Masayipeta incident
-
ఒకే ట్రాక్‌పైకి ప్యాసింజర్ రైలు, ఇంజన్
ఆందోళనకు గురైన ప్రయాణికులు హైదరాబాద్: మాసాయిపేటలో జరిగిన దుర్ఘటన మరవకముందే మరో ప్రమాదం తృటిలో తప్పింది. సోమవారం మధ్యాహ్నం అల్వాల్‌లో జరిగిన సంఘటన రైలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోధన్ నుండి సికింద్రాబాద్ మీదుగా మహబూబ్‌నగర్‌కు వెళ్తున్న ప్యాసింజర్ సోమవారం ఒంటిగంట ప్రాంతంలో అల్వాల్ రైల్వే స్టేషన్లో ఆగి బయలుదేరింది. ఎదురుగా అదే ట్రాక్‌పై ఓ రైలింజన్ రావడాన్ని గమనించిన ప్యాసింజర్ డ్రైవర్ ట్రెయిన్‌ను నిలిపివేశారు. ఎదురుగా వస్తున్న ఇంజన్ డ్రైవర్‌ను కూడా అప్రమత్తం చేసి రెండూ దూరంగా నిలచేలా చర్యలు తీసుకున్నారు. దీంతో ప్రమాదం తప్పింది. ఈ సంఘటన పాసింజర్ రైలులో ఉన్న వారిని కలవరపరచింది. కొందరు బోగీలనుండి దిగి పరుగులు తీశారు. ఈ విషయమై రైల్వే అధికారులు విచారణ జరపాలని ప్రయాణికులు కోరారు. -
అంగడి సర్టిఫికెట్లతో అడ్డగోలు పదోన్నతులు!
హైదరాబాద్: ఇటీవల మెదక్‌జిల్లా మాసాయిపేట వద్ద జరిగిన ఘోర దుర్ఘటన నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పాఠశాల బస్సులను రవాణా శాఖ తనిఖీలు చేపట్టింది. కానీ ఆటోమొబైల్ రంగంపై అవగాహనలేని అధికారులు దర్జాగా వాటి ఫిట్నెస్ను తనిఖీ చేసేశారు. వారు నిజంగా అధికారులే.. గతంలో రవాణాశాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేసి ఆ తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్లు(ఏఎంవీఐ)గా పదోన్నతి పొందినవారు. వాహనాల ఫిట్నెస్ను సరిగ్గా అంచనా వేసే పరిజ్ఞానం లేకుండానే విధులు నిర్వహించేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఈ ఉదంతానికి నాలుగేళ్ల క్రితం బీజాలు పడ్డాయి. దీన్ని తెలంగాణ ప్రభుత్వం పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఈలోపే ఇదే తరహాలో మరికొందరు అడ్డగోలు పదోన్నతులు కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. అంతా ‘రాజస్థాన్’ సర్టిఫికెట్ల మాయ ప్రమోషన్లు పొందాలంటే పూర్తి అర్హతలుండాలి.. అర్హతలు కావాలంటే గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి అధికారికంగా సర్టిఫికెట్లు పొందాలి.. అది సాధ్యం కాదంటే దొడ్డిదారిలో తిమ్మినిబమ్మి చేయాలి. ఇప్పుడు రవాణాశాఖలో అదే జరుగుతోంది. ఈ శాఖలో ఏఎంవీఐల బాధ్యత కీలకమైంది. వాహనాల ఫిట్నెస్ వ్యవహారాన్ని వీరు పర్యవేక్షిస్తుంటారు. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ (ఉమ్మడి రాష్ట్రంలో) నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. అయితే రవాణాశాఖలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు పదోన్నతుల ద్వారా కూడా వీటిని భర్తీ చేయాలనే డిమాండ్ ఆధారంగా 2009లో నాటి ప్రభుత్వం అందుకు 20 శాతం (10 శాతం కానిస్టేబుళ్లకు, 10 శాతం జూనియర్ అసిస్టెంట్లకు)కోటాను కేటాయించింది. ఇక్కడే భారీ ఎత్తున మతలబు జరుగుతోంది. పదోన్నతి పొందే కానిస్టేబుళ్లు, జూనియర్ అసిస్టెంట్లు కచ్చితంగా రాష్ట్ర సాంకేతిక విద్యా మండలి గుర్తింపు పొందిన విద్యాసంస్థ నుంచి ఆటోమొటైల్ డిప్లొమా కోర్సు చేసుండాలి. దీంతో చాలామంది దొడ్డిదారి మార్గానికి తెరదీశారు. రాజాస్థాన్‌లోని ఓ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లను సంపాదించి వాటి ఆధారంగా పదోన్నతులకు దరఖాస్తు చేస్తున్నారు. ఈ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్లకు ఆ ‘అర్హత’ లేదంటూ గతంలో ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, ఏపీపీఎస్సీ, ఇగ్నో, రాష్ట్ర సాంకేతిక విద్యామండలిలు తేల్చిచెప్పాయి. దీంతో భారీ ‘లాబీయింగ్’తో 2010లో ఈ డీమ్డ్ యూనివర్సిటీ సర్టిఫికెట్ కూడా చెల్లుతుందంటూ ప్రభుత్వం నుంచి ఉత్తర్వు జారీ అయ్యేలా చక్రం తిప్పారు. ఈ వ్యవహారంలో రూ.కోట్లు చేతులు మారాయని విమర్శలు వినిపించాయి. హడావుడి పదోన్నతులకు రంగం సిద్ధం: తెలంగాణ ప్రభుత్వం అక్రమాలను తవ్వితీస్తున్న నేపథ్యంలో ఈ సర్టిఫికెట్ల బాగోతాన్ని కూడా పునఃసమీక్షించే అవకాశం ఉండటంతో ఈలోపే మరికొందరికి అడ్డగోలు పదోన్నతులు కల్పించి అందినంత దండుకునేందుకు రవాణాశాఖలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. -
నెలాఖరుకల్లా కాపలాదారులు
లెవల్ క్రాసింగ్‌ల వద్ద యుద్ధప్రాతిపదికన పనులు సమీక్షించిన ద.మ.రైల్వే జీఎం శ్రీవాస్తవ హైదరాబాద్: ఎట్టకేలకు రైల్వే అధికారుల్లో కదలిక వచ్చింది. మాసాయిపేట దుర్ఘటనతో కళ్లు తెరిచారు. యుద్ధప్రాతిపదికన ప్రమాద నివారణ చర్యలు చేపట్టారు. కాపలాలేని లెవల్ క్రాసింగ్‌ల వద్ద సిబ్బందిని వెంటనే ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం రైల్ నిలయంలో జరిగిన అత్యవసర సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ అన్ని రైల్వే విభాగాల ఉన్నతాధికారులతో లెవల్ క్రాసింగ్ పనులను సమీక్షించారు. ఇప్పటికే పనులు చేపట్టిన చోట జూలై 31వ తేదీ కల్లా గేట్లు ఏర్పాటు చేసి కాపలా సిబ్బందిని నియమించాలని ఆదేశించారు. ప్రమాదం జరిగిన మాసాయిపేట్ వద్ద వారంలోపే గేటు ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణమధ్య రైల్వే జోన్ పరిధిలో సబ్‌వేలు నిర్మించగా మిగిలిన 640 లెవల్ క్రాసింగ్లలో అవసరమైన చోట ఇంటర్‌లాకింగ్ వ్యవస్థతో కూడిన గేట్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, సబ్‌వేల నిర్మాణం చేపట్టాల్సి ఉందని, వీటిని దశలవారీగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఇప్పటికే పనులు ప్రారంభించిన లెవల్‌క్రాసింగ్‌ల వద్ద వారం రోజుల్లోగా పూర్తి చేసి కాపలాతో కూడిన గేట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇంకా పనులు ప్రారంభంకాని లెవల్ క్రాసింగ్‌ల వద్ద టెండర్లను ఆహ్వానించాలని కోరారు. మరోసారి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు పాటించాలని కోరారు. లెవల్ క్రాసింగ్‌ల వద్ద వాహనచోదకులు, పాదచారుల అవగాహన కోసం అన్ని రకాల సైన్ బోర్డులు ఏర్పాటు చేశామని జీఎం పేర్కొన్నారు. -
బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
రైల్వే పోలీసుల నిర్ధారణ హైదరాబాద్: మెదక్ జిల్లా మాసాయిపేటవద్ద గురువారం స్కూల్ బస్సును నాందేడ్ ప్యాసింజర్ రైలు ఢీకొన్న ఘటనకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా రైల్వే పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అలాగే ఆ బస్సుకు ఫిట్నెస్ ఉందా లేదా అనేది నిర్ధారించడానికి నిపుణులతో పరీక్షలు చేయించనున్నారు. ఈ ఘటనపై అన్నికోణాల నుంచి ై నిజామాబాద్ రెల్వే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని సికింద్రాబాద్ రైల్వే ఎస్పీ చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కాగా రైల్వేలెవెల్ క్రాసింగ్ వద్ద పట్టాలను దాటే సమయంలో తగిన జాగ్రత్తలను తీసుకోకుండా బస్సుడ్రైవర్ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన తెలిపారు. రైలు వస్తున్న సమయంలో డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతుండటాన్ని చూసినట్టు స్థానికులు చెప్పారని ఆయన తెలిపారు. కాగా ఈ దుర్ఘటనపై సర్కార్‌కు సమగ్ర నివేదిక ఇచ్చేందుకు రైల్వేపోలీసు విభాగం ఇన్చార్జి డీజీ కృష్ణప్రసాద్ శుక్రవారం అధికారులతో సమీక్షించారు.