స్పీడ్ బ్రేకర్ డిజైన్ మారిస్తే లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు తగ్గుతాయి
Published Fri, Jul 25 2014 3:14 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM
మెదక్ స్కూల్ బస్సు ప్రమాదం ఒక ఘోర విషాదం. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ ప్రమాదాన్ని తప్పించి ఉండవచ్చు అంటున్నారు రోడ్డు రవాణా నిపుణులు. ఇందుకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్ లో కొద్దిపాటి మార్పులు చేస్తే చాలా మటుకు ప్రమాదాలను నివారించవచ్చునంటున్నారు.
కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్పులను చేశాయి. దాని వల్ల అక్కడ లెవెల్ క్రాసింగ్ ల వద్ద ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. మామూలుగా స్పీడ్ బ్రేకర్ కి లెవెల్ క్రాసింగ్ కి మధ్య పది మీటర్ల దూరం ఉంటుంది. రోడ్డుకు ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్లు 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. కానీ దీన్ని 45 డిగ్రీలుగా మార్చినట్టయితే, అంటే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉన్నట్టయితే లెవెల్ క్రాసింగ్ వద్ద వాహనాలు ఇంకాస్త ఎక్కువ స్లో చేయాల్సి ఉంటుంది.
రోడ్డు రవాణా పరిశోధకుల అధ్యయనం ప్రకారం స్పీడ్ బ్రేకర్ 90 డిగ్రీల కోణంలో ఉంటే స్పీడ్ బ్రేకర్ నుంచి రైల్వే క్రాసింగ్ కి చేరుకోవడానికి ఒక ట్రాక్టర్ కి సగటున 12 నిమిషాలు పడుతుంది. అదే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉంటే 16 సెకన్లు పడుతుంది. అంటే నాలుగు సెకన్లు లేదా 25 శాతం ఎక్కువ సమయం పడుతుంది. అదే కార్ అయితే గతంలో ఏడు సెకన్లు పడితే కొత్త స్పీడ్ బ్రేకర్ తో 11 సెకన్లు అంటే 5 సెకన్లు ఎక్కువగా పడుతుంది. మోటర్ సైకిల్స్ కి పాత డిజైన్ లో 6 సెకన్లు, కొత్త డిజైన్ లో 8 సెకన్లు పడుతుంది. ఈ అదనంగా మిగిలే క్షణాలు బ్రేక్ వేయడానికి, బ్రేక పడటానికి, ప్రాణాలుకాపాడటానికి పనికొస్తాయని అధ్యయనాల్లో తేలింది. దీన్ని అమలు చేయడం వల్ల రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రల్లో గస్తీ లేని లెవెల్ క్రాసింగ్ లలో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని తేలింది.
ఈ చిన్న మార్పును రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సులువుగా చేయొచ్చు. మెదక్ బస్ ప్రమాదం నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాదాలను నిరోధించే దిశగా రాష్ట్రప్రభుత్వాల పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ చిన్న పనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవా?
Advertisement
Advertisement