Seemandhra capital
-
'విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని'
హైదరాబాద్ : విజయవాడ-గుంటూరు మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధానిని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోందని ఆపార్టీ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్ రెడ్డి అన్నారు. అందువల్లే చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకారం చేస్తున్నట్లు ఆయన గురువారమిక్కడ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిని ప్రపంచంలోని రాజధానులకు ధీటుగా తీర్చిదిద్దుతామని మోదుగుల పేర్కొన్నారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలపటం ఆర్డినెన్స్ ప్రకారమే అధికారులు నిర్ణయం తీసుకున్నారని మోదుగల అన్నారు. ఇందులో ఎలాంటి కుట్ర లేదని ఆయన తెలిపారు. కాగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా జూన్ 8వ తేదీన గుంటూరు జిల్లాలోనే ప్రమాణ స్వీకరం చేయనున్న విషయం తెలిసిందే. విజయవాడ-గుంటూరు మధ్యలో ఉన్న ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట ఉన్న ఖాళీ స్థలంలో ప్రమాణ స్వీకారం చేసేందుకు వేదిక నిర్మించనున్నారు. జూన్ 8వ తేదీ ఉదయం 11.35 గంటలకు చంద్రబాబు సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గురువారం తన నివాసంలో గుంటూరు, కృష్ణా జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ప్రమాణ స్వీకారం ఏర్పాట్లపై ఆయన వారితో చర్చలు జరిపారు. -
సీమాంధ్ర రాజధాని పై సర్వత్రా అసక్తి
-
రాజధాని రూటెటు!
* కనీసం లక్ష ఎకరాలుండాలంటున్న నిపుణుల కమిటీ * దొనకొండలో భారీగా భూములు.. నీటి లభ్యత ఉన్నాయన్న కమిటీ * ఆంధ్రప్రదేశ్‌కు ఓ మూలకు ఉండటం విశాఖపట్నానికి ప్రతికూలం * కాకినాడ-రాజమండ్రికి తుపాన్లు, ప్రకృతి విపత్తుల ముప్పు * గుంటూరు- విజయవాడ మధ్య భూ సేకరణ అసాధ్యం * పులిచింతలలో విపరీతమైన వేడి సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని సీమాంధ్రలో ఏ ప్రాంతంలో ఏర్పాటు కానుంది? విశాఖ నుంచి తిరుపతి వరకు నాలుగైదు ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర నిపుణుల కమిటీ తన నివేదికలో ఎటువంటి సిఫారసులు చేసింది? రాష్ట్రం జూన్ రెండో తేదీ నుంచి రెండుగా విడివడనున్న తరుణంలో ఇవే అంశాలపై అన్ని వర్గాల్లో విస్తృత చర్చ సాగుతోంది. కమిటీ తన నివేదికలో ఏ ప్రాంతాన్ని రాజధానికి అనువైనదిగా ప్రతిపాదించిందోనని పార్టీల నేతలు, ఇతర ముఖ్యులు, రియల్ ఎస్టేట్, ఇతర రంగాల వ్యాపారులు కూపీలాగే ప్రయత్నాల్లో పడ్డారు. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న తమ సన్నిహిత వర్గాల నుంచి కచ్చితంగా కాకున్నా రాజధాని నగరం ఎక్కడ వస్తుందో ఇదమిత్థంగానైనా తెలుసుకొనే పనిలో నిమగ్నమైన ఆ వర్గాల అంచనా ప్రకారం.. అటు రాయలసీమకు - ఇటు కోస్తాంధ్రకు సరిగ్గా మధ్యలో.. కనీసం లక్ష ఎకరాల భూమి అందుబాటులో ఉండే ప్రదేశం.. అందులోనూ నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు వంటి సానుకూలతలు గల ప్రదేశం కొత్త రాజధాని నిర్మాణానికి అనువైన ప్రాంతమని సదరు కమిటీ తన సిఫారసుల్లో సూచించినట్లు చెప్తున్నారు. పరిశ్రమలు, ఇతర ముఖ్యమైన సంస్థల ఏర్పాటుకు వీలుగా సుమారు లక్ష ఎకరాలు ఒకే ప్రాంతంలో ఉంటేనే రాజధానికి వీలవుతుందనేది ఒక వాదన. గతంలో కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు స్థలాన్ని చూపించే రాజధానిని ఏర్పాటు చేశారని ఉదహరిస్తున్నారు. రాష్ట్రానికి ఒక మూలకు అన్నట్లుగా ఉండటం విశాఖపట్నానికి, తుపాన్లు, ప్రకృతి విలయాలు రాజమండ్రి - కాకినాడ ప్రాంతానికి, భారీ స్థాయిలో భూములు సేకరించ గలిగే పరిస్థితి లేకపోవటం విజయవాడ - గుంటూరులకు, విపరీతమైన వేడి వాతావరణం పులిచింతల ప్రాంతానికి ప్రతికూలతలుగా కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో భూముల లభ్యతతో పాటు ఇతరత్రా సానుకూలతలు ఉన్నాయని పేర్కొన్న కమిటీ.. కొన్ని ప్రతికూలతలను కూడా వివరించినట్లు.. కమిటీ సిఫారసులపై ఆరా తీసిన నేతలు చెప్తున్నారు. కమిటీ సిఫారసులు ఏ ప్రాంతానికి సానుకూలంగా ఉన్నాయనే దానిపై ఆయా నేతల అంచనాలు ఇలా ఉన్నాయి... * విశాఖ, రాజమండ్రి - కాకినాడ, విజయవాడ - గుంటూరు, గుంటూరు జిల్లా పులిచింతల, ప్రకాశం జిల్లాలోని దొనకొండ తదితర కొన్ని ప్రాంతాలపై కమిటీ నివేదికలో ప్రతిపాదనలున్నట్లు చెప్తున్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి అనుకూల ప్రతికూలాంశాలను కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. * విశాఖపట్నం రాజధానికి అనుకూల ప్రాంతమైనా అది రాష్ట్రానికి మధ్యలో కాకుండా ఓమూలకు ఉండడం ప్రతికూలంగా మారిందని కమిటీ అభిప్రాయపడ్డట్లు వినిపిస్తోంది. * రాజమండ్రి-కాకినాడ ప్రాంతాల్ని పరిశీలించిన కమిటీ అక్కడ ఎయిర్‌పోర్టు ఉండడం, నీటి సరఫరాకు ఇబ్బంది లేకపోవడం వంటి అనుకూలాంశాలను గుర్తించినా.. తుపాన్లు. ప్రకృతి విలయాలు ప్రతికూలంగా ఉన్నట్లుగా సూచించిందని.. తుపాన్ ప్రభావిత ప్రాంతంలో రాజధాని నిర్మాణం అనుకూలం కాదని తేల్చిందని చెప్తున్నారు. * గుంటూరు - విజయవాడ ప్రాంతం రాజధాని ఏర్పాటుకు అనువైనదే అయినా అక్కడ రాజధానికి అవసరమైన స్థలం లభ్యత ప్రతికూలంగా మారుతోందని.. ఇప్పటికే ఎంతో అభివృద్ధి చెందిన ఆ ప్రాంతంలో భూముల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో రాజధానికి అవసరమైన స్థలసేకరణ కష్టమేనని కమిటీ అభిప్రాయపడ్డట్లు తెలిసిందని పలువురు నేతలు చెప్తున్నారు. ఈ రెండు ప్రాంతాల్లోనూ వ్యవసాయభూములు అధికంగా ఉండటం కూడా ప్రతికూలాంశంగానే గుర్తించారని తెలుస్తోంది. * గుంటూరు జిల్లాలోని పులిచింతల ప్రాజెక్టు ఉన్న ప్రాంతం కూడా కమిటీ పరిశీలనలోకి వచ్చినట్లు చెప్తున్నారు. అక్కడ స్థలం అందుబాటులో ఉండడం, నీటి సమస్య లేకపోవడాన్ని కమిటీ పరిశీలనకు వచ్చిందని.. దాంతో పాటు అక్కడి వాతావరణ పరిస్థితులను కూడా కమిటీ తన నివేదికలో చర్చిం చిందని.. భౌగోళికంగా అనువైనప్పటికీ వాతావరణ పరిస్థితుల పరంగా ప్రతికూలంగా ఉంటుందని.. విపరీతమైన వేడి వాతావరణం రాజధానికి అనుకూలంగా ఉండదని కమిటీ అభిప్రాయపడ్డట్లు ఆరాతీసిన వర్గాలు వివరిస్తున్నాయి. * ఇక ప్రకాశం జిల్లాలోని దొనకొండ మండలంతో పాటు మరికొన్ని ప్రాంతాలపై కూడా కమిటీ సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. అటు కోస్తా, ఇటు రాయలసీమ ప్రాంతాలకు సమాన దూరంలో ఉండడం, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో ఉండటం కూడా రాజధాని ఏర్పాటుకు అనుకూలంగా ఉన్నట్లు కమిటీ నివేదికలో పొందుపరిచినట్లు చెప్తున్నారు. నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించి కమిటీ అక్కడ రాజధాని ఏర్పాటుకు సానుకూల, ప్రతికూలాంశాలను నివేదికలో పొందుపరిచినట్లు సమాచారం. ఆకాశాన్నంటిన భూముల రేట్లు ఆంధ్రప్రదేశ్ రాజధానిపై అనేకరకాల ప్రచారాలు సాగుతుండగా.. ఆయా ప్రాంతాల్లో భూముల రేట్లు అమాంతంగా పెరిగిపోతున్నాయి. సీమాంధ్రలో కమిటీ పర్యటించిన అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు భూముల ధరలు భగ్గుమంటున్నాయి. రాజధాని ఎక్కడ ఏర్పాటు అవుతుందో కానీ.. ఈ ప్రాంతాల్లో నిన్నటిదాకా వేలు, లక్షలు పలికే భూముల ధరలు ఇప్పుడు ఏకంగా కోట్లకు చేరుకున్నాయి. కొందరు రాజధాని నగరంపై రకరకాల ప్రచారాలు లేవదీస్తూ భూముల రేట్లు కృత్రిమంగా పెరిగేలా చేస్తున్నారు. దీంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో భూముల రేట్లు భారీగా పెరిగాయి. రాజధాని ప్రాంతంపై కచ్చితమైన నిర్ణయమేదీ కేంద్రం నుంచి వెలువడకున్నా వేలం వెర్రిగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగిపోతున్నాయి. వాస్తవానికి కేంద్రం నియమించిన నిపుణుల కమిటీ తాను పరిశీలించిన ప్రాంతాలపై ప్రాధమిక నివేదికను మాత్రమే కేంద్రానికి సమర్పించింది. దానిపై మరింత లోతుగా పరిశీలన పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాకనే కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని నిపుణులు చెప్తున్నారు. -
'రాజధాని విషయంలో ఏకపక్ష నిర్ణయం తగదు'
పాణ్యం: కొత్త రాష్ట్రానికి సంబంధించి రాజధాని ఎంపిక విషయంలో కేంద్ర కమిటీసభ్యులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. కర్నూలు జిల్లా పాణ్యంలో కేఎంసీ ఆధ్వర్యంలోని జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ పార్టీల అభిప్రాయాలు తీసుకోకుండానే కేంద్ర కమిటీ సభ్యులు ఇష్టానుసారం స్థలాన్వేషణ చేయడం బాధాకరమన్నారు. ప్రతిపక్ష పార్టీగా రాష్ట్రాభివృద్ధికి వైఎస్ఆర్సీపీ పోరాటం సాగిస్తుందన్నారు. నిలిచిపోయిన జాతీయ రహదారి పనులను మరో రెండు నెలల్లో పునఃప్రారంభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
'రాజధాని ఏదనేది ముందుగా నిర్ణయించుకుని రాలేదు'
రాజధాని ఏదనేది ముందుగా నిర్ణయించుకుని రాలేదని ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ సభ్యుడు రతన్ రాయ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికలో భాగంగా ఆదివారం రాజమండ్రి వచ్చిన ఆ కమిటీ సభ్యులు జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. అనంతరం విలేకర్ల సమావేశంలో కమిటీ సభ్యులలో ఒకరైన రతన్‌రాయ్ మాట్లాడారు. రాజధానిపై తుది నివేదిక ఆగస్టు 31 నాటికి కేంద్ర హోంశాఖకు అందజేస్తామన్నారు. రాజమండ్రిలోని ప్రభుత్వ భూములు, నీటి లభ్యత తదితర అంశాలను పరిశీలించినట్లు చెప్పారు. కమిటీ ఛైర్మన్ శివరామకృష్ణన్ అనారోగ్యం కారణంగానే రాలేదని రతన్ రాయ్ విలేకర్లు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపికపై ఏర్పాటు అయిన శివరామకృష్ణన్ కమిటీ శనివారం విశాఖపట్నంలో పర్యటించింది. అనంతరం ఆ జిల్లా ఉన్నతాధికారులలో సమావేశమై పలు అంశాలపై చర్చింది. అయితే ఆ కమిటీ సభ్యుల పర్యటన అంతా చాలా గోప్యంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ రోజు ఉదయం విశాఖపట్నం నుంచి కమిటీ సభ్యులు రాజమండ్రి చేరుకున్నారు. రాజమండ్రి నగరంలో పర్యటించిన అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు. అనంతరం ఆ కమిటీ సాయంత్రం విజయవాడ చేరుకోనుంది. -
ఎన్నో వనరుల సిరి..రాజధానిగా ఇదే సరి..
సాక్షి, రాజమండ్రి :‘విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధానిగా రాజమండ్రి అన్నివిధాలా అనువైన ప్రాంతం. ఉన్నత విద్యావకాశాలు, జాతీయ రహదారి, సమృద్ధిగా నదీ వనరులు, విద్యా, ఉపాధి అవకాశాలు, సముద్ర తీరం అన్ని అందుబాటులో ఉన్నాయ’ంటున్నారు మేధావులు. ఇవే అంశాలను విశదీకరిస్తూ, జిల్లాకు ఆదివారం రానున్న ‘రాజధాని’ కమిటీకి నివేదికలు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. రాష్ట్ర రాజధానికి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయడం కోసం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ ఆదివారం రాజమండ్రి వస్తుండడంతో ఈ ప్రాంతవాసుల్లో కొండంత ఆశలు నెలకొన్నాయి. కొత్త రాజధానిగా రాజమండ్రిని ప్రతిపాదించాలని కమిటీని కోరేందుకు ప్రముఖులు, ఆ దిశగా ప్రతిపాదనలు ఇచ్చేందుకు అధికారులు ఉద్యుక్తులయ్యారు. రాజమండ్రియే ఎందుకంటే.. రాజమండ్రి నగరం తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు రాజధాని వంటిది. ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రధాన వాణిజ్య నగరం. రాజమండ్రిలో అత్యాధునిక సదుపాయాలతో విమానాశ్రయం ఉంది. అంతర్జాతీయ స్థాయికి విస్తరించే వనరులున్నాయి. హౌరా, చెన్నై, హైదరాబాద్‌కు ప్రధాన రైలు మార్గం ఉంది. కోల్‌కతా-చెన్నైను కలిపే 16వ నంబరు జాతీయ రహదారి ఆనుకుని ఉంది. రాష్ట్రంలోని రెండో అతి పెద్ద సీపోర్టు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలోని కాకినాడలో ఉంది. రాజమండ్రి శివారులో రాజధాని నిర్మాణానికి కావాల్సిన ఆరు వేల ఎక రాల అటవీ భూములున్నాయి. రాజధాని నిర్మాణానికి వీటిని డీనోటిఫై చేయడానికి ప్రభుత్వం సమ్మతం కూడా ఉంది. ఉన్నత విద్యాలయాలు, రాజమండ్రికి 60 కిలోమీటర్ల వైశాల్యంలో ఎన్నో ఉన్నాయి.ప్రతిష్టాత్మకమైన నన్నయ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ, కాకినాడలో జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ ఉన్నాయి. దేశ అవసరాలను తీర్చే అపార చమురు నిక్షేపాలు జిల్లాలో ఉన్నాయి. మూడు వేల మెగావాట్లకు పైగా విద్యుదుత్పత్తి చేయగల గ్యాస్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలున్నాయి. రాష్ట్రంలోనే సుప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంది. దేశంలోనే పెద్ద నదీ పర్యాటకానికి రాజమండ్రి కేంద్ర స్థానం వంటిది. ఇంతకన్నా అనువైన ప్రాంతం రాష్ట్రంలో మరెక్కడా ఉందని వివిధ వర్గాలకు చెందిన ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. స్థానికుల్లో నిరాశ కాగా కమిటీ చైర్మన్ అయిన శివరామకృష్ణన్ లేకుండానే కమిటీ పర్యటన జరుగుతోందని తెలుస్తోంది. ఆయన స్థానంలో ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ డెరైక్టర్ డాక్టర్ రతన్‌రాయ్ ఈ కమిటీకి ఆధ్వర్యం వహిస్తున్నారు. రాజధానికి సంబంధించిన వివిధ అంశాలను పరిశీలించేందుకు కమిటీ రాజమండ్రికి ఒక గంట మాత్రమే కేటాయించడంపై జిల్లావాసుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పర్యటన సాగేదిలా.. రాజధాని కమిటీ విశాఖపట్నం నుంచి ఉదయం 9 గంటలకు రాజమండ్రి చేరుకుంటుంది. హోటల్ రివర్‌బేలో అరగంట విశ్రమించిన అనంతరం 10 నుంచి 11 గంటల వరకు కలెక్టర్ నీతూ ప్రసాద్, రాజమండ్రి నగరపాలక సంస్థ కమిషనర్ రవీంద్రబాబుతో సమావేశమవుతారు. అనంతరం రోడ్డుమార్గంలో విజయవాడ బయలుదేరి వెళతారు. కమిటీలో రతన్రాయ్తో పాటు బెంగళూరుకు చెందిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్కు చెందిన అరోమర్ రవి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ అర్బన్ ఎఫైర్స్ డెరైక్టర్ జగన్‌షా, న్యూఢి ల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ పూర్వపు డీన్ కేటీ రవీంద్రన్ ఉంటారు. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డెరైక్టర్ పి.తిమ్మారెడ్డి కూడా పర్యటిస్తున్నారు. రాజమండ్రి పర్యటన అనంతరం కమిటీ విజయవాడ, గుంటూరుల్లో పర్యటిస్తుందని అధికార వర్గాలు తెలిపాయి. -
రాజధానిగా రాజమండ్రి అనుకూలం
కోటగుమ్మం (రాజమండ్రి, న్యూస్‌లైన్ : సీమాంధ్ర రాజధానిగా రాజ మండ్రి అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని పలువురు వక్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో ‘ఆంధ్రప్రదేశ్ రాజధానిగా రాజమండ్రిని చేయాలి’ అనే అంశంపై ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం సదస్సు నిర్వహించారు. వక్తలు మాట్లాడుతూ సాంస్కృతిక రాజధానిగా పేరొందిన రాజమండ్రికి రాజధానిగా ఉండగల అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. విమానాశ్రయం, ఓఎన్జీసీ, ఆధునిక ఆస్పత్రులు, నీటి పారుదల సౌకర్యం ఉందన్నారు. ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు గల ప్రాంతానికి మధ్యలో ఉందని తెలిపారు. మానవహక్కుల కౌన్సిల్ అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు మాట్లాడుతూ రాజమండ్రిని రాజ దానిగా చేసేందుకు వందశాతం అనుకూలమైన వనరులున్నాయన్నారు. సామర్లకోట ప్రాంతం పారిశ్రామిక కారిడార్‌కు అనువైన దని, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఆరువేల ఎకరాలు వరకు భూములు ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిషన్ కూడా రాజమండ్రిని రాజధానిగా చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు ఉన్నట్టు తన నివేదికలో తెలిపిందని వివరించారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలి సీమాంధ్రకు రెండు హైకోర్టు బెంచ్‌లు ఏర్పాటు చేసి, ఒకదానిని రాజమండ్రిలో ఏర్పాటు చేయాలి. ఐఐటీలు, వైద్య విద్యాసంస్థలను ఏర్పాటు చేయాలి. - కర్రి రామారెడ్డి, మానిసిక వైద్య నిపుణులు. ఉద్యోగావకాశాలు పెంచాలి సీమాంధ్రలోని 13 జిల్లాలోను అభివృద్ధి జరిగేలా చర్యలు తీసుకోవాలి. 950 కిలోమీటర్లు సముద్ర తీర ప్రాంతం ఉంది. దీనికి రోడ్డు మార్గం అభివృద్ధి చేసి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరచాలి. - గెద్దాడ హరిబాబు, ఎన్జీఓ సంఘం అధ్యక్షుడు -
రహస్యంగా శివరామకృష్ణన్ కమిటీ పర్యటన
విశాఖ : ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం విశాఖలో పర్యటిస్తున్న శివరామకృష్ణన్ కమిటీ పర్యటన రహస్యంగా కొనసాగుతోంది. మీడియాకు సమాచారం ఇవ్వద్దంటూ కమిటీ సభ్యులు డటీఆర్వోకు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు శివరామకృష్ణన్ కమిటీ ముందు తమ వాదనలు వినిపించడానికి సీఐఐ, వీడీసీ, సామాజిక సేవా సంస్థలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులు సన్నాహాలు చేస్తున్నారు. ఎవరికివారే ప్రత్యేక నివేదికలు తయారు చేస్తున్నారు. సీమాంధ్ర రాజధానిగా అవతరించేందుకు మహా విశాఖకు అన్ని అర్హతలు ఉన్నాయన్నది ఈ ప్రాంతీయుల నిశ్చితాభిప్రాయం. రాజధానిగా ఈ ప్రాంతాన్నే ప్రకటించాలంటూ అనేక గళాలు ఎలుగెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. -
రాజమండ్రిని రాజధాని చేయాలి
దానవాయిపేట(రాజమండ్రి), న్యూస్‌లైన్ : చరిత్రప్రసిద్ధమైన రాజమండ్రి నగరాన్ని రాష్ట్ర రాజధానిగా చేయాలని జిల్లా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ వెల్పేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. స్థానిక ఆనంకళాకేంద్రంలో గల గోదావరి కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం జరిగిన సమావేశంలో జిల్లా చైర్మన్ కేకే సంజీవరావు మాట్లాడుతూ రాజమండ్రి నగరాన్ని రాజధాని చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. ఇక్కడగల వనరులు, పర్యావరణ అనుకూలతలు తదితర అంశాలపై చర్చించేందుకు శనివారం సాయంత్రం మూడు గంటలకు మేధావులు, రాజకీయనాయకులు, విద్యార్థి నాయకులతో సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.ఈ సమావే శానికి నగర పౌరులు హాజరై సూచనలు సలహాలు ఇవ్వాలని కోరారు. ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు నగరానికి వస్తున్న కె.శివరామకృష్ణన్ కమిటీకి ఆర్డీఓ ద్వారా వినతిపత్రం సమర్పిస్తామన్నారు. జిల్లాలో రాజధాని ఏర్పాటు చేయాలి బోట్‌క్లబ్ (కాకినాడ), న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధాని జిల్లాలో ఏర్పాటు చేయాలని కాకినాడ సిటీ జై సమైక్యాంధ్ర పార్టీ అభ్యర్థి ముత్తా శశిధర్ అన్నారు. స్థానిక హెలికాన్‌టైమ్స్ హోటల్లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని గుంటూరు, విజయవాడ మధ్యలో ఏర్పాటు చేయాలని నిపుణుల కమిటీ భావిస్తోందన్నారు. అక్కడ ప్రభుత్వ భూములు పూర్తి స్థాయిలో లేవని, భూములను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. అదే మన జిల్లాలో అయితే రాష్ట్ర రాజధాని ఏర్పాటుకు కావాల్సిన భూమి రాజానగరం వద్ద అటవీశాఖకు ఉందన్నారు. మన జిల్లాలో అన్ని వనరులు ఉన్నాయని, దీనిని దృష్టిలో ఉంచుకొని జిల్లాలోనే రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర రాజధాని ఏర్పాటు అంశాన్ని పరిశీలించేందుకు ఆదివారం జిల్లాకు వస్తున్న శివరామకృష్ణ కమిటీ దృష్టికి అన్ని రాజకీయ పార్టీలు తీసుకొని వెళ్లాలన్నారు. జిల్లాలోని మేధావులు మన జిల్లా విశిష్టతను వివరించి రాష్ట్ర రాజధాని ఇక్కడ ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. -
వీళ్లా సీమాంధ్రని అభివృద్ధి చేసేది ?!
-
సీమాంధ్ర కలల రాజధాని సాకారమిలా
-
నిస్తేజం
- పార్టీ శ్రేణుల్లో ఉత్తేజం నింపలేకపోయిన కాంగ్రెస్ సభ - చప్పగా సాగిన అధినేత్రి సోనియా ప్రసంగం - పునర్విభజన బిల్లులోని అంశాలే ప్రస్తావన - సీమాంధ్ర అభివృద్ధి ప్రస్తావన శూన్యం - జనం లేక వెలవెలబోయిన సభా ప్రాంగణం అరండల్‌పేట(గుంటూరు), న్యూస్‌లైన్ : పార్టీ శ్రేణుల్లో నెలకొన్ని నిరాశ, నిస్పృహలను కొంత వరకైనా దూరం చూస్తుందనుకున్న కాంగ్రెస్ సభ మరింత నీరుగార్చింది.కార్యకర్తల్లో ఉత్తేజం నింపుతుందనుకున్న సోనియా ప్రసంగం చప్పగా సాగింది. అధినేత్రి వేంచేసినా సభాప్రాంగణం జనం లేక వెలవెల బోయింది. యూపీఏ చైర్పర్సన్, ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాష్ట్ర విభజన అనంతరం తొలిసారి గుంటూరు వచ్చారు. శుక్రవారం ఇక్కడి ఆంధ్రా ముస్లిం కళాశాలలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. సీమాంధ్రలోని పదమూడు జిల్లాలు ఉన్నా ఇక్కడి నాయకులు ఏరికోరి ఆమె సభ గుంటూరులో పెట్టేలా ప్రయత్నించినా సభను విజయవంతం చేయలేకపోయారు. జిల్లాలోని 17 అసెంబ్లీ, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసేందుకు చాలా చోట్ల అభ్యర్థులు ముందుకు రాలేదు. గుంటూరు పశ్చిమ, తెనాలి, వినుకొండ, సత్తెనపల్లి అసెంబ్లీ నియోకజవర్గాల అభ్యర్థులు మినహా మిగిలిన ఎవరూ ప్రజలకు అంతగా పరిచయం లేరు. బాపట్ల ఎంపీ అభ్యర్థిగా మరోసారి బరిలో నిలిచిన పనబాక లక్ష్మి తప్ప నరసరావుపేట, గుంటూరు పార్లమెంటు అభ్యర్ధులు ఇంతకు ముందు ప్రజలకు పరిచయం లేదు. ఈ పరిస్థితిని అధిగమించి కనీసం గుంటూరు జిల్లాలోనైనా క్యాడర్లో ఉత్తేజం నింపుతారని భావించిన నాయకులకు సోనియా సభ నిరాశే మిగిల్చింది. సీమాంధ్ర అభివృద్ధికి, సంక్షేమానికి కొత్తగా హామీలేవీ ఇవ్వలేదు. సీమాంధ్రుల మనోభావాలను, ఆవేదనను అర్థం చేసుకోగలన ని చెప్పిన సోనియాగాంధీ సీమాంధ్రులకు ఏమి కావాలో గుర్తించలేకపోయారు. రాష్ట్ర విభజన సందర్భంగా పునర్విభజన బిల్లులో పొందుపరిచిన పథకాలనే ఆమె మరోసారి వల్లెవేశారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటు, కొత్తగా రాష్ట్రం ఏర్పాటైతే లోటు బడ్జెట్‌ను అధిగమించేందుకు ఏం చేస్తారు అనే విషయాలను ప్రస్తావించలేదు. విద్యార్థులు ఆందోళన చెందవద్దని పదేళ్ల పాటు విశ్వవిద్యాలయాల్లో ఉమ్మడి ప్రవేశాలు జరగుతాయని చెప్పిన ఆమె నిరుద్యోగుల సమస్య ఎలా పరిష్కరిస్తారో చెప్పలేదు. విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్, విశాఖ, తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం, కొత్తగా ైరె ల్వేజోన్ల ఏర్పాటు వంటివి ప్రస్తావించారు. అనువాదంపై అసహనం.. తన ప్రసంగానికి తెలుగు అనువాదం చేసిన జేడీ శీలంతో సోనియా ఇబ్బంది పడ్డారు. ఆయనే ప్రసంగించినట్లు ఉండటంపై ఆమె పలుమార్లు అభ్యంతరం, అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డికి చెప్పినా జేడీశీలం మాత్రం పట్టించుకోలేదు. సోనియాగాంధీ ఎందుకు అసహనం వ్యక్తం చేస్తున్నారో కొంతసేపు వేదికపై ఉన్న నాయకులకు అర్థంకాక తలలు పట్టుకున్నారు. సభా ప్రాంగణం మొత్తం ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో సమన్వయలోపం సైతం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రజలను తరలించే బాధ్యతను కేవలం కొంతమంది నాయకులు మాత్రమే తీసుకున్నారు. సభకు వచ్చిన ప్రజలు సైతం సోనియాగాంధీ ప్రసంగం పూర్తికాకుండానే వెనుతిరిగారు. పార్టీ జిల్లా అధ్యక్షునికి వేదికపై లభించని స్థానం.. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావుకు సభావేదికపై స్థానం లభించలేదు. తొలుత ఎమ్మెల్యే మస్తాన్‌వలికి సైతం సభావేదికపైకి వెళ్లేందుకు సెక్యూరిటీ అధికారులు అనుమతించలేదు. తర్వాత దిగ్విజయ్‌సింగ్ చొరవతో ఆయన సభావేదికపైకి వచ్చారు. అలాగే మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి, డొక్కా మాణిక్యవరప్రసాద్‌లను సైతం నాయకులు పట్టించుకోలేదు. -
కొత్త రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కమిటీ
న్యూఢిల్లీ: సీమాంధ్ర నూతన రాజధాని ఎంపిక కోసం ఐదుగురు సభ్యులతో నిపుణుల కమిటీ వేయనున్నట్టు జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం భేటీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. విభజనపై కేంద్రం తీసుకున్న చర్యలను ఇప్పటివరకు జీవోఎం సమీక్షించిందని వెల్లడించారు. జూన్ 2లోగా సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. విభజన కోసం 19 కమిటీల ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఉద్యోగుల కేటాయింపుల కోసం రెండు కమిటీలు వేశామన్నారు. మార్చి 31 లోగా కమిటీలు నివేదిక అందజేస్తాయని అన్నారు. కృష్ణా, గోదావరి నదుల నిర్వహణకు వేర్వేరుగా సర్వోన్నత మండళ్లను రేపు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఏపీ రాజధాని కోసం ప్రణాళిక సంఘంలో ప్రత్యేక విభాగం ఏర్పాటయిందని జైరాం రమేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్రీనివాస్... రాజధాని సెల్ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. త్వరలో మరోసారి జీవోఎం భేటీ కానుంది. -
రాజధానిపై దృష్టి సారించలేదు: ఆనం
హైదరాబాద్: సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మధ్య, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని సీమాంధ్ర పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల కోసం స్వల్పకాలిక ప్రణాళిక తయారు చేయాలని యోచిస్తోంది. ఎన్నికల అజెండా చర్చించేందుకు ఇందిరాభవన్‌లో సీమాంధ్ర పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ సమావేశమయింది. రాయలసీమ పారిశ్రామిక, టూరిజం కారిడార్, రోడ్డు, రైల్వే, ఎయిర్‌పోర్టు, వాణిజ్య రవాణా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై దృష్టి సారించలేదని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సీమాంధ్రలో సోనియా, రాహుల్ ప్రచారం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు. -
ఆశల ‘జంక్షన్’
రాజధానికి అనువుగా ఏలూరు-హనుమాన్ జంక్షన్ పరిసరాలు కృష్ణా, ‘పశ్చిమ’ వాసుల్లో ఆశలు రేకెత్తిస్తున్న పురపాలక శాఖ నివేదిక సాక్షి ప్రతినిధి, ఏలూరు : రాష్ట్ర రాజధాని నిర్మాణానికి ఏలూరు ప్రాంతం అన్నివిధాలా అనువుగా ఉందని నిపుణుల కమిటీ తేల్చడం జిల్లా వాసుల్లో ఆశలు రేపుతోంది. హనుమాన్ జంక్షన్-ఏ లూరు మధ్య రాజధాని నిర్మాణానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని రాజధాని ఏర్పాటుపై ఏర్పడిన నిపుణుల కమిటీకి పురపాలక శాఖ నివేదిక ఇచ్చింది. రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్ర రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై పెద్దఎత్తున చర్చ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విజయవాడ-గుంటూరు, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు నగరాల్లో రాజధానిని ఏర్పాటు చే యాలని ఆయా ప్రాంతాల రాజకీయ నాయకులు, ప్రజలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే, నగరాల్లో కాకుండా ఖాళీ భూములు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ొత్త రాజధానిని ఏర్పాటు చేయూలనే వాదన తెరపైకి వచ్చింది. దీంతో భూములు ఎక్కువగా ఉన్న ప్రకాశం జిల్లాలోని దొనకొండ ఇతర ప్రాంతాలను పరిశీలించారు. చివరకు ఆ ప్రాంతాల్లో రాజధానికి అవసరమైన అన్ని వనరులు లేవని తేల్చారు. ఖాళీ భూములు అందుబాటులో ఉండటంతోపాటు అన్ని వనరులన్న హనుమాన్ జంక్షన్-ఏలూరు మధ్య ప్రాంతంలో కొత్త రాజధాని నిర్మాణానికి విస్తృతమైన అవకాశాలున్నట్టు తేలడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. అన్నీ అనుకూలతలే కృష్ణా జిల్లా పరిధిలోని హనుమాన్ జంక్షన్ నుంచి పశ్చిమగోదావరి జిల్లాలోని కలపర్రు సమీపంలో ఏలూరు రోడ్డు వరకూ ఉన్న ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే ప్రాథమికంగా దీనిపై అధ్యయనం చేసి ఒక అంచనాకు వచ్చారు. ఈ ప్రాంతంలో జాతీయ రహదారికి ఇరువైపులా వేలాది ఎకరాల ఖాళీ భూములున్నాయి. వీటిలో ప్రభుత్వ భూములు కూడా ఉన్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను కలుపుతూ రోడ్డు, రైలు మార్గాలు అనుసంధానమైన ఉండే ప్రాంతం రాజధానికి అనువుగా ఉంటుంది. ఐదో నంబరు జాతీయ రహదారికి ఇరువైపులా హనుమాన్ జంక్షన్-ఏలూరు ప్రాంతాలు ఉండటంతోపాటు ఆంధ్రాకు ఇది నడిబొడ్డున ఉంది. బ్రాడ్‌గేజ్ రైలు మార్గం ఈ ప్రాంతాన్ని ఆనుకుని వెళుతోంది. అన్నిటికీ మించి 20 కిలోమీటర్ల దూరంలో గన్నవరం ఎయిర్‌పోర్టు ఉండటం, దాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు విస్తార అవకాశాలు ఉండటం ఈ ప్రాంతానికి కలిసి వచ్చే అంశం. జలమార్గాలు కూడా ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నాయి. విశాఖపట్నం, నిజాంపట్నం పోర్టులకు మధ్యన ఏలూరు ప్రాంతం ఉండటంతో ఇక్కడి నుంచి సరుకు రవాణా చేయడం చాలా తేలిక. మరోవైపు తాగునీటికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కృష్ణా, ఏలూరు, పోలవరం కుడికాలువల ద్వారా అవసరమైనంత నీటిని వినియోగించుకునే అవకాశం ఉం టుంది. రాజధానికి అవసరమైన ఇలాంటి అన్ని వనరులు ఏలూరు పరిసరాల్లో పూర్తిగా ఉన్నాయనేది స్పష్టమవుతోంది. ఇటీవలే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ ఏలూరు-విజయవాడ మధ్య రాజధానికి అవకాశాలున్నాయని తేల్చి చెప్పారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి దీనిపై విజ్ఞాపన చేశారు. ఐఏఎస్ అధికారిగా మహారాష్ట్రలో సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రశేఖర్ అర్బన్ ఎకాలజీలో డాక్టరేట్ పొందారు. మహారాష్ట్రలో అర్బన్ ప్లానర్‌గా ఆయనకు మంచి పేరుంది. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి రాజధాని అవకాశాలు ఉన్నాయని ఎలుగెత్తి చాటడం గమనార్హం. రాజకీయాలను పక్కనపెడితే ఈ ప్రాంత అభివృద్ధికి ఆయన చేసిన సూచనలు బాగా ఉపయోగపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
హనుమాన్ జంక్షన్ లేదా సాగర్!
-
హనుమాన్ జంక్షన్ లేదా సాగర్!
సీమాంధ్ర రాజధానికి అనువైన ప్రాంతాలు పురపాలక శాఖ నివేదిక కొత్త రాజధాని మౌలిక సదుపాయాల కమిటీకి ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర రాజధానిగా కృష్ణా జిల్లాలోని హనుమాన్‌జంక్షన్ లేదా గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతాలు అన్ని విధాలా అనువుగా ఉంటుందన్న అభిప్రాయాన్ని పురపాలక శాఖ వ్యక్తం చేస్తోంది. రవాణా, సమాచార వ్యవస్థ, ప్రభుత్వ భూములు, విమానాశ్రయం, తాగునీటి సౌకర్యం అన్నీ కలగలిసిన ప్రాంతం.. కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ నుంచి ఏలూరు రోడ్డు వరకూ గల ప్రాంతం.. అలాగే గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ తీరం.. సీమాంధ్ర కొత్త రాజధాని నిర్మాణానికి అనువుగా ఉంటుందని పురపాలక శాఖలోని డెరైక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ అధికార యంత్రాంగం రూపొందించిన నివేదిక సూచిస్తోంది. కర్నూలు, దొనకొండ ప్రాంతాల్లో రాజధాని నిర్మాణానికి పలు సమస్యలు ఉన్నాయని కూడా ఆ నివేదిక పేర్కొంది. కొత్త రాజధానికి సంబంధించి వినిపిస్తున్న పలు ప్రాంతాల గురించి అధికారులు అధ్యయనం చేశారు. పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్రకుమార్‌జోషి నేతృత్వంలో కొత్త రాజధాని మౌలిక సదుపాయాల అంశంపై ఏర్పాటైన కమిటీకి డీటీసీపీ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒక్కో ప్రాంతం గురించి అధికారులు ఇచ్చిన ప్రజంటేషన్‌లోని ముఖ్యాంశాలు... కర్నూలు - శ్రీశెలం డ్యామ్ బ్యాక్‌వాటర్ వల్ల, వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపుకు గురయ్యే అవకాశం. - తాగునీటికి సమస్య ఉంటుంది. సరైన సమాచార, రవాణా వ్యవస్థ లేదు. దొనకొండ - ప్రకాశం జిల్లాలోని దొనకొండ పరిసరాల్లో ఎర్రబాలెం, గంగదొనకొండ, వబ్బాపురం, పశ్చిమ గంగవరం, అబ్బయ్యపాలెంలను కొత్త రాజధానిలో చేర్చవచ్చు. మూసివేసిన రన్‌వే, విమానాశ్రయం ఉంది. - ఈ ప్రాంతానికి సరైన రవాణా, సమాచార వ్యవస్థ లేదు. ప్రస్తుత సమాచారం ప్రకారం తాగునీటి సమస్య కూడా ఉంది. ఈ ప్రాంతంలో ప్రతికూల అంశాల వల్ల రాజధానికి పనికిరాదు. గుంటూరు - గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ సరిహద్దులోని ప్రాంతం అన్ని ప్రాంతాలకు మధ్యలో ఉంటుంది. - దీని చుట్టూరా మాచర్ల, కొత్తపల్లి, చింతాల తండ, రాయవరం, రాచమల్లిపాడు, కంభంపాడు, తదితర ప్రాంతాలను రాజధానిలో చేర్చవచ్చు. - మూతపడిన రన్‌వే, పురాతన విమానాశ్రయం మంచి కండిషన్లో ఉంది. - ఈ ప్రాంతానికి సరైన రవాణా, సమాచార వ్యవస్థ సదుపాయం ఉంది. - నగర పెరుగుదలకు అవసరమైన తాగునీటి లభ్యత కూడా ఉంది. - వాతావరణ పరిస్థితులు, రాష్ట్రానికి మధ్యలో ఉండటం వల్ల రాజధానికి ఉత్తమైన ప్రాంతం. హనుమాన్ జంక్షన్ - ఏలూరు రోడ్డు - కృష్ణా జిల్లాలోని ఈ ప్రాంతంలో ప్రభుత్వ, అసైన్డ్ భూములు పెద్ద పరిమాణంలో అందుబాటులో ఉన్నాయి. - ఈ ప్రాంత సరిహద్దుల్లో నూజివీడు, కొత్తపల్లి, బిల్లనపల్లి, వేంపాడు, కొక్కిరపాడు, పల్లెర్లమూడి, సీతారామాపురం తదితర ప్రాంతాలను కొత్త రాజధానిలో చేర్చవచ్చు. - గన్నవరం విమానాశ్రయం ఈ ప్రాంతానికి 20, 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. దీనిని రాజధాని విమానాశ్రయంగా వినియోగించవచ్చు. - ఈ ప్రాంతం మంచి రైల్వే, రోడ్డు, రవాణా సౌకర్యాలతోపాటు సమాచార వ్యవస్థ కూడా మెరుగ్గా ఉంది. - రాజధాని నగరానికి అవసరమైన నీటి లభ్యత కూడా ఉంది. పోలవరం కాలువతో నీటి సౌకర్యం కల్పించవచ్చు. - ఈ ప్రాంతం రాజధాని కోసం స్థల, వాతావరణ పరంగా ఉత్తమమైన ప్రాంతం. -
సెప్టెంబర్‌లో కొత్త రాజధాని: జైరాం
ఒంగోలు / నెల్లూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధాని సెప్టెం బర్లో ఖరారు కానున్నట్లు కేంద్రమంత్రి జైరాం రమేష్ వెల్లడించారు. బుధవారం ప్రకాశం జిల్లా ఒంగోలులో, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో వేర్వేరుగా విలేకరులతో ఆయన మాట్లాడారు. సీమాం ధ్రలో కొత్త రాజధాని ఏర్పాటు కోసం గుంటూరు, విజయవాడ, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, కర్నూలు, రాజమండ్రి, విశాఖపట్నం తదితర ప్రాంతాలపై పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి అంతా జరగడంతో సమస్య ఎదుర్కోవాల్సి వచ్చిందని, ఇకపై ఇలాంటి సమస్య పునరావృతం కాకుండా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పారు. సీమాంధ్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు చెప్పిన మాటలను పట్టించుకోలేదనేది పూర్తి అవాస్తవమని, హైదరాబాద్‌ను యూటీ చేయాలనే ఒకే ఒక్క విషయాన్ని తప్ప అన్ని విషయాలను అంగీకరించామని ఆయన వివరించారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ను వీడి వెళుతున్నవారు లగడపాటి, రాయపాటిలాంటి వ్యాపారవేత్తలే తప్ప.. మిగిలిన వారు కాదన్నారు. అటువంటి వారు పార్టీని వీడినా ఎటువంటి నష్టం ఉండదన్నారు. బెర్లిన్ గోడ కిరణ్ చేతిలో కాదని ఆయన మైండ్‌లో ఉందని విమర్శించారు. ఎన్డీఏ హయాంలో మూడు రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించలేదని, రెండేళ్ల తర్వాత అభివృద్ధి ప్యాకేజీలను అప్పటి ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలోకొచ్చినా.. సీమాంధ్ర ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. పురందేశ్వరి బీజేపీపై ఉన్న ప్రేమతో కాంగ్రెస్‌పై విమర్శలు చేయడం సమంజసం కాదన్నారు. రాజ్యసభలో చిరంజీవి మాట్లాడటం సెల్ఫ్‌గోల్ వేసిన విధంగా ఉందన్నారు. త్వరలో జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ సారథ్యంలోనే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని జైరాం జోస్యం చెప్పారు. -
మేము పిరికిపందలం కాదు: రఘువీరా
అనంతపురం, న్యూస్‌లైన్: ‘రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏ తప్పూ చేయలేదు. అధికారంలో ఉన్న సమయంలో కొందరు పదవులు అనుభవించి, నేడు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. వారిలా మేము పిరికిపందలం కాదు’ అని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. విభజనలో కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తర్వాతేనన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇలాంటి ఆటుపోట్లను ఎన్నోసార్లు ఎదుర్కొందన్నారు. కొంత మంది కాంగ్రె స్ పార్టీని దోషిగా చూపిస్తున్నారని, పార్టీలో ఉన్న వారు కొంతమంది బయటకు పోతూపోతూ బురదజల్లి పోతుండడం బాధ కలిగిస్తోందన్నారు. త్వరలో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్ ప్రణాళిక విడుదల చేస్తామని ప్రకటించారు. ఎన్నికల అనంతరం సీమాంధ్ర నాయకులు అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు. -
పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది
-
పార్టీ తప్పు లేదు... తెలంగాణ ప్రజల కల నెరవేర్చింది
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ సహా కాంగ్రెస్ పార్టీని వీడిన వారంతా పిరికిపందలని మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి అభివర్ణించారు. కాంగ్రెస్‌ను ద్రోహిగా చిత్రీకరించడం కిరణ్‌కు తగదన్నారు. శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ ఏ తప్పు చేయలేదని తెలిపారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల కలను ఆ పార్టీ సాకారం చేసిందని వెల్లడించారు. రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖ కూడా కారణమేనని ఆరోపించారు. సీమాంధ్రకు కర్నూలును రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్రలోని 13 జిల్లాల ప్రజలతో చర్చించిన తర్వాతే రాజధాని ఏర్పాటు చేయాలని ఆయన కేంద్రానికి హితవు పలికారు. విభజన నేపథ్యంలో ఎగిసిన తెలంగాణ, సమైక్య ఉద్యమాల సందర్భంగా పెట్టిన కేసులన్ని ఎత్తివేయాలని ప్రభుత్వానికి రఘువీరా రెడ్డి సూచించారు. -
రాజధానికి నిధులపై స్పష్టత ఇవ్వాలి
సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్రలో కొత్త రాజధాని ఏర్పాటుకు నిధులు ఎప్పుడిస్తారు? ఎన్ని నిధులిస్తారన్న అంశాలపై స్పష్టత ఇవ్వాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లువాలియాను కోరినట్లు రాజ్యసభ సభ్యుడు సుబ్బిరామిరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రి రాజ్యసభలో ప్రకటించినట్లుగా.. సీమాంధ్రకు ప్రత్యేక ప్రతిపత్తితోపాటు అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఆల్ ఇండియా మెడి కల్ ఇనిస్టిట్యూట్, ఐఐటీలు, నూతన విశ్వవిద్యాలయాల నిర్మాణానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని కోరుతూ ఆయనకు వినతి పత్రం ఇచ్చినట్టు చెప్పారు. ఇదే అంశాన్ని కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ దృష్టికి తీసుకెళ్లానని పేర్కొన్నారు. బుధవారం ఢిల్లీలో దిగ్విజయ్‌తో భేటీ అనంతరం సుబ్బిరామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు నిధులతో పాటు పార్టీపరమైన అంశాలపై దిగ్విజయ్‌తో చర్చించానన్నారు. రాజధానికి నిధులిచ్చే అంశంపై మరో రెండు రోజుల్లో దిగ్విజయ్‌తో కలిసి ప్రధానితో చర్చించేందుకు వెళ్లనున్నట్టు చెప్పారు. రెండు రాష్ట్రాలు ఏర్పడనున్న నేపథ్యంలో రెండు పీసీసీలు ఏర్పాటు చేయాలా? ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు బొత్స కోఆర్డినేటర్‌గా.. రెండు ప్రాంతాల్లో రీజనల్ కమిటీలు వేయాలా? అన్నదానిపై పార్టీ అధిష్టానం ఆలోచిస్తోందని వెల్లడించారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైనందున త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీకి దిగడం లేదన్నారు. అయితే, ఇప్పటికీ విశాఖ నుంచి పోటీచేస్తే తాను కచ్చితంగా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. -
రేపు కమలనాథన్ కమిటీ తొలి భేటీ
సాక్షి, హైదరాబాద్: విభజన నేపథ్యంలో ఇరు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీపై కేంద్రం నియమించిన కమలనాథన్ కమిటీ గురువారం తొలిసారిగా భేటీ కానుంది. కమలనాథన్‌తో పాటు ఈ కమిటీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, కేంద్ర సిబ్బంది, శిక్షణ శాఖ సంయుక్త కార్యదర్శి ఉన్నారు. ఉద్యోగుల పంపిణీకి సంబంధించి మార్గదర్శక సూత్రాలకు ఈ భేటీలో రూపకల్పన చేయనున్నారు. మరోవైపు అన్ని శాఖల్లో విభజన పని పురోగతిపై సమీక్షించేందుకు రాష్ట్ర సీఎస్ బుధవారం సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ నెలాఖరుకల్లా ఫైళ్లు, ఆస్తులు, అప్పులు, సిబ్బంది విభజనను ఒక కొలిక్కి తీసుకురావాలని సీఎస్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సీఎస్ మంగళవారం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం అధికారులతో సమావేశమై సమీక్షించారు. ఇరు రాష్ట్రాల్లో చేపట్టాల్సిన పరిపాలనా సంస్కరణలతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఎన్ని పాఠశాలలు, ఆస్పత్ల్రు ఉన్నాయి, వాటికి అదనంగా ఏ రాష్ట్రంలోనైనా ఏర్పాటు చేయాల్సిన అవసరముందా? అనే అంశాలను పరిశీలించనున్నారు. సీమాంధ్ర కొత్త రాజధాని ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తే బాగుంటుందని.. దానికి అవసరమైన మౌలిక వసతులు ఎలా ఉన్నాయో కూడా సీఎస్ సమీక్షించనున్నారు. -
విజయవాడ-ఏలూరు మధ్య రాజధాని
వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరిన తోట చంద్రశేఖర్ ఏలూరు, న్యూస్‌లైన్ : వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే విజయవాడ-ఏలూరు మధ్య సీమాంధ్ర రాజధాని ఏర్పాటు చేయిచాలని వైఎస్సార్ కాంగ్రెస్ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు తోట చంద్రశేఖర్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఈ ప్రాంతానికి దగ్గరలో గన్నవరం, రాజమండ్రి విమానాశ్రయాలు, మచిలీపట్నం, కాకినాడ ఓడ రేవులు ఉన్నందున ఈ ప్రాంతాన్ని రాజధాని చేయడం ద్వారా ఏలూ రు మరింత అభివృద్ధి చెందుతుం దని వివరించారు. వైఎస్సార్ జనభేరి సభకు అధ్యక్షత వహించిన చంద్రశేఖర్ మాట్లాడుతూ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని 5 పట్టణాల్లో లక్ష ఎకరాల ప్రభుత్వ భూమి, రెండు లక్షల ఎకరాల అటవీ భూమి ఉందన్నారు. దెందులూరు, ఉంగుటూరు, ఏలూ రు, కైకలూరు నియోజకవర్గాల ప్రజలు కొల్లేరు సమస్యతో సతమ తం అవుతున్నారని చెప్పారు. దివంగత నేత వైఎస్ రాజశే ఖరరెడ్డి హయాంలో కొల్లేరును ఐదో కాం టారు నుంచి మూడో కాంటూరుకు కుదించేందుకు అసెంబ్లీలో తీర్మానం ఆమోదం పొందిందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సత్వర న్యాయం చేయా ల్సి ఉందన్నారు. అధికారంలోకి రాగానే వీటిపై దృష్టి పెట్టాలని జగన్మోహన్రెడ్డికి ఆయన విన్నవించారు. అందరి సమస్యలు తీరాలంటే జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ నడుం బిగించాలని పిలుపుని చ్చారు. కొన్ని వారాల్లో ఎన్నికలు రానున్నాయని, రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేసిన సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ, సహకరించిన బీజేపీ, మద్దతు ఇచ్చిన టీడీపీ దుష్టచతుష్టయమని, వాటికి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన తరుణం వచ్చిందన్నారు. సమైక్యాంధ్ర పరిరక్షణకు అహర్నిశలు కృషిచేసిన జగన్మోహన్రెడ్డి సీఎం కావటం ఖాయమన్నారు. ఆయననే సీఎంగా ఎందుకు చేయాలనే దానికి మూడు కారణాలున్నాయని చంద్రశేఖర్ వివరిచారు. ైవైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలకు జీవంపోసే శక్తి, సీమాంధ్రను పునర్నిర్మించే సత్తా, కేంద్రం నుంచి రాష్ట్రానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకురాగల దమ్ము జగన్మోహన్రెడ్డికే ఉన్నాయని, అందుకే ఆయనే సీఎం కావాలన్నారు. -
రాజధానిగా బెజవాడ భేష్ అని చెప్పా: కావూరి
ఏలూరు, న్యూస్‌లైన్: సీమాంధ్ర రాజధానిని కృష్ణా నది ఒడ్డున విజయవాడలో ఏర్పాటుచేస్తే బాగుంటుందని, ఇదే విషయాన్ని కేంద్రానికి చెప్పానని కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర ప్రాంతానికి చాలా నష్టం జరుగుతుందని కేంద్ర కేబినెట్లో అనేకసార్లు చెప్పానని, అయినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. అయితే, ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తరువాత భద్రాచలం డివిజన్‌ను సీమాంధ్రలో కలపాలని, ఇక్కడ పరిశ్రమలు నిర్మించుకోవడానికి పెట్టుబడిదారులను ప్రోత్సహించాలని కోరిన వెంటనే కేంద్రం అంగీకరించిందన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల అక్కడి నుంచి గెలుపొందే 10 మంది ఎంపీ సీట్లతో కేంద్రంలో అధికారాన్ని నిలుపుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజల కష్టంతో అభివృద్ధి చెందిన హైదరాబాద్‌ను చూసి అటువంటి మహానగరాన్ని నిర్మించలేమనుకుని, డబ్బును సంపాదించుకోవడానికి తెలంగాణ ప్రాంతంలోని నాయకులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కేంద్రాన్ని కోరడం, దానికి కేంద్రం అంగీకరించడం చారిత్రాత్మక తప్పిదమని కావూరు పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉందంటూనే.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్తపార్టీ ఏర్పాటు గురించి మీరేమంటారు అనే ప్రశ్నకు పార్టీ పెట్టినప్పుడు చూద్దాంలే అంటూ దాటవేశారు. -
సీమాంధ్ర రాజధానిపై రౌండ్‌టేబుల్ సమావేశం
-
రాజధాని ఎక్కడ?
-
కర్నూల్ రాజధాని కావాలి: కోట్ల
హైదరాబాద్: సీమాంధ్ర కోసం కర్నూలును రాజధానిగా చేయాలని పోరాడనున్నట్లు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి చెప్పారు. డబుల్ డెక్కర్ రైలును పరిశీలించేందుకు గురువారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు విచ్చేసిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్ర విభజన వల్ల తీవ్ర అన్యాయానికి గురైన రాయలసీమకు రాజధాని ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణమధ్య రైల్వే సహా అన్ని అంశాలపై కమిటీలు వే శారని, ఆ కమిటీ నివేదిక మేరకు రైల్వేలో కూడా మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. రాయలసీమకు చెందిన వ్యక్తిగా సీమాంధ్ర రైల్వే ప్రధాన కార్యాలయం కూడా కర్నూల్లోనే ఉండాలని కోరుకుంటున్నానన్నారు. వాల్తేరు డివిజన్ విలీనం పైన కూడా కమిటీ నివేదిక మేరకు నిర్ణయం ఉంటుందన్నారు. కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి సంబంధించిన ఇంకా భూమి లభించలేదన్నారు. హైదరాబాద్‌లో ఎంఎంటీఎస్ రెండో దశ పనులు త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
చంద్రబాబుతో టీజీ, ఏరాసు, గంటా భేటీ
హైదరాబాద్: దేశంలో బీజేపీ సానుకూల పవనాలు వీస్తున్నాయని కర్నూలు కాంగ్రెస్ నాయకుడు టీజీ వెంకటేష్ అన్నారు. కేంద్రంలో బీజేపీ రావడం ఖాయమని స్పష్టమవుతోందన్నారు. బీజేపీతో మంచి సంబంధాలున్న పార్టీ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఏరాసు ప్రతాపరెడ్డి, గంటా శ్రీనివాసరావు పాటు ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిని కలిశారు. సీమాంధ్రకు జరిగిన అన్యాయంలో కాంగ్రెస్‌తో పాటు బీజేపీ పాత్ర కూడా టీజీ వెంకటేష్ ఉందన్నారు. చంద్రబాబు ఒత్తిడి తేవడం వల్లే సీమాంధ్రకు ఆ మాత్రం ప్రోత్సకాలు తీసుకొచ్చేందుకు బీజేపీ పోరాడిందని చెప్పారు. చంద్రబాబు తమను టీడీపీలోకి ఆహ్వానించారని టీజీ తెలిపారు. సీమాంధ్రను స్వర్ణాంధ్ర చేసే సత్తా చంద్రబాబుకు ఉందని నమ్ముతున్నట్టు ఏరాసు ప్రతాపరెడ్డి తెలిపారు. టీడీపీ అధికారంలోకి వస్తే కర్నూలును సీమాంధ్ర రాజధాని చేయాలని చంద్రబాబును కోరినట్టు వెల్లడించారు. -
పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు..
న్యూఢిల్లీ: ప్రజలు విభజన గురించి మాట్లాడుకుంటుంటే కాంగ్రెస్ మాత్రం విలీనం గురించి మాట్లాడుతోందని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు విమర్శించారు. విభజన నుంచి ప్రజలు తేరుకోకముందే సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఒక్కొ రాజధాని పేరు చెబుతున్నారని మండిపడ్డారు. ఎటువంటి ప్రణాళికలు లేకుండానే రాష్ట్ర విభజన చేశారని ఆరోపించారు. ఎన్నికల్లో లబ్ధి పొందాలని కాంగ్రెస్ విభజన చేపట్టిందన్నారు. కేంద్రం విభజన చేసిన తీరును చూస్తే పెళ్లైన తర్వాత పెళ్లి చూపులు పెట్టుకున్నట్లు ఉందని వెంకయ్య నాయుడు ఎద్దేవా చేశారు. ఢిల్లీలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు మాంటెక్ సింగ్ ఆహ్లువాలియాను వెంకయ్య కలిశారు. సీమాంధ్రకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆహ్లువాలియాతో చర్చించినట్టు ఆయన తెలిపారు. విభజన బిల్లులో పేర్కొన్న వాటిని పరిశీలించడానికి కమిటీ వేస్తామని ఆహ్లువాలియా చెప్పారని వెల్లడించారు. -
కొత్త పార్టీ ప్రభావం ఉండదు: బొత్స ఝాన్సీ
బొబ్బిలి: కిరణ్‌కుమార్‌రెడ్డి పార్టీ పెట్టినా.. దాని ప్రభావం పెద్దగా ఉండదని విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మి అన్నారు. బుధవారం ఆమె బొబ్బిలిలో విలేకరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎవరు ఏది చేయడానికైనా హక్కు ఉందన్నారు. అయితే సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కిరణ్ సీఎం అయ్యారు కనుక దాన్ని గుర్తుపెట్టుకుంటేనే మనుగడ ఉంటుందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో తెలుస్తుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం వాల్తేరును రైల్వే జోన్‌గా చేయాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. అన్ని సౌకర్యాలు ఉన్న విశాఖను రాజధాని చేయాలని, సీమాంధ్రకు విద్య, ఉపాధి, వైద్యం, సాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని అన్నారు. -
'రాయి ఎక్కడ పడితే అదే రాజధాని'
గుంటూరు జిల్లా పల్నాడులోని మాచర్లను సీమాంధ్ర రాజధానిగా ప్రకటించాలని మాజీ మంత్రి, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రాంత రాజధానికి మాచర్ల అత్యంత అనుకూలమైన ప్రాంతమని ఆయన అన్నారు. సీమాంధ్రకు రాజధానిగా కర్నూలును ఎంపిక చేయడం కోసం రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే టీజీ వెంకటేశ్ పోరాటం చేస్తాననటం తెలివి తక్కువ తనానికి నిదర్శనమన్నారు. తమ ప్రాంతామే రాజధాని కావాలంటూ పలు ప్రాంతాల నేతలు ప్రకటనలు చేస్తూ యువతను రెచ్చ గొట్టడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. పిచ్చి సోనియా చేతిలో రాయి సీమాంధ్రలో ఎక్కడ పడితే అదే సీమాంధ్రకు రాజధాని అవుతుందని ఆయన తనదైన శైలిలో ఎద్దేవా చేశారు. గడువు పూర్తవుతున్న నేపథ్యంలో లోక్‌సభతో పాటే అసెంబ్లీకి ఎన్నికల నిర్వహించాల్సిందేనని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికలు ఆరు నెలలు వాయిదా వేయడం సాధ్యం కాదన్నారు. కోర్టులు కూడా అంగీకరించవన్నారు. రాష్ట్ర శాసనసభ ఎన్నికలు వాయిదా వేసేందుకు తమ ప్రయత్నాలు విరమించుకోవాలని ఆయన సీమాంధ్ర మంత్రులకు హితవు పలికారు. హైదరాబాద్‌లో మాదిరిగానే సీమాంధ్రలోనూ వనరులు ఉన్నాయన్నారు. వాటితో సీమాంధ్రను అభివృద్ధి చేసుకుంటామన్నారు. ఏ కృష్ణుడి కేబినెట్లోను తాను చేరనని జేసీ దివాకర్ రెడ్డి స్పష్టం చేశారు. -
'మాచర్లను సీమాంధ్రకు రాజధాని చేయాలి'
-
'సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం వెళ్లాల్సిందే'
హైదరాబాద్: సీఎం పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నేతల మధ్య పోటీ ఉందని ఎమ్మెల్సీ పాలడగు వెంకట్రావు అన్నారు. కిరణ్ రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి పదవి కోసం సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు ప్రయత్నస్తున్నారని తెలిపారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర రాష్ట్రాన్ని నడపలనుకోవడం అర్థరహితమని ఆయన వ్యాఖ్యానించారు. 15, 25 రోజుల్లో సీమాంధ్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా వెళ్లాల్సిందేనని అభిప్రాయపడ్డారు. సీమాంధ్రకు రాజధాని ఎక్కడ అనేది కేంద్రమే తేల్చాలన్నారు. రాజధాని అంశంపై సీమాంధ్ర నేతల్లో ఏకాభిప్రాయం సాధ్యంకాదని చెప్పారు. -
సోమవారం అసెంబ్లీకి తెలంగాణ బిల్లు : జైరాం రమేష్
న్యూఢిల్లీ : పది జిల్లాలతో కూడిన తెలంగాణే ఫైనల్ అని జీవోఎం సభ్యుడు జైరాం రమేష్ స్ఫష్టం చేశారు. రాయల తెలంగాణపై రాజకీయంగా ఏకాభిప్రాయం లేదని.... అసెంబ్లీ ప్రతిపాదన పంపిస్తే ఆలోచిస్తామని ఆయన తెలిపారు. సీమాంధ్రకు కాకినాడను రాజధాని చేయాలని కేంద్రమంత్రి పల్లంరాజు కోరారని జైరాం రమేష్ పేర్కొన్నారు. అయితే విశాఖ, విజయవాడ, అమరావతి, కర్నూలును కొత్త రాజధాని ఏర్పాటును పరిశీలిస్తున్నామని తెలిపారు. రాష్ట్రపతికి సోమవారం తెలంగాణ బిల్లును అక్కడ నుంచి అసెంబ్లీకి పంపుతామని జైరాం రమేష్ తెలిపారు. జీవోఎం సభ్యులకు ఆంధ్రప్రదేశ్ పై అవగాహన ఉందని ఆయన అన్నారు. రాజకీయ పార్టీలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నాయని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. రాయలసీమకు బుందేల్ ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ పరిశీలిస్తున్నామన్నారు.