speed braker
-
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. కచ్చితంగా పాటించాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను తగ్గించే క్రమంలో రోడ్లపై వాహనాల వేగంపై ప్రభుత్వం పరిమితి విధించింది. దీనికి సంబంధించి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వేగ పరిమితిని ఖరారు చేస్తూ ఉత్తర్వు జారీ చేసింది. కార్లు– ఇతర వాహనాలను (సరుకు రవాణా వాహనాలు, బస్సులు, మూడు చక్రాల వాహనాలు, ద్విచక్రవాహనాలు) రెండు కేటగిరీలుగా విభజించి వేరువేరు వేగ పరిమితులను ఖరారు చేసింది. ► డివైడర్లతో ఉన్న రోడ్లు, డివైడర్లు లేని రోడ్లు, కాలనీ రోడ్లు.. ఇలా మూడు వేర్వేరు రోడ్లకు వేర్వేరు గరిష్ట వేగాలను ఇందులో పేర్కొనటం విశేషం. ► ఇటీవల రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగి మరణాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తోంది. ► రోడ్డు డివైడర్ ఉన్న రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 60 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 50 కి.మీ.గా నిర్ధారించారు. ► డివైడర్ లేని రోడ్లపై కార్ల గరిష్ట వేగం గంటకు 50 కి.మీ.గా, ఇతర వాహనాల వేగం 40 కి.మీ.గా, కాలనీ రోడ్లపై కార్లు, ఇతర వాహనాల గరిష్ట వేగం 30 కి.మీ.గా ఖరారు చేసింది. నాలుగున్నరేళ్ల తర్వాత.. ఆధునిక వాహనాలు అందుబాటులోకి రావటంతో రోడ్లపై వాటి వేగం పెరిగి ప్రమాదాలు చోటుచేసుకోవటం ద్వారా విలువైన ప్రాణాలు గాలిలో కలుస్తున్న తీరును 2017లో హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రోడ్లు, నగర, పట్టణ రోడ్లపై వాహనాల గరిష్ట వేగంపై పరిమితి విధించాలని ఆయన అందులో ప్రభుత్వాన్ని కోరారు. దీన్ని పరిశీలించిన ప్రభుత్వం ఆయా రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించేందుకు ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈమేరకు 2017 నవంబరు 17న ఉత్తర్వు జారీ చేసింది. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రోడ్లు, పురపాలక సంఘాల రోడ్లపై వేగ పరిమితిని నిర్ధారించే బాధ్యతను ఆయా విభాగాల ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లకు అప్పగించింది. జీహెచ్ఎంసీ పరిధిలో ఆ సంస్థ ఎస్ఈకి అప్పగించింది. దీనికి సంబంధించి ఆయా అధికారులు కసరత్తులు పూర్తి చేసి ఎక్కడికక్కడ నివేదికలు సమర్పించారు. ఇంతకాలానికి జీహెచ్ఎంసీ పరిధిలో అధికారుల సిఫారసు ఆధారంగా వేగ పరిమితిని ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఇక జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలక రోడ్లకు సంబంధించి అధికారుల సిఫారసుల ఆధారంగా పరిమితులు అమలులోకి వస్తాయని రోడ్లు భవనాల శాఖ ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు. (క్లిక్: అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. అరుదైన ఘనతలు) మరింత స్పష్టత కావాలి.. ఈ వేగాలకు సంబంధించి మరింత స్పష్టత అవసరమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. డివైడర్ ఉన్న రోడ్లపై గరిష్ట వేగాన్ని కార్లకు 60గా నిర్ధారించినా, ఆసుపత్రులు, పాఠశాలలు, ప్రార్థనా సంస్థలు, మార్కెట్ల చేరువలో అది సాధ్యం కాదని, అలాంటి వాటిపై మరింత స్పష్టత ఉండాలని సామాజిక కార్యకర్తలు సూచిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, గ్రామీణ, పురపాలిక రోడ్లకు సంబంధించి, ఆయా ప్రాంతాల పరిస్థితుల ఆధారంగా ప్రతి రోడ్టుపై వేగ పరిమితిని ప్రకటించాలని వారు కోరుతున్నారు. (క్లిక్: ఏఐతో ‘రాస్తే’ సేఫ్.. పనిచేస్తుందిలా!) -
ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్
జి.కొండూరు (మైలవరం) : వాహనాల వేగాన్ని నియంత్రించి రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు ఏర్పాటు చేసిన స్పీడ్ బ్రేకరే ఓ మహిళ పాలిట యమపాశమైంది. జి.కొండూరు సమీపంలో శనివారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ రాజేష్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మృతి చెందిన వియ్యంకురాలి దహన సంస్కారాలకు హాజరయ్యేందుకు విసన్నపేట గ్రామానికి చెందిన పెండెం భావనారాయణ, తన భార్య సత్యవతితో కలిసి శుక్రవారం నందిగామ మండలం చందర్లపాడు గ్రామానికి వెళ్లారు. కార్యక్రమం అనంతరం స్వగ్రామానికి రాత్రి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. జి.కొండూరు సమీపంలోకి రాగానే చీకట్లో అక్కడ ఉన్న స్పీడ్ బ్రేకర్ కనిపించలేదు. దీంతో వేగంగా వస్తున్న బైక్ వెనుక కూర్చున్న సత్యవతి (56) ఎగిరి కిందపడింది. ఆమె తలకు బలమైన గాయమై ఘటనా స్థలంలోనే మృతి చెందింది. సమాచారం అందుకున్న జి.కొండూరు పోలీసులు వచ్చి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మైలవరం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. -
స్పీడ్ బ్రేకర్ డిజైన్ మారిస్తే లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు తగ్గుతాయి
మెదక్ స్కూల్ బస్సు ప్రమాదం ఒక ఘోర విషాదం. కానీ కొద్దిపాటి జాగ్రత్తలతో ఈ ప్రమాదాన్ని తప్పించి ఉండవచ్చు అంటున్నారు రోడ్డు రవాణా నిపుణులు. ఇందుకు రోడ్లపై స్పీడ్ బ్రేకర్ లో కొద్దిపాటి మార్పులు చేస్తే చాలా మటుకు ప్రమాదాలను నివారించవచ్చునంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వాలు ఈ మార్పులను చేశాయి. దాని వల్ల అక్కడ లెవెల్ క్రాసింగ్ ల వద్ద ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. మామూలుగా స్పీడ్ బ్రేకర్ కి లెవెల్ క్రాసింగ్ కి మధ్య పది మీటర్ల దూరం ఉంటుంది. రోడ్డుకు ఇప్పుడున్న స్పీడ్ బ్రేకర్లు 90 డిగ్రీల కోణంలో ఉంటాయి. కానీ దీన్ని 45 డిగ్రీలుగా మార్చినట్టయితే, అంటే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉన్నట్టయితే లెవెల్ క్రాసింగ్ వద్ద వాహనాలు ఇంకాస్త ఎక్కువ స్లో చేయాల్సి ఉంటుంది. రోడ్డు రవాణా పరిశోధకుల అధ్యయనం ప్రకారం స్పీడ్ బ్రేకర్ 90 డిగ్రీల కోణంలో ఉంటే స్పీడ్ బ్రేకర్ నుంచి రైల్వే క్రాసింగ్ కి చేరుకోవడానికి ఒక ట్రాక్టర్ కి సగటున 12 నిమిషాలు పడుతుంది. అదే స్పీడ్ బ్రేకర్ వంకరగా ఉంటే 16 సెకన్లు పడుతుంది. అంటే నాలుగు సెకన్లు లేదా 25 శాతం ఎక్కువ సమయం పడుతుంది. అదే కార్ అయితే గతంలో ఏడు సెకన్లు పడితే కొత్త స్పీడ్ బ్రేకర్ తో 11 సెకన్లు అంటే 5 సెకన్లు ఎక్కువగా పడుతుంది. మోటర్ సైకిల్స్ కి పాత డిజైన్ లో 6 సెకన్లు, కొత్త డిజైన్ లో 8 సెకన్లు పడుతుంది. ఈ అదనంగా మిగిలే క్షణాలు బ్రేక్ వేయడానికి, బ్రేక పడటానికి, ప్రాణాలుకాపాడటానికి పనికొస్తాయని అధ్యయనాల్లో తేలింది. దీన్ని అమలు చేయడం వల్ల రాజస్థాన్, కర్నాటక, మహారాష్ట్రల్లో గస్తీ లేని లెవెల్ క్రాసింగ్ లలో ప్రమాదాలు చాలా వరకు తగ్గాయని తేలింది. ఈ చిన్న మార్పును రాష్ట్ర ప్రభుత్వాలు చాలా సులువుగా చేయొచ్చు. మెదక్ బస్ ప్రమాదం నేపథ్యంలో వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రమాదాలను నిరోధించే దిశగా రాష్ట్రప్రభుత్వాల పాత్ర గురించి ప్రస్తావించారు. ఈ చిన్న పనిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేవా?