
మేము పిరికిపందలం కాదు: రఘువీరా
అనంతపురం, న్యూస్‌లైన్: ‘రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ ఏ తప్పూ చేయలేదు. అధికారంలో ఉన్న సమయంలో కొందరు పదవులు అనుభవించి, నేడు రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఇతర పార్టీల్లోకి వెళుతున్నారు. వారిలా మేము పిరికిపందలం కాదు’ అని మాజీ మంత్రి రఘువీరారెడ్డి అన్నారు. విభజనలో కాంగ్రెస్ తప్పు చేసి ఉంటే తెలుగుదేశం, బీజేపీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల తర్వాతేనన్నారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఇలాంటి ఆటుపోట్లను ఎన్నోసార్లు ఎదుర్కొందన్నారు. కొంత మంది కాంగ్రె స్ పార్టీని దోషిగా చూపిస్తున్నారని, పార్టీలో ఉన్న వారు కొంతమంది బయటకు పోతూపోతూ బురదజల్లి పోతుండడం బాధ కలిగిస్తోందన్నారు. త్వరలో కాంగ్రెస్‌పార్టీ భవిష్యత్ ప్రణాళిక విడుదల చేస్తామని ప్రకటించారు. ఎన్నికల అనంతరం సీమాంధ్ర నాయకులు అందరం కలిసి ప్రశాంత వాతావరణంలో రాజధాని ఏర్పాటుపై నిర్ణయం తీసుకుంటామని వివరించారు.