– నగదు కొరత కారణంగా విత్‌డ్రాలు తగ్గింపు
– జిల్లాకు రూ.173 కోట్లు నగదు సరఫరా–ఎల్‌డీఎం
అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా ప్రజలకు కరెన్సీ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా సాధారణ పరిస్థితులు ఏర్పడకపోవడంతో డబ్బుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. నెల మొదటి వారం కావడంతో 57వ రోజు బుధవారం కూడా జిల్లా అంతటా బ్యాంకుల వద్ద జనం క్యూ కట్టారు. జన్మభూమిలో సమస్యలు ఎదురుకాకుండా జిల్లాకు వచ్చిన నగదు ఎక్కువగా పింఛన్ లబ్ధిదారులకు కేటాయించడంతో బ్యాంకు ఖాతాదారులు, సామాన్య వర్గాలు, పెన్షనర్లు, ఉద్యోగ, వ్యాపార వర్గాలకు కొంత ఇబ్బందిగా పరిణమించినట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. ఇటీవల కొన్ని బ్యాంకుల్లో విత్‌డ్రాలు గరిష్టంగా రూ.24 వేలు కూడా ఇచ్చారు. అయితే నగదు కొరత ఉన్నందున బుధవారం ఎక్కడా రూ.24 వేలు ఇవ్వలేదని సమాచారం.
ఆంధ్రాబ్యాంకు శాఖల్లో పరిస్థితి మెరుగ్గా ఉన్నా... ఎస్‌బీఐ, ఏపీబీజీ, సిండికేట్, కెనరాబ్యాంకు లాంటి ప్రధాన బ్యాంకుల్లో మాత్రం నగదు కొరత ఉన్నట్లు బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు విత్‌డ్రాలు పరిమితం చేశారు. ఖాతాలు ఎక్కువ సంఖ్యలో కలిగివున్న ఎస్‌బీఐ, ఏపీజీబీ, సిండికేట్ బ్యాంకులకు చెందిన వారు ఇతర బ్యాంకుల ఏటీఎంలపై ఆధారపడాల్సి ఉండటంతో సర్వీసు చార్జీ భరించాల్సివస్తోందని వాపోతున్నారు. బుధవారం జిల్లావ్యాప్తంగా 556 ఏటీఎంలు ఉండగా అందులో 150 నుంచి 170 వరకు పనిచేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా బుధవారం మధ్యాహ్నం జిల్లాకు రూ.173 కోట్లు నగదు సరఫరా అయినట్లు ఎల్‌డీఎం జయశంకర్ తెలిపారు. అలాగే ఇప్పటి వరకు 731 స్వైపింగ్ మిషన్లు పంపిణీ చేయగా ఇంకా వేయికి పైగా దరఖాస్తుదారులకు ఇవ్వాల్సివుందని చెప్పారు.
కొనసాగుతున్న కరెన్సీ కష్టాలు
Published Wed, Jan 4 2017 11:05 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
Advertisement