GRP police
-
బాలల అక్రమ రవాణాకు చెక్
రైల్వేస్టేషన్(విజయవాడపశ్చిమ): బిహార్ రాష్ట్రం నుంచి విజయవాడ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు తరలిస్తున్న మైనర్ల అక్రమ రవాణాను విజయవాడ ఆర్పీఎఫ్ పోలీసులు అడ్డుకుని వారిని రక్షించారు. విజయవాడ డివిజన్ సీనియర్ డీఎస్సీ(డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్) వల్లేశ్వర బీటీ తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్ రాష్ట్రానికి చెందిన మైనర్ (బాలురు)లను ఎక్స్‌ప్రెస్ రైల్లో ముజఫర్‌పూర్ స్టేషన్ నుంచి బెంగళూరు, చెన్నైలకు తరలిస్తున్నట్లు ముందస్తు సమాచారం అందింది. దీనిపై జీఆర్పీ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, బచ్పన్ బచావో ఆందోళన్(బీబీఏ) సంస్థ, చైల్డ్‌లైన్ ప్రతినిధుల సహకారంతో మంగళవారం రాత్రి రైలు విజయవాడ చేరుకోగానే రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సుమారు 12 నుంచి 17 ఏళ్ల వయస్సు ఉన్న 18 మంది బాలలను గుర్తించి సంరక్షించారు. అనంతరం వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచి, వారి ఆదేశాల మేరకు తాత్కాలిక వసతి కోసం ఎస్కేసీవీ చిల్డన్స్ ట్రస్ట్ వసతి గృహానికి తరలించారు. బాలల వివరాలు సేకరించి వారి తల్లిదండ్రులకు సమాచారం అందించి తగిన ఆధారాలతో వన తల్లిదండ్రులకు వారిని అప్పగిస్తామని తెలిపారు. బాలల అక్రమ రవాణా చట్ట వ్యతిరేకమని, దీనికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆపరేషన్‌లో ఆర్ఫీఎఫ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్ఐ మకత్‌లాల్‌నాయక్, జీఆర్పీ ఎస్ఐ సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని ఆర్మీ జవాన్ దుర్మరణం
వజ్రపుకొత్తూరు: శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలంలోని పూండి రైల్వేస్టేషన్ పరిధి చరణ్‌దాస్‌పురం లెవెల్ క్రాసింగ్‌కు సమీపంలో శుక్రవారం ఓ రైలు ఢీకొని ఆర్మీ జవాన్ పాలిన మోహనరావు(43) మృతి చెందారు. ఆయన ఆర్మీలో జేసీవో (జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్) హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందటే సెలవుపై గ్రామానికి వచ్చారు. జీఆర్పీ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. జిల్లాలోని నందిగాం మండలం ప్రతాప విశ్వనాథపురం (షరాబు కొత్తూరు) గ్రామానికి చెందిన పాలిన ఎర్రయ్య, అన్నపూర్ణ దంపతుల రెండో కుమారుడు మోహనరావు ఆర్మీలో జేసీవో హోదాలో పనిచేస్తున్నారు. నెల రోజుల కిందట సెలవుపై ఇంటికి వచ్చారు. గురువారం రాత్రి ఆయన భార్య అరుణకు తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో పూండి బస్టాండ్ రోడ్డులో ఉన్న మెడికల్ షాపునకు వెళ్లారు. రైలు పట్టాలు దాటుతుండగా డౌన్‌లైన్‌లో నౌపడ నుంచి పలాస వైపు వస్తున్న ఓ సూపర్ ఫాస్ట్ రైలు ఆయనను ఢీకొనడంతో అక్కడికక్కడే చనిపోయారు. విషయాన్ని పలాస జీఆర్పీ ఎస్ఐ ఎస్కే షరీఫ్ ధ్రువీకరించారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు కుమారులు కార్తీక్, యశ్వంత్ ఉన్నారు. మోహనరావు రెండు దశాబ్దాలుగా భారత సైన్యంలో పనిచేస్తున్నారు. మృతుని స్వగ్రామం షరాబు కొత్తూరులో అంత్యక్రియలు నిర్వహించారు. విశాఖపట్నం నుంచి వచ్చిన నాయక్ సుబేదార్ సంజయ్ ప్రకాష్, హవల్దార్ భాస్కర్ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
రగ్బీ టీం కోసం దొంగయ్యాడు!
అడ్డగుట్ట: రైల్వే ప్రయాణికులను టార్గెట్ చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ తాత్కాలిక హోంగార్డును నిజామాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సికింద్రాబాద్‌లోని రైల్వే ఎస్పీ కార్యాలయంలో దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ అనురాధ మీడియాకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన మోహన్‌దేవ్‌రావు చావన్ (28) నాందేడ్ జిల్లాలో హోంగార్డుగా పని చేస్తున్నాడు. ఒక టీంను తయారు చేసి రగ్బీ ఆడిపించాలనే ఉద్దేశంతో పలువురికి ఉచితంగా కోచింగ్ ఇచ్చేవాడు. ఈ క్రమంలో గేమ్‌కు సంబంధించి బాల్స్, డ్రెస్‌లు, ఇతర మెటీరియల్స్‌కు డబ్బులు లేకపోవడంతో ఈజీ మనీకి అలవాటుపడ్డాడు. నాందేడ్ జిల్లాలోని చిక్కల తండాకు చెందిన ప్రదీప్‌తో కలసి చైన్ స్నాచింగ్‌లు ప్రారంభించాడు. ఒకే ట్రైన్లో 8 స్నాచింగ్‌లు 2019 నుంచి మోహన్‌దేవ్‌రావు, ప్రదీప్‌లు ఒకే ఏడాదిలో 8 చోరీలు చేశారు. బాసర రైల్వే స్టేషన్లో నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులోనే ఈ స్నాచింగ్‌లకు పాల్పడ్డారు. ఆభరణాలను ముంబైలో విక్రయించి సొమ్ము చేసుకున్నారు. మిగతా వాటిని విక్రయించేందుకు మోహన్ దేవ్‌రావు నిజామాబాద్ వచ్చాడు. దీనిపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు స్టేషన్లో అతన్ని పట్టుకున్నారు. విచారణ జరుపగా నేరాలను ఒప్పుకున్నాడు. నిందితుడి నుంచి 116 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.1.50 లక్షలు స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు ప్రదీప్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. -
రైళ్లలో ఇక ఆ ఇబ్బంది ఉండదు..!
న్యూఢిల్లీ : సరదాగా సాగిపోతున్న రైలు ప్రయాణంలో ఒక రకమైన బెరుకు, ఇలా చేస్తున్నారేంటి..? అనే భావనను కలిగించే ట్రాన్స్జెండర్లపై రైల్వే శాఖ చర్యలు చేపట్టింది. ప్రయాణికులను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్న హిజ్రాలపై కొరడా ఝళిపించింది. గత నాలుగేళ్ల కాలంలో దాదాపు 73 వేల మందిని అరెస్టు చేసింది. రైళ్లలో బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్న హిజ్రాలపై రైల్వే శాఖ చేపట్టిన చర్యలేంటో తెలపాలని దాఖలైన ఆర్టీఐ పిటిషన్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గత ఏడాది కాలంలోనే 20 వేల మంది ట్రాన్స్జెండర్లు అరెస్టు కాగా, ఈ జనవరిలోనే 1399 మందిని అరెస్టు చేసినట్టు రైల్వే శాఖ వెల్లడించింది. 2015 జనవరి నుంచి హిజ్రాల డబ్బు వసూళ్ల పై చర్యలు ముమ్మరం చేశామని తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రైల్వే భద్రతా దళం ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోందని తెలిపింది. ఇదిలాఉండగా.. రైల్వే శాఖ చర్యలతో నకిలీ ట్రాన్స్జెండర్ల ఆగడాలకు అడ్డుకట్ట పడిందని ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదైనా పనిచేసుకుని బతికే బదులు తమకు ప్రత్యేక హక్కులున్నట్టుగా వ్యవహరించే వారికి తగిన బుద్ధి చెప్పినట్టయిందని అంటున్నారు. యాచించడం బదులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడం, ఎదురు తిరిగితే అసభ్యంగా ప్రవర్తించడం నకిలీ హిజ్రాలకు అలవాటైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
బంగారు బిస్కెట్ల దోపిడీ ముఠా అరెస్టు
సాక్షి, ఒంగోలు క్రైం: రైలులో ప్రయాణిస్తున్న సేలంకు చెందిన బంగారు వ్యాపారిని బెదిరించి బంగారు బిస్కెట్లను దోచుకున్న ముఠాను అరెస్టు చేసినట్లు రైల్వే జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన షేక్ ఇమ్రాన్ ఫిబ్రవరి 18న చత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి బంగారం కొనుగోలు చేసి సేలంకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో వెళుతున్నాడు. ఇతని వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ విషయాన్ని సేలంకు చెందిన తన స్నేహితులు ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్ం సోక్రటీస్లకు చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి బంగారాన్ని దోచుకునేందుకు పథకం రచించారు. అందులో భాగంగా కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఇమ్రాన్‌ను విజయవాడ నుంచి అనుసరించారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు రాగానే ఈ ముగ్గురు ఇమ్రాన్ ఉన్న రిజర్వేషన్ బోగీలోకి వెళ్లారు. తాము తమిళనాడు పోలీసులమని చెప్పి, దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నావని సమాచారం వచ్చిందని అందుకే అరెస్టు చేస్తున్నామని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 913 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒంగోలు రైల్వే స్టేషన్రాగానే స్టేషన్లో దించి బయటకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధం చేసుకోని ఉన్న కారులో ఎక్కించుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి తీసుకెళ్లి చీకట్లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వెంటనే షేక్ ఇమ్రాన్ జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో సంబంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్, సోక్రటీస్, కారు డ్రైవర్ విజయకుమార్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 913 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నిందితులు ఉపయోగించిన కారు టీఎన్ 30డీఎన్ 6669ను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు. దర్యాప్తులోజిల్లా ఎస్సీ పూర్తి సహకారం కేసు దర్యాప్తులో ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు పూర్తిగా సహకరించారని జీఆర్పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. నిందితులు స్టేషన్లో దిగిన సమయం నుంచి సీసీ పుటేజ్‌ల ఆధారంగా, నగరంలోని సీసీ కెమేరాల పుటేజ్‌ల ఆధారంగానూ కేసు దర్యాప్తు కొనసాగింది. ఎస్పీ తన ఐటీ కోర్ సిబ్బందిచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్‌డేటాలను సేకరించి నిందితులను పట్టుకోవటంలో పూర్తిగా సహకరించారని అభినందించారు. అదే విధంగా ఒంగోలు జీఆర్పీ పోలీస్‌స్టేషన్ సిబ్బందిని గుంతకల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జీఆర్పీ నెల్లూరు డీఎస్పీ జి.ఆంజనేయులు, ఒంగోలు జీఆర్పీ సీఐ టి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై జి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎంజె.కిషోర్ బాబు, కానిస్టేబుళ్లు బి.శ్రీనివాసరావు, ఈపీఎస్ రెడ్డి, ఎస్కే బాషాతో పాటు పలువురు ఉన్నారు. -
అక్రమ బంగారం పట్టివేత
ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ హైదరాబాద్: అక్రమంగా 4.5 కేజీల బంగారు ఆభరణాలను తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్ జీఆర్పీ కార్యాలయంలో ఇన్చార్జ్ ఎస్పీ రాజేంద్ర ప్రసాద్ వివరాలను మీడియాకు వెల్లడించారు. గురువారం సాయంత్రం 6 గంటలకు అమృత్‌సర్‌కు చెందిన ఖన్నా రాజేశ్, జగ్మోహన్సింగ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. రాజేశ్, సింగ్ కదలికలపై అనుమానం వచ్చిన జీఆర్పీ పోలీసులు వారి బ్యాగులను తనిఖీ చేయగా సుమారు 4.532 కేజీల బంగారు ఆభరణాలు కనిపించాయి. బంగారానికి సంబంధించి వారి వద్ద ఎటువంటి బిల్లులు లభించకపోవటంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. -
వరంగల్‌లో భారీగా నగదు స్వాధీనం
మట్టెవాడ : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ వ్యక్తి నుంచి బుధవారం రూ.3.5 లక్షల విలువైన పాత నోట్లను జీఆర్పీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సదరు వ్యక్తి కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో సికింద్రాబాద్ నుంచి వరంగల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. డబ్బుకు సంబంధించి ఎలాంటి ఆధారాలు సమర్పించకపోవడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నగదు తీసుకొచ్చిన వ్యక్తి వరంగల్ జిల్లా కాశీబుగ్గకు చెందిన సంగా రవి(44)గా గుర్తించారు. -
ఐసీడీఎస్‌కు యువతి అప్పగింత
రైల్వేగేట్ : నగరంలోని వరంగల్ రైల్వేస్టేషన్ జీఆర్పీ పోలీసులు ముస్లిం యువతిని ఐసీడీఎస్‌కు అప్పగించారు. సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ జీఆర్పీ సీఐ స్వామి కథనం ప్రకారం.. వరంగల్ రైల్వేస్టేషన్లో సల్మాబేగం(25) అనే యువతి మంగళవారం ఏడుస్తుండగా ప్రయివేటు సానిటేషన్ వర్కర్ మహాలక్ష్మి జీఆర్పీ పోలీసులకు సమాచారమిచ్చింది. దీంతో పోలీసులు సల్మాబేగంను స్టేషన్‌కు తీసుకొచ్చారు. అక్కడ ఆమె వివరాలు అడగగా తమది వరంగల్ అని, తన తల్లిదండ్రులు తనను చిన్నప్పుడే జైపూర్‌కు తీసుకెళ్లారని తాను రైలులో ఇక్కడికి వచ్చినట్లు చెప్పింది. అలాగే కొన్ని విషయాల్లో పొంతనలేని సమాధానాలు చెప్పడంతోపాటు తనకు ఈ పోలీస్టేషన్లో ఉద్యోగం ఇప్పించాలని, ఉపాధి కావాలని అన్నట్లు పోలీసులు తెలిపారు. సల్మాబేగం మానసిక స్థితి బాగాలేకనే ఇలా మాట్లాడుతున్నట్లు గమనించి ఐసీడీఎస్ అర్బన్-2 సీడీపీఓ మధురిమకు యువతిని అప్పగించినట్లు సీఐ పేర్కొన్నారు. కార్యక్రమంలో హెడ్‌కానిస్టేబుల్ మురళి తదితరులున్నారు. -
28 కిలోల గంజాయి పట్టివేత
కాజీపేట రూరల్ : కాజీపేట జంక్ష¯ŒSలో శనివారం 28 కిలోల గంజాయిని జీఆర్పీ పోలీ సులు పట్టుకున్నారు. కాజీపేట జీఆర్పీ సీఐ మధుసూద¯ŒS కథనం ప్రకారం... అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన దొంతి రామాంజనేయులు అన్నవరంలో 28 కిలో ల గంజాయిని కొనుగోలు చేశాడు. ఆ గం జాయితో అనంతపురం నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లే ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అయి తే రైల్వే అధికారులు విజయవాడ రూట్ రిలే ఇంటర్ లాకింగ్ సిస్టం ఆధునీకరణ పనుల కారణంగా ఈ రైలును కాజీ పేట జంక్ష¯ŒS మీదుగా దారి మళ్లించారు. ఈ క్రమంలో కాజీపేట జంక్ష¯ŒSకు చేరుకున్న రైలు నుంచి గంజాయి బ్యాగుతో అతడు దిగాడు. పక్కన బ్యాగు పెట్టి ప్లాట్‌ఫాంపై నిల్చొని అటుఇటు దిక్కులు చూస్తుండగా పెట్రోలింగ్ చేస్తున్న పోలీస్ సిబ్బందికి అనుమానం వచ్చి తనిఖీ చేయగా గంజాయి తరలింపును ఒప్పుకున్నాడు. రూ.42,000 విలువైన గంజాయి బ్యాగును స్వాధీనం చేసుకొని రామాంజనేయులును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని బాలుడు
సికింద్రాబాద్: గుర్తు తెలియని ఆరేళ్ల బాలుడు రైల్వేస్టేషన్లో తిరుగుతుండగా జీఆర్పీ పోలీసులు నగరంలోని శిశువిహార్‌కు తరలించారు. మంగళవారం ఓ బాలుడు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా దివ్యదిశ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు అతడి నుంచి వివరాలు తెలుసుకొనేందుకు యత్నించారు. తన పేరు బాలు అని చెప్పడం మినహా ఆ బాలుడు మిగతా వివరాలు చెప్పలేకపోయాడు. దీంతో అతడిని జీఆర్పీ పోలీసులకు అప్పగించగా వారు శిశువిహారకు తరలించి ఆశ్రయం కల్పించారు. తల్లిదండ్రులే కావాలని బాలుడ్ని వదిలి వెళ్లారా? లేక తప్పిపోయి వచ్చాడా అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
హంపి ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ దొంగల బీభత్సం
-
హంపి ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ దొంగల బీభత్సం
గుంతకల్లు: హుబ్లీ నుంచి బెంగళూరు వెళుతున్న హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు మరోసారి బీభత్సం సృష్టించారు. ప్రయాణికుల నుంచి బంగారు ఆభరణాలు దోచుకు వెళ్లారు. గౌరి బిదనూరు వద్ద దొంగలు రైలులోకి ప్రవేశించి ముగ్గురు మహిళల మెడల్లో ఉన్న నగలను తెంపుకుని పరారయ్యారు. వారం రోజుల్లో హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు పడటం ఇది రెండోసారి. కాగా ఈ నెల 5వ తేదీన గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు-గార్లదిన్నె మార్గం మధ్యలో హంపి ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీకి విఫలయత్నం చేశారు. భద్రతా సిబ్బంది అప్రమత్తమై గాల్లోకి కాల్పులు జరపడంతో దొంగలు పారిపోయారు. కాగా వరుసగా హంపీ ఎక్స్‌ప్రెస్‌లో దొంగలు దోపిడీకి పాల్పడుతుండటంతో ప్రయాణికులు బెంబేలు ఎత్తుతున్నారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైవేల్లో దొంగతనాలకు పాల్పడే 20 నుంచి 30 మంది సభ్యులున్న అంతర్ రాష్ర్ట ముఠా పని అయి ఉండొచ్చని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.