ఇక ‘గేట్ మిత్ర’లే గతి
గేట్లు రావట.. కాపలా లేని క్రాసింగ్స్‌పై చేతులెత్తేసిన రైల్వే శాఖ
సాక్షి, హైదరాబాద్: గేట్ మిత్ర... ప్రస్తుతం రైల్వే తరచూ చెప్తున్న మాట. ఇది గొప్ప విజయంగా అభివర్ణించుకుంటోంది. కానీ ఇప్పుడు ఈ రూపంలో రైల్వే శాఖ చేస్తున్న నిర్లక్ష్యం భారీ మూల్యం చెల్లించుకునేందుకు పొంచి ఉంది. కాపలా లేని రైల్వే లెవల్ క్రాసింగ్స్ వద్ద తాత్కాలిక పద్ధతిలో నియమించిన సిబ్బంది పేరే గేట్ మిత్ర. గేటు ఏర్పాటు చేసి రెగ్యులర్ సిబ్బందిని కేటాయించేవరకు తాత్కాలిక పద్ధతిలోనే వీరిని కొనసాగిస్తామని పేర్కొన్న రైల్వే శాఖ... తాజాగా తాత్కాలిక సిబ్బందినే కొనసాగించాలని నిర్ణయించింది. ఫలితంగా గేటు లేని ఏ లెవల్ క్రాసింగ్ వద్ద ఏ ప్రమాదం ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రమాదకరంగా పొంచి ఉన్న లెవల్ క్రాసింగ్స్ వద్ద వెంటనే గేట్లు ఏర్పాటు చేయాలన్న దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలను రైల్వే శాఖ అటకెక్కించింది. దానిపై ఒత్తిడి చేసి కొత్త గేట్లు, సరిపడా పోస్టులను మంజూరు చేయించాల్సిన స్థానిక రైల్వే అధికారులు దాన్ని మాటవరసకు కూడా పట్టించుకోవటం లేదు.
కేవలం 35 చోట్లే చర్యలు: గత సంవత్సరం జూలైలో మెదక్ జిల్లా మాసాయిపేట లెవల్ క్రాసింగ్ వద్ద పాఠశాల బస్సును రైలు ఢీ కొన్న దుర్ఘటనలో 18 మంది చనిపోయారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారటంతో అన్ని లెవల్ క్రాసింగ్స్ వద్ద గేట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. దీంతో దక్షిణ మధ్య రైల్వే నుంచి 600 లెవల్ క్రాసింగ్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలు వెళ్లాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అతి కష్టంమీద కేవలం 35 చోట్ల మాత్రమే చర్యలు తీసుకున్నారు. మిగతా చోట్ల గేట్ మిత్ర పేరుతో తాత్కాలిక పద్ధతిలో నియమించిన సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు.
గ్యాంగ్‌మెన్‌గా ఉన్నవారే ఎక్కువగా ఈ బాధ్యత నిర్వహిస్తున్నారు. రైలు వచ్చే సమయంలో లెవల్ క్రాసింగ్ వద్దకు వచ్చే తాత్కాలిక సిబ్బంది ఆ సమయంలో వాహనదారులు పట్టాలు దాటకుండా కౌన్సెలింగ్ ఇవ్వటం వీరి విధి. ఏడాది దాటినా కొనసాగిస్తుండటంతో కొందరు రైలు వచ్చే సమయంలో జాడ లేకుండా పోతున్నారు. ఇది మళ్లీ భారీ ప్రమాదాలకు కారణమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.