ్ బ్రేకర్ డిజైన్ మారిస్తే లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు తగ్గుతాయి
మెదక్ స్కూల్ బస్సు ప్రమాదం ఒక ఘోర విషాదం. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ ప్రమాదాన్ని తప్పించి ఉండవచ్చు అంటున్నారు రోడ్డు రవాణా నిపుణులు. ఇందుకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్ లో కొద్దిపాటి మార్పులు చేస్తే చాలా మటుకు ప్రమాదాలను నివారించవచ్చునంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్పులను చేశాయి. దాని వల్ల అక్కడ లెవెల్ క్రాసింగ్ ల వద్ద ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. మామూలుగా స్పీడ్ బ్రేకర్ కి లెవెల్ క్రాసింగ్ కి మధ్య పది మీటర్ల దూరం ఉంటుంది. రోడ్డుకు ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్లు 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. కానీ దీన్ని 45 డిగ్రీలుగా మార్చినట్టయితే, అంటే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉన్నట్టయితే లెవెల్ క్రాసింగ్ వద్ద వాహనాలు ఇంకాస్త ఎక్కువ స్లో చేయాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా పరిశోధకుల అధ్యయనం ప్రకారం స్పీడ్ బ్రేకర్ 90 డిగ్రీల కోణంలో ఉంటే స్పీడ్ బ్రేకర్ నుంచి రైల్వే క్రాసింగ్ కి చేరుకోవడానికి ఒక ట్రాక్టర్ కి సగటున 12 నిమిషాలు పడుతుంది. అదే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉంటే 16 సెకన్లు పడుతుంది. అంటే నాలుగు సెకన్లు లేదా 25 శాతం ఎక్కువ సమయం పడుతుంది. అదే కార్ అయితే గతంలో ఏడు సెకన్లు పడితే కొత్త స్పీడ్ బ్రేకర్ తో 11 సెకన్లు అంటే 5 సెకన్లు ఎక్కువగా పడుతుంది. మోటర్ సైకిల్స్ కి పాత డిజైన్ లో 6 సెకన్లు, కొత్త డిజైన్ లో 8 సెకన్లు పడుతుంది. ఈ అదనంగా మిగిలే క్షణాలు బ్రేక్ వేయడానికి, బ్రేక పడటానికి, ప్రాణాలుకాపాడటానికి పనికొస్తాయని అధ్యయనాల్లో తేలింది. దీన్ని అమలు చేయడం వల్ల రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రల్లో గస్తీ లేని లెవెల్ క్రాసింగ్ లలో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని తేలింది. ఈ చిన్న మార్పును రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సులువుగా చేయొచ్చు. మెదక్ బస్ ప్రమాదం నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాదాలను నిరోధించే దిశగా రాష్ట్రప్రభుత్వాల పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ చిన్న పనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవా? -
‘మృత్యు వాకిళ్లు’ మూతపడవా?
దాదాపు 160 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్గాలను ఎలాగూ నిర్మించలేకపోయాం. కాని ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రయాణికుల వ్యవస్థకు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత కూడా లేదా? పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతకు సరికొత్త ఉదాహరణను సూచించాలంటే మన రైల్వేలకేసి వేలెత్తి చూపాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలకు గుర్తింపు ఉంది. దాదాపు 16 లక్షల మందికి ఉపాధి కల్పి స్తున్న మేటి సంస్థ, పసిపిల్లల ప్రాణాలకూ భద్రత కల్పించే సమర్థతను కో ల్పోయిందంటే ఎవరిని ఎవరు వేలెత్తి చూపాలి? మెదక్ జిల్లాలో గురువారం ఉదయం లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం మన రైల్వే వ్యవస్థ నిర్వహణను ప్రశ్నార్థకం చేస్తోంది. చివరకు దుర్మరణాల పాలబడ్డాక నష్టపరి హారాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నంత నిర్వీర్యం మన వ్యవస్థలను ఆవహిస్తోందా అనిపిస్తోంది. లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు సంవత్సరం మరణాలు 2010-11 31 2011-12 115 2012-13 48 దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో 50 శాతం, కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్దే జరుగుతున్నాయి. రైల్వేల పనితీరు ప్రమాదకరంగా ఉందని కమిటీల మీద కమిటీలు నెత్తినోరు బాదుకుంటున్నా ప్రభుత్వాలు, రైల్వేశాఖ మేల్కోవడం లేదు. అందుకు నిలువెత్తు నిదర్శనమే మెదక్ జిల్లాలో జరిగిన ఘోరప్రమాదం. గురువారం ఉదయం మెదక్ జిల్లాలో మాసాయిపేట వద్ద 38 మంది స్కూలు పిల్లలతో వెళుతున్న బస్సు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ను దాటుతుండగా అదే సమయంలో అటుగా వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ రైలు మృత్యుశకటంలా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. మాటలకు అందని ఈ ఘోర ప్రమాదంలో 13 మంది చిన్నారులు అక్కడికక్కడే మరణించగా మరో 7మంది ఆసుపత్రిలో కన్నుమూశారు. అభం శుభం ఎరుగని పసిపిల్లలు పొంచుకుని ఉన్న ప్రమాదాన్ని చూసి హెచ్చరించినప్పటికీ తప్పించుకోలేక రైలుపాలబడిన బస్సులో నుజ్జునుజ్జయి పోయారు. కొన్ని కుటుంబాలు పిల్లలు లేని అనాధలైపోయాయి. ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణ మని బతికి బయటపడిన పసిపిల్లల మూగరోదన వెల్లడిస్తోంది. బిడ్డలే లేని లోకంలో మాకిక బతుకెందుకు? అనే కడుపుకోత తల్లిదండ్రులను నిలువునా దహించివేస్తున్న క్షణాల్లో ఈ పాపం ఎవరిది? పసిపిల్లలను బలిగొన్న ఈ దుర్ఘటనకు, ఘోరానికి ఎవరు ప్రధాన బాధ్యత వహించాలి? పసికందుల ఘోరమరణంతో శోకసముద్రంలో తల్లడిల్లుతున్న 30 పైగా కుటుంబాలను ఎవరు ఓదార్చగలరు? శాశ్వతంగా దూరమైన వారి బిడ్డలను ఎవరు తెచ్చి ఇవ్వగలరు? దాదాపు 160 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్గాలను ఎలాగూ నిర్మించలేకపోయాం. కానీ, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఒక్కమనిషిని నియమించటంలో చూపిస్తున్న నిర్లక్ష్యమే వందలాది కుటుం బాల కడుపుకోతకు కారణమవుతోంది. కానీ ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రయాణికుల వ్యవస్థకు ప్రాణాలు నిలపాల్సిన కనీస బాధ్యత కూడా లేదా? 1947 నాటికే 53 వేల కిలోమీటర్ల రైలు మార్గం, ఆపై కొత్తగా నిర్మించిన 11 వేల కిలోమీటర్లను కలుపుకుంటే మొత్తం 64 వేల కిలోమీటర్ల రైలు మార్గం మన సొంతం. దేశం మొత్తం మీద 33 వేల లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. మనుషులు, జంతువులు నేలమీద నడిచే చోటే ఏర్పడిన క్రాసింగ్‌లు ఇవి. వీటిలో 14 వేల లెవెల్ క్రాసింగ్‌లు మనిషి కాపలా లేకుండా కొనసాగుతు న్నాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో 10,797 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా దారులను నియమించాలని నిర్ణయించారు. వీటిలో 6,125 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాదారులను నియమించే ప్రక్రియ జరుగుతోందని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే ప్రకటనలు కార్యరూపం దాల్చకపోవడం వల్లే కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు, మరణ ఘటనలు కొనసాగుతు న్నాయి. ఆంగ్లేయుల కాలంలో 1860-1950 వరకు మొత్తం ఎనిమిది ప్రమాదాలు జరిగి, మొత్తం 208 మంది ప్రాణాలు కోల్పోగా, 1950-60 మధ్య 13 ప్రమాదాల్లో 651 మంది, 1960-70 మధ్య 14 ప్రమాదాల్లో 581 మంది దుర్మరణం చెందారు. 1981లో మరీ దారుణంగా 5 ప్రమాదాల్లో 823 మంది మరణించారు. 2008లో గౌతమి ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లలో మంటలు చెలరేగిన ఘటనలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది. 2011 నాటికి లెవెల్ క్రాసింగ్‌ల వద్ద 4675 ప్రమాదాలు జరిగాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంత ప్రాణనష్టం జరిగినా కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద, కాపలాదారులను నియమించడంలో రైల్వే శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పుడున్న మన రైల్వేట్రాక్‌ను ఆధునీకరించకుండా ఒక్క కొత్త రైలును కూడా ప్రకటించవద్దని అనిల్ కాకోద్కర్ సూచిస్తే, దాన్ని పెడచెవిని బెట్టి తాజా బడ్జెట్లో 55 కొత్త రైళ్లను ప్రకటించారు. పైగా హైస్పీడ్, బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రైల్వేల పనితీరును మెరుగుపర్చి, ప్రమాద రహితంగా రైలు ప్రయాణాలను మలిచేందుకు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించవలసి ఉంటుందని అనిల్ కాకోద్కర్ చేసిన సూచనలు ఇప్పటికే బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం లక్షా 50 వేల కోట్ల బడ్జెట్‌తో, 16 లక్షల మంది ఉద్యోగులతో, 64 వేల కిలోమీటర్ల రైలుమార్గంలో రైళ్లను నడుపుతున్న మన రైల్వే శాఖ, కాపలాలేని 14 వేల లెవెల్ క్రాసింగ్‌ల వద్ద 28 వేల మందిని కనీస వేతనాలతో నియమించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది? స్థానికసంస్థలకు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల నిర్వహణ బాధ్యతలను అప్పగించవచ్చు. కొంతకాలంపాటు వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా, ఆపై దశలవారీగా క్రమబద్ధీకరించవచ్చు. పి.పి.పి. విధానంలో అన్ని లెవెల్ క్రాసిం గ్ల వద్ద ఒకేసారి సిబ్బందిని నియమించవచ్చు. స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యమిస్తే ఎందరో కాపలాదారులుగా చేరేందుకు ముందుకొస్తారు. రైల్వేలకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా, కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్‌లు అన్నింటిలో తక్షణమే నియామకాలు జరుపవచ్చు. 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సున్న చిన్నారుల మృతితోనైనా మన రైల్వేలకు జ్ఞానోదయం కలగాలని ఆశిద్దాం. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద సత్వర నియామకాలే రైలు ప్రమాదాలకు పరిష్కారమార్గం. వి.దిలీప్ కుమార్, యం.రోజా లక్ష్మి -
లెవల్ క్రాసింగ్‌ల వద్ద భయం.. భయం
గుడ్లవల్లేరు మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న రైల్వే లెవల్ క్రాసింగులు ప్రమాదభరితంగా మారాయి. వీటి వద్ద రక్షణ చర్యలు లేకపోవడంతో ప్రజలు భయంభయంగా రాకపోకలు సాగిస్తున్నారు. మామిడికోళ్ల - కౌతవరం, గాదేపూడి, గుడ్లవల్లేరు బీరయ్య చెరువు డొంక రోడ్డు, నాగవరం, వడ్లమన్నాడు గ్రామాల్లో ఈ రైల్వేక్రాసింగ్‌ల వద్ద రైళ్లు ఢీకొని పశువులు చనిపోతున్నాయి. అధికారులు స్పందించి రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. - , గుడ్లవల్లేరు