నిందితుని వివరాలు వెల్లడిస్తున్న రైల్వే జీఆర్‌పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు
సాక్షి, ఒంగోలు క్రైం: రైలులో ప్రయాణిస్తున్న సేలంకు చెందిన బంగారు వ్యాపారిని బెదిరించి బంగారు బిస్కెట్లను దోచుకున్న ముఠాను అరెస్టు చేసినట్లు రైల్వే జీఆర్‌పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. స్థానిక ఒంగోలు రైల్వే స్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన షేక్ ఇమ్రాన్ ఫిబ్రవరి 18న చత్తీస్‌ఘడ్ రాష్ట్రం రాయపూర్ నుంచి బంగారం కొనుగోలు చేసి సేలంకు కోర్బా ఎక్స్‌ప్రెస్ రైలులో వెళుతున్నాడు.
ఇతని వద్ద గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసిన విజయ్‌కుమార్ విషయాన్ని సేలంకు చెందిన తన స్నేహితులు ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్‌ం సోక్రటీస్‌లకు చెప్పారు. వీరంతా ముఠాగా ఏర్పడి బంగారాన్ని దోచుకునేందుకు పథకం రచించారు. అందులో భాగంగా కోర్బా ఎక్స్‌ప్రెస్‌లో రైలులో ఇమ్రాన్‌ను విజయవాడ నుంచి అనుసరించారు. రైలు ఒంగోలు రైల్వేస్టేషన్‌కు రాగానే ఈ ముగ్గురు ఇమ్రాన్ ఉన్న రిజర్వేషన్ బోగీలోకి వెళ్లారు.
తాము తమిళనాడు పోలీసులమని చెప్పి, దొంగ బంగారం వ్యాపారం చేస్తున్నావని సమాచారం వచ్చిందని అందుకే అరెస్టు చేస్తున్నామని అదుపులోకి తీసుకుని అతని వద్ద ఉన్న 913 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఒంగోలు రైల్వే స్టేషన్‌రాగానే స్టేషన్‌లో దించి బయటకు తీసుకెళ్లారు. అప్పటికే సిద్ధం చేసుకోని ఉన్న కారులో ఎక్కించుకొని ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ సమీపానికి తీసుకెళ్లి చీకట్లో వదిలేసి వెళ్లిపోయారు. దీంతో వెంటనే షేక్ ఇమ్రాన్ జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి ఒంగోలు జీఆర్‌పీ సీఐ టి.శ్రీనివాసరావు దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో సంబంధంలో ఉన్న తమిళనాడు రాష్ట్రం సేలంకు చెందిన ఆనంద్ ప్రకాష్, వివేక్ జైన్, సోక్రటీస్, కారు డ్రైవర్ విజయకుమార్‌లను అరెస్టు చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.29 లక్షల విలువైన 913 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నిందితులు ఉపయోగించిన కారు టీఎన్ 30డీఎన్ 6669ను కూడా స్వాధీనం చేసుకున్నామని వివరించారు.
దర్యాప్తులోజిల్లా ఎస్సీ పూర్తి సహకారం
కేసు దర్యాప్తులో ప్రకాశం జిల్లా ఎస్పీ బి.సత్య ఏసుబాబు పూర్తిగా సహకరించారని జీఆర్‌పీ గుంతకల్ ఎస్పీ ఎం.సుబ్బారావు పేర్కొన్నారు. నిందితులు స్టేషన్‌లో దిగిన సమయం నుంచి సీసీ పుటేజ్‌ల ఆధారంగా, నగరంలోని సీసీ కెమేరాల పుటేజ్‌ల ఆధారంగానూ కేసు దర్యాప్తు కొనసాగింది. ఎస్పీ తన ఐటీ కోర్ సిబ్బందిచేత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కాల్‌డేటాలను సేకరించి నిందితులను పట్టుకోవటంలో పూర్తిగా సహకరించారని అభినందించారు.
అదే విధంగా ఒంగోలు జీఆర్పీ పోలీస్‌స్టేషన్ సిబ్బందిని గుంతకల్ ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జీఆర్‌పీ నెల్లూరు డీఎస్పీ జి.ఆంజనేయులు, ఒంగోలు జీఆర్‌పీ సీఐ టి.శ్రీనివాసరావు, చీరాల ఎస్సై జి.రామిరెడ్డి, హెడ్ కానిస్టేబుల్ ఎంజె.కిషోర్ బాబు, కానిస్టేబుళ్లు బి.శ్రీనివాసరావు, ఈపీఎస్ రెడ్డి, ఎస్‌కే బాషాతో పాటు పలువురు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment