ఒకే ట్రాక్‌పైకి ప్యాసింజర్ రైలు, ఇంజన్
ఆందోళనకు గురైన ప్రయాణికులు
హైదరాబాద్: మాసాయిపేటలో జరిగిన దుర్ఘటన మరవకముందే మరో ప్రమాదం తృటిలో తప్పింది. సోమవారం మధ్యాహ్నం అల్వాల్‌లో జరిగిన సంఘటన రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోధన్ నుండి సికింద్రాబాద్ మీదుగా మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ప్యాసింజర్ సోమవారం ఒంటిగంట ప్రాంతంలో అల్వాల్ రైల్వే స్టేషన్లో ఆగి బయలుదేరింది. ఎదురుగా అదే ట్రాక్‌పై ఓ రైలింజన్ రావడాన్ని గమనించిన ప్యాసింజర్ డ్రైవర్ ట్రెయిన్‌ను నిలిపివేశారు.
ఎదురుగా వస్తున్న ఇంజన్ డ్రైవర్‌ను కూడా అప్రమత్తం చేసి రెండూ దూరంగా నిలచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పాసింజర్ రైలులో ఉన్న వారిని కలవరపరచింది. కొందరు బోగీలనుండి దిగి పరుగులు తీశారు. ఈ విషయమై రైల్వే అధికారులు విచారణ జరపాలని ప్రయాణికులు కోరారు.