నెలాఖరుకల్లా కాపలాదారులు
లెవల్ క్రాసింగ్‌ల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు
సమీక్షించిన ద.మ.రైల్వే జీఎం శ్రీవాస్తవ
హైదరాబాద్: ఎట్టకేలకు రైల్వే అధికారుల్లో కదలిక వచ్చింది. మాసాయిపేట దుర్ఘటనతో కళ్లు తెరిచారు. యుద్ధప్రాతిపదికన ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం రైల్ నిలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్ని రైల్వే విభాగాల ఉన్నతాధికారులతో లెవల్ క్రాసింగ్ పనులను సమీక్షించారు. ఇప్పటికే పనులు చేపట్టిన చోట జూలై 31వ తేదీ కల్లా గేట్లు ఏర్పాటు చేసి కాపలా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన మాసాయిపేట్ వద్ద వారంలోపే గేటు ఏర్పాటు చేయాలన్నారు.
దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సబ్‌వేలు నిర్మించగా మిగిలిన 640 లెవల్ క్రాసింగ్‌లలో అవసరమైన చోట ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో కూడిన గేట్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, సబ్‌వేల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటిని దశలవారీగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన లెవల్‌క్రాసింగ్‌ల వద్ద వారం రోజుల్లోగా పూర్తి చేసి కాపలాతో కూడిన గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా పనులు ప్రారంభంకాని లెవల్ క్రాసింగ్‌ల వద్ద టెండర్లను ఆహ్వానించాలని కోరారు. మరోసారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. లెవల్ క్రాసింగ్‌ల వద్ద వాహనచోదకులు, పాదచారుల అవగాహన కోసం అన్ని రకాల సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని జీఎం పేర్కొన్నారు.