హామీలు మాఫీ చేస్తున్న చంద్రబాబు
కళ్యాణదుర్గం: రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం అని చెప్పి, పూటకో మాట చెబుతున్న చంద్రబాబు.. రుణమాఫీ మాటేమిటో గానీ ఇచ్చిన హామీలను మాఫీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రైతాంగం అయోమయంలో ఉందని, గత ఏడాది పంట నష్టానికి సంబంధించి ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా కలిపి రూ. 2,174 కోట్లు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు.
ఎకరాకు రూ. 4 వేల చొప్పున రూ. 1,374 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా రూ. 800 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చేసిన డిమాండ్ మేరకు ఎకరాకు రూ. 10 వేల ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేయించాలన్నారు. ప్రస్తుతం రైతులు కనీసం రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ భరించలేదా అని నిలదీశారు.
గతంలో 98 శాతం మహిళా రుణాల రికవరీ ఉండేదని, రుణమాఫీ హామీతో అప్పు చెల్లించలేక పోయారని తెలిపారు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగాలు తొలగించే విషయంలో శ్రద్ధ చూపిన పాలకులు.. పనులు కల్పించడంలో మాత్రం దృష్టి సారించలేకపోతున్నారని విమర్శించారు.