పండుగ వేళ బ్యాంకుల్లో రద్దీ
అనంతపురం అగ్రికల్చర్ : సంక్రాంతి పండుగ ఉండడంతో ఖాతాదారులతో బ్యాంకులు రద్దీగా కనిపిస్తున్నాయి. నోట్లు రద్దు చేసి మంగళవారం నాటికి 63 రోజులైనా కొన్ని బ్యాంకుల వద్ద జనం బారులు తీరుతున్నారు. అందులో ప్రధానంగా అనంతపురంలోని ఎస్‌బీఐ ప్రధానశాఖ ఉదయం నుంచి సాయంత్రం వరకు కిక్కిరిసిపోయింది. ఎస్‌బీఐతో పాటు ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీ, సిండికేట్, కెనరా బ్యాంకులకు చెందిన చాలా శాఖల్లో రద్దీ కన్పించింది.
మరికొన్ని బ్యాంకుల్లో సాధారణ పరిస్థితి నెలకొంది. గత వారం నగదు సరఫరా కావడంతో విత్‌డ్రాలు రూ.15 నుంచి రూ.20 వేల వరకు ఇస్తున్నారు. నవంబర్, డిసెంబర్‌తో పోల్చుకుంటే ఏటీఎంల పరిస్థితి మెరుగైంది. 556 ఏటీఎంలకు గానూ మంగళవారం 250 నుంచి 270 వరకు పనిచేసినట్లు బ్యాంకింగ్ వర్గాలు తెలిపాయి. కొన్ని ఏటీఎంలలో రూ.100, రూ.500 నోట్లు కూడా పెడుతుండటంతో కొంత వెసులుబాటు లభిస్తోంది. మరికొన్ని ఏటీఎంలు రూ.2 వేల నోట్లకే పరిమితమయ్యాయి.