‘మృత్యు వాకిళ్లు’ మూతపడవా? | Train rams school bus in Telangana; 20 children dead | Sakshi
Sakshi News home page

‘మృత్యు వాకిళ్లు’ మూతపడవా?

Published Fri, Jul 25 2014 12:30 AM | Last Updated on Sat, Sep 2 2017 10:49 AM

‘మృత్యు వాకిళ్లు’ మూతపడవా?

‘మృత్యు వాకిళ్లు’ మూతపడవా?

దాదాపు 160 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్గాలను ఎలాగూ నిర్మించలేకపోయాం. కాని ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రయాణికుల వ్యవస్థకు ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాల్సిన కనీస బాధ్యత కూడా లేదా?
 
పేరు గొప్ప ఊరు దిబ్బ సామెతకు సరికొత్త ఉదాహరణను సూచించాలంటే మన రైల్వేలకేసి వేలెత్తి చూపాలి. ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వేలకు గుర్తింపు ఉంది. దాదాపు 16 లక్షల మందికి ఉపాధి కల్పి స్తున్న మేటి సంస్థ, పసిపిల్లల ప్రాణాలకూ భద్రత కల్పించే సమర్థతను కో ల్పోయిందంటే ఎవరిని ఎవరు వేలెత్తి చూపాలి? మెదక్ జిల్లాలో గురువారం ఉదయం లెవెల్ క్రాసింగ్ వద్ద జరిగిన ఘోర ప్రమాదం మన రైల్వే వ్యవస్థ నిర్వహణను ప్రశ్నార్థకం చేస్తోంది. చివరకు దుర్మరణాల పాలబడ్డాక నష్టపరి హారాలు చెల్లించి చేతులు దులుపుకుంటున్నంత నిర్వీర్యం మన వ్యవస్థలను ఆవహిస్తోందా అనిపిస్తోంది.
 
 లెవెల్ క్రాసింగ్ ప్రమాదాలు
 సంవత్సరం    మరణాలు
 2010-11    31
 2011-12    115
 2012-13    48
 
దేశంలో జరుగుతున్న రైలు ప్రమాదాల్లో 50 శాతం, కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్దే జరుగుతున్నాయి. రైల్వేల పనితీరు ప్రమాదకరంగా ఉందని కమిటీల మీద కమిటీలు నెత్తినోరు బాదుకుంటున్నా ప్రభుత్వాలు, రైల్వేశాఖ మేల్కోవడం లేదు. అందుకు నిలువెత్తు నిదర్శనమే మెదక్ జిల్లాలో జరిగిన ఘోరప్రమాదం.

గురువారం ఉదయం మెదక్ జిల్లాలో మాసాయిపేట వద్ద 38 మంది స్కూలు పిల్లలతో వెళుతున్న బస్సు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ను దాటుతుండగా అదే సమయంలో అటుగా వచ్చిన నాందేడ్ ప్యాసింజర్ రైలు మృత్యుశకటంలా దూసుకొచ్చి బస్సును ఢీకొట్టింది. మాటలకు అందని ఈ ఘోర ప్రమాదంలో 13 మంది చిన్నారులు అక్కడికక్కడే మరణించగా మరో 7మంది ఆసుపత్రిలో కన్నుమూశారు. అభం శుభం ఎరుగని పసిపిల్లలు పొంచుకుని ఉన్న ప్రమాదాన్ని చూసి హెచ్చరించినప్పటికీ తప్పించుకోలేక రైలుపాలబడిన బస్సులో నుజ్జునుజ్జయి పోయారు. కొన్ని కుటుంబాలు పిల్లలు లేని అనాధలైపోయాయి.
 
ప్రాథమిక సమాచారం ప్రకారం బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే దీనికి కారణ మని బతికి బయటపడిన పసిపిల్లల మూగరోదన వెల్లడిస్తోంది. బిడ్డలే లేని లోకంలో మాకిక బతుకెందుకు? అనే కడుపుకోత తల్లిదండ్రులను నిలువునా దహించివేస్తున్న క్షణాల్లో ఈ పాపం ఎవరిది? పసిపిల్లలను బలిగొన్న ఈ దుర్ఘటనకు, ఘోరానికి ఎవరు ప్రధాన బాధ్యత వహించాలి? పసికందుల ఘోరమరణంతో శోకసముద్రంలో తల్లడిల్లుతున్న 30 పైగా కుటుంబాలను ఎవరు ఓదార్చగలరు? శాశ్వతంగా దూరమైన వారి బిడ్డలను ఎవరు తెచ్చి ఇవ్వగలరు?
 
 దాదాపు 160 సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ రైల్వే వ్యవస్థలో కొత్త మార్గాలను ఎలాగూ నిర్మించలేకపోయాం. కానీ, లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ఒక్కమనిషిని నియమించటంలో చూపిస్తున్న నిర్లక్ష్యమే వందలాది కుటుం బాల కడుపుకోతకు కారణమవుతోంది. కానీ ప్రపంచంలోనే అతిపెద్దదైన ప్రయాణికుల వ్యవస్థకు ప్రాణాలు నిలపాల్సిన కనీస బాధ్యత కూడా లేదా?
 
1947 నాటికే 53 వేల కిలోమీటర్ల రైలు మార్గం, ఆపై కొత్తగా నిర్మించిన 11 వేల కిలోమీటర్లను కలుపుకుంటే మొత్తం 64 వేల కిలోమీటర్ల రైలు మార్గం మన సొంతం. దేశం మొత్తం మీద 33 వేల లెవెల్ క్రాసింగ్‌లు ఉన్నాయి. మనుషులు, జంతువులు నేలమీద నడిచే చోటే ఏర్పడిన క్రాసింగ్‌లు ఇవి. వీటిలో 14 వేల లెవెల్ క్రాసింగ్‌లు మనిషి కాపలా లేకుండా కొనసాగుతు న్నాయి. 12వ పంచవర్ష ప్రణాళికలో 10,797 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలా దారులను నియమించాలని నిర్ణయించారు.
 
వీటిలో 6,125 లెవెల్ క్రాసింగ్‌ల వద్ద కాపలాదారులను నియమించే ప్రక్రియ జరుగుతోందని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే ప్రకటనలు కార్యరూపం దాల్చకపోవడం వల్లే కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలు, మరణ ఘటనలు కొనసాగుతు న్నాయి. ఆంగ్లేయుల కాలంలో 1860-1950 వరకు మొత్తం ఎనిమిది ప్రమాదాలు జరిగి, మొత్తం 208 మంది ప్రాణాలు కోల్పోగా, 1950-60 మధ్య 13 ప్రమాదాల్లో 651 మంది, 1960-70 మధ్య 14 ప్రమాదాల్లో 581 మంది దుర్మరణం చెందారు. 1981లో మరీ దారుణంగా 5 ప్రమాదాల్లో 823 మంది మరణించారు. 2008లో గౌతమి ఎక్స్‌ప్రెస్, తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లలో మంటలు చెలరేగిన ఘటనలో భారీ స్థాయిలో ప్రాణ నష్టం జరిగింది.
 
2011 నాటికి లెవెల్ క్రాసింగ్‌ల వద్ద 4675 ప్రమాదాలు జరిగాయి. ఎన్ని ప్రమాదాలు జరిగినా, ఎంత ప్రాణనష్టం జరిగినా కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల వద్ద, కాపలాదారులను నియమించడంలో రైల్వే శాఖ పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోంది. ఇప్పుడున్న మన రైల్వేట్రాక్‌ను ఆధునీకరించకుండా ఒక్క కొత్త రైలును కూడా ప్రకటించవద్దని అనిల్ కాకోద్కర్ సూచిస్తే, దాన్ని పెడచెవిని బెట్టి తాజా బడ్జెట్‌లో 55 కొత్త రైళ్లను ప్రకటించారు.
 
పైగా హైస్పీడ్, బుల్లెట్ రైళ్లను ప్రవేశపెడతామని పేర్కొన్నారు. రైల్వేల పనితీరును మెరుగుపర్చి, ప్రమాద రహితంగా రైలు ప్రయాణాలను మలిచేందుకు లక్ష కోట్ల రూపాయలు వెచ్చించవలసి ఉంటుందని అనిల్ కాకోద్కర్ చేసిన సూచనలు ఇప్పటికే బుట్టదాఖలయ్యాయి. ప్రస్తుతం లక్షా 50 వేల కోట్ల బడ్జెట్‌తో, 16 లక్షల మంది ఉద్యోగులతో, 64 వేల కిలోమీటర్ల రైలుమార్గంలో రైళ్లను నడుపుతున్న మన రైల్వే శాఖ, కాపలాలేని 14 వేల లెవెల్ క్రాసింగ్‌ల వద్ద 28 వేల మందిని కనీస వేతనాలతో నియమించడంలో ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోంది?
 
స్థానికసంస్థలకు కాపలా లేని లెవెల్ క్రాసింగ్‌ల నిర్వహణ బాధ్యతలను అప్పగించవచ్చు. కొంతకాలంపాటు వారిని కాంట్రాక్ట్ కార్మికులుగా, ఆపై దశలవారీగా క్రమబద్ధీకరించవచ్చు. పి.పి.పి. విధానంలో అన్ని లెవెల్ క్రాసిం గ్‌ల వద్ద ఒకేసారి సిబ్బందిని నియమించవచ్చు. స్థానిక నిరుద్యోగులకు ప్రాధాన్యమిస్తే ఎందరో కాపలాదారులుగా చేరేందుకు ముందుకొస్తారు. రైల్వేలకు ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా, కాపలాదారులు లేని లెవెల్ క్రాసింగ్‌లు అన్నింటిలో తక్షణమే నియామకాలు జరుపవచ్చు. 6 నుంచి 13 సంవత్సరాల మధ్య వయస్సున్న చిన్నారుల మృతితోనైనా మన రైల్వేలకు జ్ఞానోదయం కలగాలని ఆశిద్దాం. లెవెల్ క్రాసింగ్‌ల వద్ద సత్వర నియామకాలే రైలు ప్రమాదాలకు పరిష్కారమార్గం.

 వి.దిలీప్ కుమార్, యం.రోజా లక్ష్మి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement