మళ్లీ నోట్ల కష్టాలు
– చెస్ట్‌లు ఖాళీ, ఏటీఎంలు మూత
– ఇబ్బందులు పడుతున్న ప్రజలు
అనంతపురం అగ్రికల్చర్ : ప్రజలకు మరోసారి నోట్ల కష్టాలు ఎదురవుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ గత నవంబర్ 8న రూ.500, రూ.1,000 నోట్లు రద్దు చేసిన తర్వాత నెలకొన్న పరిస్థితి మళ్లీ పునరావృతమవుతోంది. వారం రోజులుగా రిజర్వ్‌బ్యాంకు నుంచి నగదు సరఫరా పూర్తిగా ఆగిపోవడంతో చెస్ట్ బ్యాంకులు కరెన్సీ లేక ఖాళీ అవుతున్నాయి. దీంతో చిన్నాచితకా బ్యాంకుల్లో నగదు లావాదేవీలు నిలిచిపోయాయి. చాలా బ్యాంకుల్లో విత్‌డ్రాలు రూ.4 వేలకు పడిపోయాయి. ఎస్‌బీఐ, సిండికేట్‌బ్యాంకు, ఆంధ్రాబ్యాంకు, ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, కెనరాబ్యాంకు, కార్పొరేషన్ వంటి ప్రధాన బ్యాంకులతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ లాంటి ప్రధాన కార్పొరేట్ బ్యాంకుల్లో కూడా పరిస్థితి ఇబ్బందిగా మారింది.
రూ.200 నుంచి రూ.300 కోట్ల నగదు నిల్వ ఉండాల్సిన కరెన్సీ చెస్ట్‌లలో ఇపుడు రూ.2 నుంచి రూ.3 కోట్లకు పడిపోవడంతో ఏం చేయాల్లో తెలియని పరిస్థితుల్లో బ్యాంకర్లు కొట్టుమిట్టాడుతున్నారు. ఇదే విషయమై ఎస్‌బీఐ ఏజీఎం శ్రీనివాసరావు మాట్లాడుతూ గతంలో ఎస్‌బీఐ కరెన్సీ చెస్ట్‌లో రూ.350 కోట్లతో నడుపుతుండగా ఇపుడు రూ.2 కోట్లు మాత్రమే నగదు ఉందన్నారు. ఇదే పరిస్థితి మరికొద్ది రోజులు కొనసాగితే అటు ఖాతాదారులు, ప్రజలు ఇటు బ్యాంకర్లు గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. జనవరి నుంచి కొంతవరకు అందుబాటులోకి వచ్చిన ఏటీఎం కేంద్రాలు మరోసారి మూతపడ్డాయి. 90 శాతానికి పైగా ఏటీఎంలు తెరవని పరిస్థితి ఉండటంతో ప్రజలు, ఉద్యోగ వర్గాలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన నగదులో రూ.2 వేల నోట్లు డిపాజిట్లు చేస్తున్నా రూ.500, రూ.100 నోట్ల డిపాజిట్లు బాగా తగ్గాయని బ్యాంకర్లు చెబుతున్నారు. నోట్ల రద్దు తర్వాత రూ.2 వేల నోట్లకు ఇప్పటికీ చిల్లర కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.
అంతా గందరగోళం : నోట్లు రద్దు చేసిన నవంబర్ 8 నుంచి డిసెంబర్ 30వ తేదీ వరకు వారం వారం అంతో ఇంతో నగదు సరఫరా చేయడంతో ఎదురైన సవాళ్లు, ఇబ్బందుల నుంచి అతికష్టమ్మీద గట్టెక్కామని బ్యాంకర్లు చెబుతున్నారు. రోజుకో నిబంధన , వారానికో షరతు, రకరకాల చార్జీలు వేస్తూ గందరగోళానికి గురిచేస్తున్న ఆర్బీఐ వైఖరిపై ఖాతాదారులు, ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నగదు రహిత లావాదేవీలు అంటూ పెద్ద ఎత్తున హడావిడి చేస్తున్నా అవగాహన కల్పించి ప్రోత్సహించడంలో విఫలం కావడంతో ప్రజలు క్యాష్‌లెస్ వ్యవహారంపై పెదవి విరుస్తున్నారు.
కనీసం 10 శాతం మంది కూడా నగదు రహిత లావాదేవీలు చేయడం లేదని బ్యాంకర్లే చెబుతున్నారు. వంద శాతం నగదు రహితం అంటే రెండు మూడేళ్లయినా సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. పంపిణీ చేసిన 900 స్వైపింగ్ మిషన్ల ద్వారా మొదట్లో కొంత వరకు లావాదేవీలు జరిగినా ఇటీవల కాలంలో బాగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది. ఇపుడు మరోసారి నగదు సరఫరా ఆగిపోవడంతో సమస్య మొదటికొచ్చింది. ఎందుకీ పరిస్థితి అనే దానిపై తమకే అర్థం కావడం లేదని పలువురు బ్యాంకర్లు వాపోతున్నారు.