మళ్లీ అవేచూపులు.. ఎదురుచూపులు.. | m set examinations | Sakshi
Sakshi News home page

మళ్లీ అవేచూపులు.. ఎదురుచూపులు..

Published Wed, Mar 16 2016 12:04 AM | Last Updated on Fri, May 25 2018 5:44 PM

m set examinations

 ఎదురుచూపులు.. నోటిఫికేషన్ ఎప్పుడు పడుతుందా అని.. మళ్లీ ఎదురుచూపులు అదే నెలలో ఎంసెట్ పరీక్షలు ఉన్నాయంట.. మన పరీక్షలు జరుగుతాయా? లేదా? అని.. మళ్లీ అవే చూపులు..
 ప్రశ్నాపత్రాల్లో అనేక తప్పులు దొర్లాయంట.. రిజల్ట్స్ ఇస్తారా? లేదా? అని.. ఇప్పుడూ అవే ఎదురు చూపులు.. కోర్టులో కేసులు వేశారంట.. మెరిట్ వచ్చిన వారికి ఉద్యోగాలు ఇస్తారా? లేదా? అని..
 ఇదీ  2014 డీఎస్సీ అభ్యర్థుల పరిస్థితి. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్వహించిన ఒకే ఒక పోటీ పరీక్ష డీఎస్సీ. ఉపాధ్యాయులై పిల్లలకు పరీక్షలు పెట్టాల్సిన నిరుద్యోగ అభ్యర్థులు ఇలా అగ్ని పరీక్షకు గురవుతున్నారు.
 
 జిల్లాలో డీఎస్సీ-14 నియామకాలకు సంబంధించి 31 వేల మంది దరఖాస్తు చేస్తే, సుమారు 29 వేల మంది అభ్యర్థులు ఆయా కేటగిరీల్లో టెట్ కమ్ టెర్ట్ పరీక్షలు రాశారు. వీటి ఫలితాలు విడుదల చేసి 9 నెలలు దాటినా నేటికీ పోస్టుల భర్తీ చేపట్టడం లేదని ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్(ఎస్‌ఏ)అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు సెకండరీ గ్రేడ్, లాంగ్వేజ్ పండిట్ పోస్టుల భర్తీకి ఒక అడుగు ముందుకేసిన పాఠశాల విద్యాశాఖ మరో రెండు అడుగులు వెనక్కి వేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. మార్చి 1 నాటికే ఎస్జీటీ, ఎల్‌పీ, పీఈటీ పోస్టులు భర్తీ పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ నిర్ణయంపై పునరాలోచిస్తున్నట్టు సమాచారం. ఎలాగూ రెండు నెలలు వేసవి సెలవులు వస్తోన్న దశలో ఊరికే కూర్చోబెట్టి జీతాలు చెల్లించటం కంటే జూన్ నెల అనంతరం పోస్టుల నియామకాలు చేపడితే మంచిదనే ఆర్థిక శాఖ నిర్ణయంతో నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందంటున్నారు.
 
 స్కూల్ అసిస్టెంట్ల మాటేమిటి?
 కోర్టు కేసులు ఉన్నాయనే నెపంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు భర్తీ చేయకపోవటం దారుణమని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 123 స్కూల్ అసిస్టెంట్ కేటగిరీ పోస్టులకు ఏకంగా 22,760 మంది అభ్యర్థులు పోటీ పరీక్ష రాశారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత వేధిస్తున్నా ప్రభుత్వం ఉపాధ్యాయులను నియమించకుండా ఇలా తాత్సారం చేస్తోందనే విమర్శలూ ఉన్నాయి. జిల్లాలో వేలాదిగా బీఎడ్ కోర్సులు పూర్తిచేసి డీఎస్సీ పరీక్షలు రాసి మెరిట్ లిస్ట్ కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నామని అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు.
 
 ఎస్జీటీ, ఎల్‌పీల భర్తీపై సందిగ్ధం
 సెకండరీ గ్రేడ్, భాషా పండిట్ పోస్టుల భర్తీ ప్రక్రియపైనా ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. మార్చిలోనే పోస్టుల భర్తీ చేస్తే ఆర్థిక భారం తప్ప ఉపయోగం ఉండదనే ఆర్థిక శాఖ కొర్రీతో నియామకాలపై సందిగ్ధత నెలకొంది. జిల్లాలో ప్రస్తుతం ఎస్జీటీ, లాంగ్వేజ్ పండిట్ పోస్టులు 518 భర్తీ చేయాలని నిర్ణయించగా, వాటిలోనూ అభ్యర్థులు లేక మరో 62 పోస్టులు ఖాళీగానే మిగిలిపోయాయి. ఇక 456 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులను సైతం ఇప్పటికిప్పుడు నియామకాలు చేపడితే నెలకు వీరి జీతాలకు సుమారు రూ.82 లక్షలు వెచ్చించాల్సి ఉంటుంది. వేసవి సెలవులు ఎలాగూ సమీపిస్తున్న తరుణంలో అనవసర భారాన్ని తగ్గించుకునే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికైనా తక్షణం డీఎస్సీ నియామకాలు చేపట్టి ఆదుకోవాలని అభ్యర్థులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement