కష్టాలు రెట్టింపు
- బ్యాంకులకు సెలవు
- పనిచేయని ఏటీఎంలు
- అవస్థలు పడుతున్న జనం
- నగదు రాకపోతే రేపటి నుంచి మరింత ఇబ్బంది
అనంతపురం అగ్రికల్చర్ : బ్యాంకులకు సెలవు రావడంతో ప్రజలకు నగదు కష్టాలు ఎక్కువయ్యాయి. నాల్గవ శనివారం, ఆదివారం సెలవు కారణంగా బ్యాంకులు బంద్ చేశారు. దీంతో 46వ రోజు కూడా జిల్లా అంతటా ప్రజలు కరెన్సీ కష్టాలను ఎదుర్కొన్నారు. చాలావరకు ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు తప్పలేదు. ఉన్న నగదును కనీసం ఏటీఎంలలో పెట్టినా కొంత వెసులుబాటు ఉండేదని ప్రజలు అంటున్నారు. జిల్లా కేంద్రంలో ఐదారు, మిగతా అన్ని ప్రాంతాల్లో కలిపి 20 ఏటీఎంలకు మించి తెరచుకోలేదు. అవి కూడా పాక్షికంగా పనిచేశాయి.
చాలా మంది గంటల తరబడి క్యూలో నిలబడి నిరాశతో వెనుదిరిగారు. రూ.140 కోట్ల నగదుతో బ్యాంకర్లు ఈ వారం ఎలాగోలా నెట్టుకొచ్చారు. సోమవారం నుంచి ఎలా చేస్తారన్నదే ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. చిల్లర సమస్య ఎక్కువగా ఉండటంతో వ్యాపార లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి. రూ.20, రూ.50 లాంటి చిన్న డినామినేషన్ నోట్లతో పాటు రూ.100, రూ.500 నోట్ల కొరత కూడా ఎక్కువగా ఉండటంతో రూ.2 వేల నోట్లు మార్పిడి చాలా తక్కువగా ఉంది. పంపిణీ చేసిన నగదు తిరిగి బ్యాంకులకు రావడం లేదని, బయట కూడా అంతంత మాత్రంగానే మార్పిడి జరుగుతోందని బ్యాంకర్లు చెబుతున్నారు. మరోవైపు ఉన్న డబ్బును ప్రజలు, ఉద్యోగులు పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
దానికి తోడు క్రిస్మస్, నూతన సంవత్సరం.. ఆ తర్వాత సంక్రాంతి పర్వదినం ఉండటంతో దుబారాకు పోకుండా అవసరం మేరకు జాగ్రత్తగా వినియోగించుకుంటున్నారు. గత వారం.. పది రోజులుగా చాలా బ్యాంకుల్లో రద్దీ తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా.. సోమవారం నుంచి తిరిగి తాకిడి అధికమయ్యే పరిస్థితి ఉందని బ్యాంకర్లు చెబుతున్నారు. ఇదిలావుండగా.. ఆదివారం రాత్రికి జిల్లాకు నగదు వచ్చే అవకాశం ఉందని ఎల్‌డీఎం జయశంకర్, ఎస్‌బీఐ ఆర్‌ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ తెలిపారు. ఒకవేళ నగదు రాకపోతే కష్టాలు తప్పవు.