సాక్షి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల్లో ఏపీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి తెలుగుదేశం నేతలు సహకరిస్తారా? ఆది నుంచి పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారథిని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలోని ఓ వర్గం ఈ ఎన్నికల్లో అతడికి చెక్ పెట్టేందుకు వ్యూహం పన్నుతోందా? తాజా ఘటనలు పరిశీలిస్తే అవుననే సమాధానం వస్తోంది. కళ్యాణదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రఘువీరారెడ్డి ఈసారి పెనుకొండ బరి నుంచి దిగుతానని స్పష్టం చేయడం ఇందుకు బలం చేకూరుతోంది. వివరాల్లోకి వెళితే.. 2009లో మడకశిర నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు కావడంతో కళ్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.
ఐదేళ్లలో దాదాపు రూ.2 వేల కోట్లతో కళ్యాణదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని తరచూ రఘువీరా చెబుతుంటారు. అదే నిజమైతే అక్కడ ప్రజలు ఆయన్ను ఆదరించాలి. అయితే క్షేత్ర స్థాయిలో అభివద్ధి మేడి పండు చందంగా ఉందన్న విమర్శలు ఉన్నాయి. పైగా రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం రోజురోజుకూ పెరుగుతుండడంతో అక్కడి నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదన్న అంచనాకు వచ్చిన రఘువీరారెడ్డి పెనుకొండ నుంచి బరిలోకి దిగాలని భావించినట్లు సమాచారం.
ఇదే విషయాన్ని బుధవారం మడకశిర, పెనుకొండలో జరిగిన సమావేశాల్లో ప్రకటించారు. కాగా పెనుకొండ నుంచి పోటీ చేయనున్న రఘువీరాకు ఆ నియోజకవర్గంలోని ఓ వర్గం టీడీపీ నేతలు సహకరించనున్నట్లు తెలిసింది. ఒక సామాజిక వర్గానికి చెందిన ఓట్లు తప్పకుండా మీకే పడేలా చూస్తామని నాయకులు హామీ ఇచ్చినట్లు సమాచారం. పైగా గతంలో జరిగిన ఓ ఘటనలో పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంపై కేసు నమోదైతే అరెస్ట్ కాకుండా మంత్రి హోదాలో ఉన్న రఘువీరా అప్పట్లో సహాయం చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.
దీనికి తోడు మొదట్నుంచి పెనుకొండ ఎమ్మెల్యే పార్థసారధిని వ్యతిరేకిస్తున్న ఆ వర్గం నేతలు.. దీన్ని అవకాశంగా తీసుకుని ఆయనకు చెక్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. తెలుగుదేశం పార్టీ నేతలు ఇచ్చిన అభయంతోనే ఈ సారి పెనుకొండ నుంచి పోటీ చేస్తానని రఘువీరా ప్రకటించినట్లు సమాచారం. పనిలో పనిగా సత్యసాయి ట్రస్ట్ సాయంతో పెనుకొండ నియోజకవర్గంలో తాగునీటి ఇబ్బందులు లేకుండా చేస్తానని హామీ ఇచ్చి ప్రజలను బుట్టలో వేసుకునే ప్రయత్నం చేశారు. ఏదేమైనా ఈ సారి పెనుకొండ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రఘువీరాకు తమ్ముళ్ల అభయం!
Published Thu, Apr 10 2014 3:36 AM | Last Updated on Wed, Aug 29 2018 5:50 PM
Advertisement