భయపెడితే రాజీనామా చేయొద్దు
రొళ్ల/కళ్యాణదుర్గం: తెలుగుదేశం పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పర్మినెంట్ రేషన్ డీలర్లు ఎవరూ రాజీనామా చేయవద్దని ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి సూచించారు. అనంతపురం జిల్లా రొళ్ల మండలం తిరుమలదేవరపల్లి, కళ్యాణదుర్గం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేషన్ డీలర్ల తొలగింపు విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలని, లేని పక్షంలో బాధితుల పక్షాన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పోరాడుతామన్నారు. అవసరమైతే న్యాయపోరాటం చేస్తామన్నారు.
ప్రజలకు మేలు చేయాలే కానీ నిరుద్యోగులను నష్ట పరిచే చర్యలు తీసుకోకూడదన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నిల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చాలని అణా పైసాతో సహా రైతుల రుణాలు మాఫీ చేసి.. ఆగస్టు నుంచి కొత్త రుణాలు మంజూరు చేయాలన్నారు. చౌకడిపో డీలర్లతోపాటు ఇతర శాఖల్లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం న్యాయం కాదన్నారు. టీడీపీ, బీజేపీ ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, అయితే ఇప్పుడు మాత్రం 1.40 లక్షల మందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామనడం అనైతికమని ధ్వజమెత్తారు.