‘2 వేల రూపాయల నోట్లను రద్దుచేయండి’
అనంతపురం: కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. పెద్ద నోట్లను రద్దు చేయడంలో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతపురంలో ఎస్ బీఐ ఎదుట ఆయన ధర్నాకు దిగారు. సామాన్య ప్రజలకు ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, టీడీపీ నాయకులు తమ వారిని కాపాడుకున్నాకే పెద్ద నోట్లను రద్దు చేశారని ఆరోపించారు. దోపీడీ దొంగలు అంతా దాచుకున్నాకే ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు గురించి సీఎం చంద్రబాబుకు ముందే తెలుసునని అన్నారు. తాను లేఖ రాస్తే పెద్ద నోట్లు రద్దు చేశారని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు సాధించలేకపోతున్నారని ప్రశ్నించారు.
ఒక్క సంతకంతో పెద్ద నోట్లను రద్దు చేసిన ప్రధాని మోదీ... ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడిగారు. బ్యాంకుల్లో విత్ డ్రా దరఖాస్తులను కూడా అమ్ముతున్నారని ఆరోపించారు. ప్రతి బ్యాంకు, ఏటీఎంలో సరిపడా వందనోట్లు అందుబాటులో ఉంచాలని డిమాండ్ చేశారు. రేపు అన్ని బ్యాంకుల వద్దకు వెళ్లి ప్రజలకు అండగా నిలబడాలని కాంగ్రెస్ కార్యకర్తలకు రఘువీరారెడ్డి పిలుపుయిచ్చారు.