
రాజధానిపై దృష్టి సారించలేదు: ఆనం
హైదరాబాద్: సీమాంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం మధ్య, దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలని సీమాంధ్ర పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల కోసం స్వల్పకాలిక ప్రణాళిక తయారు చేయాలని యోచిస్తోంది. ఎన్నికల అజెండా చర్చించేందుకు ఇందిరాభవన్‌లో సీమాంధ్ర పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ సమావేశమయింది. రాయలసీమ పారిశ్రామిక, టూరిజం కారిడార్, రోడ్డు, రైల్వే, ఎయిర్‌పోర్టు, వాణిజ్య రవాణా వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మ్యానిఫెస్టో కమిటీ నిర్ణయించింది.
సీమాంధ్రకు రాజధాని ఎక్కడ ఉండాలనే దానిపై దృష్టి సారించలేదని పీసీసీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. సీమాంధ్రలో సోనియా, రాహుల్ ప్రచారం చేస్తారని చెప్పారు. ఏప్రిల్ మొదటివారంలో మ్యానిఫెస్టో ప్రకటిస్తామని వెల్లడించారు.