'రాయి ఎక్కడ పడితే అదే రాజధాని'
గుంటూరు జిల్లా పల్నాడులోని మాచర్లను సీమాంధ్ర రాజధానిగా ప్రకటించాలని మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత రాజధానికి మాచర్ల అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఆయన అన్నారు. సీమాంధ్రకు రాజధానిగా కర్నూలును ఎంపిక చేయడం కోసం రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేశ్ పోరాటం చేస్తాననటం తెలివి తక్కువ తనానికి నిదర్శనమన్నారు. తమ ప్రాంతామే రాజధాని కావాలంటూ పలు ప్రాంతాల నేతలు ప్రకటనలు చేస్తూ యువతను రెచ్చ గొట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
పిచ్చి సోనియా చేతిలో రాయి సీమాంధ్రలో ఎక్కడ పడితే అదే సీమాంధ్రకు రాజధాని అవుతుందని ఆయన తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. గడువు పూర్తవుతున్న నేపథ్యంలో లోక్‌సభతో పాటే అసెంబ్లీకి ఎన్నికల నిర్వహించాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు వాయిదా వేయడం సాధ్యం కాదన్నారు. కోర్టులు కూడా అంగీకరించవన్నారు.
రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వాయిదా వేసేందుకు తమ ప్రయత్నాలు విరమించుకోవాలని ఆయన సీమాంధ్ర మంత్రులకు హితవు పలికారు. హైదరాబాద్లో మాదిరిగానే సీమాంధ్రలోనూ వనరులు ఉన్నాయన్నారు. వాటితో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఏ కృష్ణుడి కేబినెట్లోను తాను చేరనని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు.