మోహనరావు(ఫైల్)
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వేస్టేషన్ పరిధి చరణ్‌దాస్‌పురం లెవెల్ క్రాసింగ్‌కు సమీపంలో శుక్రవారం ఓ రైలు ఢీకొని ఆర్మీ జవాన్ పాలిన మోహనరావు(43) మృతి చెందారు. ఆయన ఆర్మీలో జేసీవో (జూనియర్ కమిషన్‌డ్ ఆఫీసర్) హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందటే సెలవుపై గ్రామానికి వచ్చారు. జీఆర్‌పీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని నందిగాం మండలం ప్రతాప విశ్వనాథపురం (షరాబు కొత్తూరు) గ్రామానికి చెందిన పాలిన ఎర్రయ్య, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు మోహనరావు ఆర్మీలో జేసీవో హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చారు.
గురువారం రాత్రి ఆయన భార్య అరుణకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పూండి బస్టాండ్ రోడ్డులో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లారు. రైలు పట్టాలు దాటుతుండగా డౌన్‌లైన్‌లో నౌపడ నుంచి పలాస వైపు వస్తున్న ఓ సూపర్ ఫాస్ట్ రైలు ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. విషయాన్ని పలాస జీఆర్‌పీ ఎస్‌ఐ ఎస్‌కే షరీఫ్ ధ్రువీకరించారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు కార్తీక్, యశ్వంత్ ఉన్నారు. మోహనరావు రెండు దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. మృతుని స్వగ్రామం షరాబు కొత్తూరులో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వచ్చిన నాయక్ సుబేదార్ సంజయ్ ప్రకాష్, హవల్దార్ భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment