బ్యాంకులు కిటకిట
-
తీరని కరెన్సీ కష్టాలు
-
బ్యాంకులు, ఏటీఎంల వద్ద భారీ క్యూలు
అనంతపురం అగ్రికల్చర్ :
కాలం సాగిపోతున్నా ప్రజల కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. వరుసగా 41వ రోజు కూడా బ్యాంకులు, ఏటీఎంల వద్ద జనం క్యూ కట్టారు. జిల్లా వ్యాప్తంగా అన్ని బ్యాంకులు సోమవారం కిటకిటలాడాయి. తెరిచిన ఏటీఎంల ఎదుట జనం పోటెత్తారు. అనంతపురంలోని సాయినగర్‌లో ఉన్న స్టేట్‌బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ప్రధాన శాఖ వద్ద జాతరను తలపించింది. నగదు కొరత కారణంగా గత వారం ఇబ్బందులు ఎదురుకావడం, ప్రస్తుతం రూ.150 కోట్ల వరకు నగదు సరఫరా కావడంతో జనం తరలివచ్చారు. అయితే.. ఎక్కడా ఒకేసారి రూ.24 వేల విత్‌డ్రా ఇవ్వలేదు. దాదాపు అన్ని బ్యాంకుల్లోనూ రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకు చెల్లింపులు జరిగాయి. ఎస్‌బీఐ, ఆంధ్రాబ్యాంకు, ఏపీజీబీ, కెనరా, సిండికేట్, కార్పొరేషన్ తదితర ప్రధాన బ్యాంకులు, వాటి శాఖల్లో ఎక్కువ లావాదేవీలు కొనసాగాయి. వృద్ధులు, వికలాంగులు, పెన్షనర్లు, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులతో పాటు పేదలు, సామాన్య వర్గాల వారికి బ్యాంకులు, ఏటీఎంల వద్ద పడిగాపులు తప్పలేదు. నగదు సరఫరాలో జాప్యం కావడంతో జిల్లాలో 10 నుంచి 12 బ్యాంకు శాఖల్లో విత్‌డ్రాలు నిలిచిపోయినట్లు బ్యాంకర్లు తెలిపారు. షరా మామూలే అన్నట్లు సోమవారం జిల్లా వ్యాప్తంగా 45 నుంచి 60 ఏటీఎంలు మాత్రమే పనిచేశాయి. రోజూ సాయంత్రం వేళల్లో తమ ఏటీఎంలో డబ్బు పెడుతున్నామని, అందులోనూ రూ.2 వేల నోట్లతో పాటు కొత్త రూ.500 నోట్లు కూడా ఉంచుతున్నామని అనంతపురంలోని ఆంధ్రాబ్యాంకు సీనియర్ మేనేజర్ అమ్మయ్య తెలిపారు. రూ.160 కోట్లకు పైగా నగదు సరఫరా కావడంతో రానున్న మూడు, నాలుగు రోజుల పాటు ఎలాంటి ఇబ్బందులూ ఉండవని ఎల్‌డీఎం జయశంకర్ తెలిపారు.